రగులుతున్న లక్షదీప్.. కొత్త చట్టాలతో రచ్చ రచ్చ.. ఇంతకీ ఆ చట్టాల్లో ఏముందంటే..

ABN , First Publish Date - 2021-06-01T14:55:15+05:30 IST

భారతదేశంలో అత్యంత సుందరమైన ప్రదేశాల్లో లక్షద్వీప్ ఒకటి. ఈ 37 దీవుల సముదాయంలో కేవలం పదింటిలోనే ప్రజలు నివశిస్తుంటారు. ప్రకృతి అందాలకు, బీచ్‌లకు పేరెన్నికగన్న ఈ కేంద్ర పాలిత ప్రాంతం ఇప్పుడు నిరసనలతో నిండిపోయింది.

రగులుతున్న లక్షదీప్.. కొత్త చట్టాలతో రచ్చ రచ్చ.. ఇంతకీ ఆ చట్టాల్లో ఏముందంటే..

భారతదేశంలో అత్యంత సుందరమైన ప్రదేశాల్లో లక్షద్వీప్ ఒకటి. ఈ 37 దీవుల సముదాయంలో కేవలం పదింటిలోనే ప్రజలు నివశిస్తుంటారు. ప్రకృతి అందాలకు, బీచ్‌లకు పేరెన్నికగన్న ఈ కేంద్ర పాలిత ప్రాంతం ఇప్పుడు నిరసనలతో నిండిపోయింది. ప్రశాంతతను కోల్పోయింది. ఎందుకిలా జరిగింది? దీనికి కారకులెవరు? అంటే వినిపించే పేరు ప్రఫుల్ కె. పటేల్. ఆయన్ను లక్షద్వీప్ నూతన అడ్మినిస్ట్రేటర్‌గా గతేడాది డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ పదవి స్వీకరించిన వెంటనే ఆయన జనవరిలో కొన్ని చట్టాలు చేయడానికి ప్రతిపాదనలు చేశారు. ఆయన చేసిన ప్రతిపాదనలన్నీ ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయంటూ ప్రజలు దుయ్యబట్టారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా లక్షద్వీప్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.


ఇటీవలి కాలంలో లక్షద్వీప్ ప్రజల ఆగ్రహ జ్వాలలకు అనుకోని విధంగా మద్దతు లభించింది. మలయాళీ సినీ హీరోలు, సెలెబ్రిటీలు, చివరకు కేరళ ప్రభుత్వం కూడా లక్షద్వీప్‌కు అండగా నిలిచింది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా లక్షద్వీప్ ప్రజలకు అండగా నిలబడి ప్రఫుల్ పటేల్‌ను వెనక్కు పిలవాలంటూ సాక్షాత్తు రాష్ట్రపతికి లేఖలు రాశారు. దీంతో ‘సేవ్ లక్షద్వీప్’ క్యాంపెయిన్ ఊపందుకుంది. ఇంతకీ ప్రఫుల్ చేసిన ప్రతిపాదనల్లో ఏముంది? ఎందుకు ప్రజలు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? 


గూండా చట్టం:

లక్షద్వీప్‌లో ప్రఫుల్ చేసిన ప్రతిపాదనల్లో యాంటీ సోషల్ యాక్టివిటీస్ రెగ్యులేషన్ బిల్-2021 ఒకటి. దీన్ని గూండా చట్టం అని కూడా పిలుస్తారు. దీని ప్రకారం ఎవరిపైన అయినా అనుమానం వస్తే, పోలీసులు సదరు వ్యక్తిని ఏడాది పాటు అరెస్టు చేసి జైల్లో ఉంచొచ్చు. అయితే లక్షద్వీప్‌లో క్రైం రేటు చాలా తక్కువ. అలాంటి చోట ఇలాంటి కఠినమైన చట్టాలెందుకు? అనేది ప్రజల వాదన. ఇక్కడి జనాభాలో 90శాతం ముస్లింలు. అందుకే ఇలాంటి చట్టం చేశారంటూ ఆరోపణలూ వస్తున్నాయి.


ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు:

మరో వివాదాస్పద ప్రతిపాదన లక్షద్వీప్ డెవలప్‌మెంట్ అథారిటీ రెగ్యులేషన్-2021. దీని ప్రకారం, అభివృద్ధి కార్యక్రమాలు, టౌన్ ప్లానింగ్ కోసం దీవుల్లోని ప్రజల నుంచి వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం అడ్మినిస్ట్రేటర్‌కు ఉంటుంది. లక్షదీప్ అభివృద్ధి కోసమే ఈ తరహా చట్టం చేస్తున్నామని అడ్మినిస్ట్రేటర్ చెప్పుకొస్తున్నారు. కానీ ఈ చట్టం కూడా తీవ్ర వివాదాస్పదమైంది? మితిమీరిన అభివృద్ధి, భవన నిర్మాణాల వల్ల దీవుల సహజ సౌందర్యం కూడా దెబ్బ తింటుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టులు దీవుల పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్:

దీవుల్లో మద్యం విక్రయాలకు అనుమతులిచ్చారు ప్రఫుల్. ఇప్పటి వరకూ లక్షద్వీప్‌లో కేవలం ఒక్క దీవిలోనే మద్యం అమ్మకం జరిగేది. అయితే ప్రఫుల్ తాజా ప్రతిపాదనతో అన్ని దీవుల్లోని రిసార్టుల్లో మద్యం అమ్ముకోవచ్చు. లక్షద్వీప్‌లో 90శాతంపైగా ముస్లింలే ఉంటారు. వాస్తవానికి ఇక్కడ ఆల్కహాల్‌కు అనుమతి ఉండదు. అలాంటిది, ఏకంగా మద్యం అమ్మకాలు మొదలు పెట్టాలనడం ప్రజాగ్రహానికి దారి తీసింది. మద్య నిషేధానికి ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి, మద్యం అమ్మకాలను మొదలు పెడతామనడం ఎంత వరకు సమంజసమని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు.


అధిక సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు:

ప్రఫుల్ ప్రతిపాదంచిన పంచాయతీ రాజ్ మార్గదర్శకాల ప్రకారం, ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉన్న వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఇప్పటికే ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు.. ఇకపై పిల్లలను కనకపోతే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఇక్కడ ముస్లిం జనాభా అధికం. ముస్లింలలో సంతానం కూడా అధికంగానే ఉంటుంది. దీంతో వీరిని టార్గెట్ చేసి ఈ చట్టం చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో వివాదం మరింత తీవ్రతరం అయింది.


కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ నిరసనలు:

లక్షద్వీప్‌లో నిరసనల నేపథ్యంలో నూతన అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కె. పటేల్‌పై విమర్శలు బాగా వస్తున్నాయి. ఆయన గత డిసెంబరులో పదవి స్వీకరించినా కూడా ఇప్పటి వరకూ కేవలం 20 రోజులు మాత్రమే లక్షద్వీప్‌లో ఉన్నారని స్థానిక ఎంపీ, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ ఆరోపించారు. ‘‘సాధారణంగా దీవుల్లో ఏదైనా తప్పు జరిగితే అడ్మినిస్ట్రేటర్‌ను ఆశ్రయిస్తాం. అక్కడే తప్పు ఉంటే ఎవర్ని అడగాలి? డామన్ డయ్యూ ఎంపీ మోహన్ డేల్కర్ ఆత్మహత్య కేసు నిందితుల్లో ప్రఫుల్ పేరు కూడా ఉంది. అలాంటి వ్యక్తి వల్ల ఇలా చెడ్డ పేరు వస్తున్నా కేంద్రం ఎందుకు ఊరుకుంటుందో తెలియడం లేదు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు మా పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారు’’ అని ఫైజల్ తెలిపారు. అలాగే లక్షద్వీప్‌కు మద్దతుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా గళం విప్పారు. ఈ దీవుల సముదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రఫుల్ పటేల్‌ను వెనక్కు పిలిచి, దీవుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కబెట్టేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ తాజాగా ఒక తీర్మానం చేసింది. ఇలా లక్షద్వీప్‌కు మద్దతుగా తీర్మానం చేసిన తొలి రాష్ట్రం ఇదే. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు కూడా లక్షద్వీప్‌కు మద్దతుగా నిలబడుతున్నాయి. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సహా ఇతర ప్రముఖ నటులు కూడా లక్షద్వీప్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా ట్విటర్‌లో గొంతు విప్పారు. దీంతో ‘సేవ్ లక్షద్వీప్’ అనే అంశం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. మరి దీనిపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో? ప్రజలకు మద్దతుగా నిలిచి ప్రఫుల్‌ను తప్పిస్తుందా? లేక ప్రఫుల్‌కు కొనసాగిస్తుందా? అనేది తెలియాలి.


మాంసాహారం అమ్మకాలపై ఆంక్షలు:

గోవులు, ఎద్దులు, బర్రెలు, గొర్రెలు, దున్నపోతులు.. ఇలా జంతువులను వధించడం, వాటి మాంసం అమ్మడాన్ని నిషేధించడం ప్రఫుల్ చేసిన మరో ప్రతిపాదన. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది సాధ్యమా? వారికి బీఫ్ బాగా అలవాటు. గోవధపై నిషేధం వరకు సరే కానీ, మిగతా జంతువులపైనా నిషేధం విధిస్తే ఎలా? అనేది మెజార్టీ మంది  వాదన. ముస్లింలు కాకుండా ఈ దీవుల్లో ఉండే ఆదివాసీలు కూడా ఎక్కువగా మాంసంపైనే ఆధార పడతారు. వారికీ ఈ కొత్త ప్రతిపాదన రుచించడం లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్ అమ్మకాల గురించి ఎవరూ మాట్లాడరు. మొన్నటి ఎన్నికల్లో అస్సాం, కేరళ రాష్ట్రాల్లో కూడా బీఫ్ అమ్మకాలు గురించి ఏ నేతా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు లక్షద్వీప్‌లో మాత్రం ఆహారంపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇదేంటని అడిగితే పాలిచ్చే జంతువుల్ని రక్షించడం కోసమే ఈ చట్టం అని సమాధానమిచ్చినా ఆ వాదనలో పస కనిపించడం లేదు. ఈ నిర్ణయం తమ స్వేచ్ఛకు, ఆహారపు అలవాట్లకు భంగం కలిగించేదిగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. కనీసం స్థానిక సంస్థలతోనైనా సంప్రదించలేదని ఆరోపిస్తున్నారు.


కట్టుతప్పిన కరోనా.. మొన్నటి వరకు గ్రీన్ జోన్..

ఇక్కడ ఇప్పటి వరకూ 7,300 కరోనా కేసులు వెలుగు చూశాయి. 28 మంది ఈ వైరస్‌కు బలయ్యారు కూడా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. కరోనా వచ్చిన ఏడాది వరకూ లక్షద్వీప్‌లో ఒక్క కరోనా పాజిటివ్ కేసూ లేదు. కఠినమైన క్వారంటైన్ నిబంధనలు, ఇక్కడకు వచ్చే వారికి కరోనా పరీక్షలు చేసిన తర్వాతే అనుమతించడం వంటి చర్యలతో ఇది సాధ్యమైంది. అయితే గతేడాది డిసెంబరులో ఈ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. ఆర్‌టీ-పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటే చాలు దీవుల్లోకి వెళ్లొచ్చని చెప్పింది. అప్పటి నుంచి ఇక్కడ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రభుత్వ యంత్రాంగమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-06-01T14:55:15+05:30 IST