‘వరవర’ ప్రాణంపైనే గురిపెట్టారా?

ABN , First Publish Date - 2020-06-30T05:46:16+05:30 IST

భీమాకోరేగాం కేసులో నిందితుడిగా ఇరవై నెలలుగా జైలు నిర్బంధంలో ఉన్న వరవరరావుకు వయసు, ఆరోగ్యం, జైలులో కొవిడ్ వ్యాప్తి కారణాలతో తాత్కాలిక బెయిల్ ఇవ్వాలనే అభ్యర్థనను ముంబాయి ఎన్ఐఎ...

‘వరవర’ ప్రాణంపైనే గురిపెట్టారా?

జూన్ 24న ఆయన సహచరితో మాట్లాడిన నాలుగు నిమిషాల ఫోన్ సంభాషణలో వరవరరావు మాట ముద్దగా, బలహీనంగా వచ్చింది. పొంతన లేకుండా మాట్లాడారు. ఎప్పుడూ కంచుకంఠంతో నిరంతర ధారగా సాగే ఆయన మాట ఇలా కావడం ఆశ్చర్యకరం, విచారకరం. ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణిస్తున్నది. వైద్య సహాయం అందకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు.


భీమాకోరేగాం కేసులో నిందితుడిగా ఇరవై నెలలుగా జైలు నిర్బంధంలో ఉన్న వరవరరావుకు వయసు, ఆరోగ్యం, జైలులో కొవిడ్ వ్యాప్తి కారణాలతో తాత్కాలిక బెయిల్ ఇవ్వాలనే అభ్యర్థనను ముంబాయి ఎన్ఐఎ సెషన్స్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ పద్దెనిమిది నెలల్లో వరవరరావుకు బెయిల్ ఇవ్వగూడదని ప్రాసిక్యూషన్ వాదించడం, ఆ వాదనలను అంగీకరిస్తూ న్యాయమూర్తులు బెయిల్ నిరాకరించడం ఐదుసార్లు జరగగా ఈ రెండు నెలల్లో ఇది రెండోసారి. ‘బెయిల్ ఈజ్ రూల్ అండ్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్’ (బెయిల్ ఇవ్వడమే సాధారణం, జైలులో ఉంచడం అసాధారణం) అనేది భారత న్యాయ వ్యవస్థ మౌలిక సూత్రాలలో ఒకటి. కాని వరవరరావు విషయంలో, మొత్తంగా భీమా కోరేగాం నిందితుల విషయంలో న్యాయస్థానాలు ఈ మౌలిక సూత్రాన్ని పాటించడం లేదు. మరొకపక్క, కరుడుగట్టిన నేరస్థులకు, సామూహిక ఊచకోతల్లో పాల్గొన్నవారికి, బహిరంగంగా టీవీ కెమెరాల ముందర తుపాకులతో బెదిరించినవారికి, స్త్రీలపై అత్యాచారాలు చేసినవారికి న్యాయస్థానాలు బెయిల్ ఇస్తూనే ఉన్నాయి. శిక్ష పడిన ఖైదీలను కూడా వయసు, ఆరోగ్య కారణాలు చూపి విడుదల చేస్తూనే ఉన్నాయి.


ప్రత్యేకించి వరవరరావు విషయంలో ఈ ఇరవై నెలల్లో సాధారణ బెయిల్ దరఖాస్తులను, సాంకేతిక కారణాల బెయిల్ దరఖాస్తులను తిరస్కరించడం ఒక ఎత్తు కాగా, వయసు, ఆరోగ్యం, కొవిడ్ కారణాల మీద మే 15న దాఖలైన ప్రస్తుత బెయిల్ దరఖాస్తును తిరస్కరించడం చట్టబద్ధ పాలనకూ, సహజ న్యాయసూత్రాలకూ, మానవతకూ సవాల్. ఇక్కడ ఆ మూడు బలమైన కారణాలతో పాటు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెల్లువెత్తిన నిరసనను కూడా పాలకులు, ప్రాసిక్యూషన్ పరిగణనలోకి తీసుకోలేదు. ప్రాసిక్యూషన్ వాదనను న్యాయమూర్తి సంపూర్ణంగా అంగీకరించారు. 


వరవరరావు 2018 ఆగస్ట్ 28న (సుప్రీంకోర్టు జోక్యం వల్ల మర్నాటి నుంచి గృహ నిర్బంధం మొదలై, అన్ని న్యాయమార్గాలూ అయిపోయి, చివరికి నవంబర్ 17న) అరెస్టయ్యే నాటికి ఆయన 78 సంవత్సరాలు నిండిన పెద్దమనిషి. పుణె లోని యరవాడ జైలులో 79వ పుట్టినరోజు గడిచిపోయింది. మరొక నాలుగు నెలల్లో 80వ పుట్టినరోజు రాబోతున్నది. ఈ వయసు ఎవరికైనా సహజంగానే ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. ఇక జైలు జీవితంలోని ఆందోళన, సరైన ఆహారం, నిద్ర లేకపోవడం, జైలులో చదువుకూ రాతకూ అవసరమైన కుర్చీ, బల్ల, పడుకోవడానికి మంచం వంటి కనీసమైన సౌకర్యాలు కూడా లేకపోవడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించింది. అంతకు ముందరి ఏడు సంవత్సరాల జైలు జీవితంతో ఆయనకు హెమరాయిడ్స్, ప్రోస్టేటోమెగాలీ, కరొనరీ ఆర్టరీ డిసీజ్, ఎడీమా, హైపర్ టెన్షన్, ఆసిడిటీ, సైనస్/మైగ్రేన్ వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి, తీవ్రతరమయ్యాయి. 


మొదట పదహారు నెలల పుణె యరవాడ జైలులో గాని, గత నాలుగు నెలలుగా నవీ ముంబాయి తలోజా జైలులోగాని ఈ వ్యాధులకు చికిత్స చేయకపోగా, కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. తలోజా జైలులోకి వెళ్లిన మూడు నెలల్లోనే ఆయన హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయారని, జైలు ఆస్పత్రిలో చికిత్స చేయలేకపోయామని, ముంబాయిలోని జెజె ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కోర్టుకు సమర్పించిన ఆ ఆస్పత్రి నివేదికను బట్టి ఆయన సృహతప్పి పడిపోవడానికి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ విపరీతంగా పడిపోవడమే కారణమని తెలుస్తున్నది. ఈ ఎలక్ట్రోలైట్స్‌లో సోడియం, పొటాషియం పడిపోతే తీవ్ర పరిణామాలుంటాయి. ప్రాణాంతకం కూడ కావచ్చు. సోడియం 134 నుంచి 145 మిల్లి ఈక్వలెంట్స్/లీటర్, పొటాషియం 3.5 నుంచి 5.0 మిల్లిమోల్స్/లీటర్ ఉండవలసి ఉండగా, ఆయన ఆస్పత్రిలో చేరే సమయానికి సోడియం 115, పొటాషియం 2.6 ఉన్నాయి. ఆయనను ఆస్పత్రికి తరలించారని తెలిసి రాష్ట్రంలోనూ, దేశంలోనూ, అంతర్జాతీయంగానూ పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చెలరేగగానే దాని నుంచి తప్పించుకోవడానికి ఆయనను మళ్లీ జైలుకు పంపాలని నిర్ణయం తీసుకుని, ఆ రెండు ఎలక్ట్రోలైట్స్ సాధారణ స్థాయిలో కనిష్ట స్థితికి (సోడియం 133, పొటాషియం 3.55) రాగానే జైలుకు పంపేశారు. కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారమే రెండు వారాల తర్వాత పరీక్ష కోసం జెజె ఆస్పత్రికి మళ్లీ తీసుకురావాలని ఉంది. కాని అలా తీసుకుపోయిన దాఖలాలు లేవు. అంటే పోలీసులు, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన నిర్లక్ష్యం వల్ల తర్వాతి నాలుగు వారాలలో ఆయన ఆరోగ్యం మళ్లీ దారుణంగా క్షీణించింది. జూన్ 24న ఆయన సహచరితో మాట్లాడిన నాలుగు నిమిషాల ఫోన్ సంభాషణలో ఆయన మాట ముద్దగా, బలహీనంగా వచ్చింది. పొంతన లేకుండా మాట్లాడారు. ఎప్పుడూ కంచుకంఠంతో నిరంతర ధారగా సాగే ఆయన మాట ఇలా కావడం ఆశ్చర్యకరం, విచారకరం. సోడియం, పొటాషియం అసమతుల్యత వల్ల మతిమరుపు, గందరగోళం, పొంతన లేకపోవడం వంటి లక్షణాలన్నీ తలెత్తుతాయని వైద్యులు చెపుతున్నారు. అంటే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణిస్తున్నది. వైద్య సహాయం అందకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు.


ఈమధ్యలో మహారాష్ట్ర జైళ్లలో కరోనా వైరస్ విజృంభించింది. తలోజా జైలులోనే రెండు మరణాలు సంభవించాయి. 2,124 మంది ఖైదీలు ఉండవలసిన ఆ జైలులో ఇప్పటికే 3,500 మంది ఉన్నారు. ఈ కిక్కిరిసిన వాతావరణంలో, ఆ వయసులో, ఆ ఆరోగ్యస్థితిలో కొవిడ్ సోకే అవకాశాలు మరింత ఎక్కువ. కనుక వయసు, ఆరోగ్యం, కొవిడ్ వ్యాప్తి, కొవిడ్ సమయంలో ఖైదీల విషయంలో తీసుకోవలసిన చర్యల గురించి సుప్రీం కోర్టు, మహారాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికార కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారం ఆయనను వెంటనే విడుదల చేయడం, మెరుగైన వైద్య సహాయం అందించడం అత్యవసరం. 


ఆయనను ఆస్పత్రికి తరలించారని మే 28న బైటపడినప్పటి నుంచి, గడిచిన నాలుగు వారాలలో ఆయన ఆరోగ్యం పట్ల, భద్రత పట్ల విపరీతమైన ఆందోళన చెలరేగింది. అనేక రంగాల ప్రముఖులు సంఘీభావాన్ని ప్రకటించారు. ఆయనను విడుదల చేయాలనీ, మెరుగైన ఆరోగ్య చికిత్స అందించాలనీ భారత ప్రభుత్వానికీ, మహారాష్ట్ర ప్రభుత్వానికీ విజ్ఞప్తులు చేశారు. దేశవ్యాప్తంగా సుప్రసిద్ధ కవులు, అంతర్జాతీయ స్థాయిలో విద్యావేత్తలు, మేధావులు, పెన్ ఇంటర్నేషనల్, పెన్ ఇండియా వంటి సాహిత్య సంస్థలు, ఐక్యరాజ్య సమితి మానవహక్కుల వేదిక, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, పియుసిఎల్, పియుడిఆర్ వంటి హక్కుల సంస్థలు, వందలాది మంది సినిమా, సాహిత్య, సాంస్కృతిక రంగ ప్రముఖులు, పార్లమెంటు సభ్యులు విజ్ఞప్తులు చేసినవారిలో ఉన్నారు. ఆయన 1968 నాటి నుంచీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సమర్థిస్తూ, ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు గనుక ఆయన విడుదల విషయంలో, ఆరోగ్యం విషయంలో జోక్యం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కూడ అనేక విజ్ఞప్తులు వచ్చాయి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌‍లో అనేకచోట్ల ప్రదర్శనలు జరిగాయి, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. బెంగాల్‍లో రిలీజ్ ది పొయెట్ పేరుతో రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమం మొదలైంది. సోషల్ మీడియాలో వేలాది మంది స్పందించారు. కాని ఈ ఆందోళననూ విజ్ఞప్తులనూ ప్రభుత్వాలేవీ ఖాతరు చేయలేదు, న్యాయవ్యవస్థ పట్టించుకోలేదు.


పాలకుల వైఖరి చూస్తుంటే, ఇటలీలో ఫాసిజం అధికారానికి వచ్చాక జరిగిన పరిణామాలు గుర్తుకొస్తున్నాయి. ఇటలీలో 1922 అక్టోబరులో కుట్రపూరితంగా ప్రధానిగా అధికారానికి వచ్చిన బెనిటో ముస్సోలినీ, 1926 నవంబరులో ఇటలీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఆంటోనియో గ్రాంషిని ప్రధాని హత్యకు కుట్ర చేశారనే ఆరోపణ సాకుతో నిర్బంధించాడు. అప్పటికే చట్టసభ సభ్యుడుగా ఉన్న గ్రాంషికి ఆ పదవి వల్ల అరెస్టు చేయగూడదనే రక్షణ ఉన్నప్పటికీ, ఆ చట్ట నిబంధనను ఖాతరు చేయలేదు. విచారణ క్రమంలో ‘‘ఈ మెదడు ఇరవై సంవత్సరాల పాటు పని చేయకుండా చూడడమే ఇటాలియన్ ప్రభుత్వ లక్ష్యం’’ అని ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి చెప్పాడు. న్యాయస్థానం మొదట ఐదు సంవత్సరాల శిక్ష వేసి, ఏడాది తర్వాత ఆ శిక్షను ఇరవై ఏళ్లుగా మార్చింది. ఈ నిర్బంధంతో గ్రాంషి ఆరోగ్యం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆయనను విడుదల చేయమని అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి రావడంతో జైలు నుంచి ఆస్పత్రికితరలించారు గాని అక్కడ కూడ సరైన వైద్య చికిత్స అందించలేదు. రెండు సంవత్సరాలు సరైన చికిత్స లేకుండా ఆస్పత్రులలో ఉంచిన తర్వాత గ్రాంషి 1937 ఏప్రిల్‌లో మరణించాడు.


అబద్ధాల ఆధారంగా కేసు, విచారణ, నిరూపణ లేకుండానే అమలవుతున్న శిక్ష, బెయిల్ విషయంలో న్యాయసూత్రాల ఉల్లంఘన, కేసు పునర్విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టగానే కేంద్రం తన చేతిలోకి తీసుకుని ఎన్‍ఐఎకు అప్పగించడం, వయసు, ఆరోగ్యం, కొవిడ్ వంటి కారణాలను, విస్తృత స్పందనను లెక్కచేయకపోవడం, జోక్యం చేసుకోవలసినవాళ్లు మౌనం వహించడం – ఇటీవలి సుప్రసిద్ధ గీతంలో చెప్పినట్టు ‘సబ్ యాద్ రఖా జాయెగా’. ప్రతి ఒక్కరి నేరాన్నీ చరిత్ర నమోదు చేస్తుంది. గ్రాంషిని అంత హింసించిన నియంత ముస్సోలినీకి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో చరిత్ర నమోదు చేసింది. 

ఎన్. వేణుగోపాల్

Updated Date - 2020-06-30T05:46:16+05:30 IST