హైదరాబాద్‌: కరోనా బాధితుల్లో పురుషులే అధికం.. ఎందుకంటే..!

ABN , First Publish Date - 2020-04-10T13:25:28+05:30 IST

చిన్నా, పెద్ద తేడా లేదు. వయసుతో సంబంధం లేదు. ఎవరైనా సరే కరోనా రక్కసి బారిన పడుతున్నారు.

హైదరాబాద్‌: కరోనా బాధితుల్లో పురుషులే అధికం.. ఎందుకంటే..!

  • కరోనా బాధితుల్లో 122 మంది వారే..  
  • 35 మంది మహిళలు 8 13 మంది పిల్లలు

హైదరాబాద్‌ : చిన్నా, పెద్ద తేడా లేదు. వయసుతో సంబంధం లేదు. ఎవరైనా సరే కరోనా రక్కసి బారిన పడుతున్నారు. సాధారణంగా కరోనా వైరస్‌ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపైనే అధిక ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


హైదరాబాద్‌లో ఇందుకు భిన్నంగా..  

హైదరాబాద్‌లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో అందరిపై కరోనా వైరస్‌ దాడి చేస్తోంది. ఈ వైరస్‌ బారినపడిన వారిలో ఎక్కువ మంది పురుషులే ఉండటం గమనార్హం. హైదరాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 170 మందికి కరోనా వైరస్‌ సోకగా, అందులో 122 మంది పురుషులు ఉన్నారు. మహిళలు 35 మంది, పిల్లలు 13 మంది వైరస్‌ బారిన పడ్డారు.


అధికంగా 45 ఏళ్ల లోపే...

ఇప్పటి వరకు కరోనా వైరస్‌ సోకిన పురుషుల్లో 45 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. 15 నుంచి 45 ఏళ్ల లోపు వారు 98 మంది, 15 నుంచి 29 ఏళ్లలోపు వారు 40 మంది, 30 నుంచి 45 ఏళ్లలోపు వారు 48 మంది ఉన్నారు.  46 నుంచి 60 ఏళ్ల లోపు 42 మంది ఉన్నారు. ఇప్పటి వరకు బాధితుల్లో వృద్ధుల సంఖ్య తక్కువగానే ఉంది. జిల్లాలో 61 ఏళ్లు పైబడిన వారిలో 27 మందికి వైరస్‌ సోకింది. ఇందులో ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారు. 


మహిళలు 35

వైరస్‌ బాధితుల్లో ఇప్పటి వరకు 35 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 15 నుంచి 29 ఏళ్ల వారు 14 మంది, 30 నుంచి 45 ఏళ్ల లోపు వారు 9 మంది ఉన్నారు. 46 నుంచి 60 ఏళ్ల లోపు ఆరుగురు, 61 ఏళ్లపై బడిన వారు మరో ఆరుగురు మహిళలు ఉన్నారు.

 

పిల్లలు 13 మంది...

హైదరాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 13 మంది పిల్లలు వైరస్‌ బారిన పడ్డారు. ఇందులో ఐదేళ్లలోపు బాలురు తొమ్మిది మంది, బాలికలు నలుగురు ఉన్నారు.  


బయట తిరిగే వారే ఎక్కువ..

45 ఏళ్ల లోపు బయట తిరిగే వారు ఎక్కువగా ఉండడంతో కరోనా వైరస్‌ అధికంగా వారిపైనే ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎక్కువ ఫీల్డ్‌ వర్క్‌ చేసే ఉద్యోగాలు ఉండటంతో కూడా ఇందుకు కారణమని పలువురు భావిస్తున్నారు. 

Updated Date - 2020-04-10T13:25:28+05:30 IST