ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కరోనా కేసులు.. మరి బ్లాక్ ఫంగస్ కథేంటి..? ఒక్క భారత్‌లోనేనా..?

ABN , First Publish Date - 2021-05-25T20:33:28+05:30 IST

ప్రస్తుతం కరోనా మహమ్మారి ధాటికి గడగడలాడుతున్న భారత్‌కు మరో పెద్ద తలనొప్పి బ్లాక్ ఫంగస్. మ్యూకర్‌మైకాసిస్ అని కూడా పిలిచే ఈ ఇన్‌ఫెక్షన్ భారతదేశంలో నెమ్మదిగా పెరుగుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కరోనా కేసులు.. మరి బ్లాక్ ఫంగస్ కథేంటి..? ఒక్క భారత్‌లోనేనా..?

ప్రస్తుతం కరోనా మహమ్మారి ధాటికి గడగడలాడుతున్న భారత్‌కు మరో పెద్ద తలనొప్పి బ్లాక్ ఫంగస్. మ్యూకర్‌మైకాసిస్ అని కూడా పిలిచే ఈ ఇన్‌ఫెక్షన్ భారతదేశంలో నెమ్మదిగా పెరుగుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు పాకిన ఈ బ్లాక్ ఫంగస్ కరోనా పేషెంట్లనే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. దీనికి ప్రధాన కారణం అపరిశుభ్ర ఆక్సిజన్ సరఫరా పద్ధతులు, అధిక స్టెరాయిడ్ల వాడకం. ఈ విషయం తెలిసినా సరే భారత్ ఏమీ చేయలేని పరిస్థితి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో ఎంతటి విలయ పరిస్థితులు ఉన్నాయో తెలిసిందే. ఈ పరిస్థితిని తట్టుకోవాలంటే తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్న కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా అందించాల్సిందే. దీనికి తోడు ప్రతి రోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్న ఈ సమయంలో పేషెంట్ల చికిత్సలో స్టెరాయిడ్ల వినియోగం తప్పడం లేదు.


ఇప్పటికి భారతదేశంలో 8,858 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు కేంద్ర మంత్రి సదానంద గౌడ వెలల్డించారు. కరోనాలాగానే ఈ ఫంగస్ కూడా పెరిగిపోతే ఎలా?. అందుకే, ఈ పరిస్థితిని నిలువరించడం కోసం భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్లాక్ ఫంగస్ లేక మ్యూకర్‌మైకాసిస్‌ చికిత్సకు ముఖ్యమైన ఆంఫోటెరిసిన్-బి వయల్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, బ్లాక్ ఫంగస్ అనేది మ్యూకర్‌మైసెటిస్ అనే వాటి వల్ల వచ్చే అరుదైన ఇన్‌ఫెక్షన్. ఇది కేవలం భారతదేశంలోనే కాదు చైనా వంటి దేశాల్లో కూడా కనిపించింది. ముఖ్యంగా డయాబెటిస్, కేన్సర్, రోగ నిరోధక శక్తిని తగ్గించే హెచ్ఐవీ ఎయిడ్స్ వంటి వ్యాధులతో బాధపడే వారిని ఈ ఫంగస్ టార్గెట్ చేస్తుంది.


ఇప్పుడు కరోనా పేషెంట్లు, అందునా డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, కేన్సర్ వంటి సమస్యలు ఉన్న వారిపై ఈ బ్లాక్ ఫంగస్ తీవ్రమైన ప్రభావం చూపుతోంది. భారత్‌లో ఈ ఫంగస్ పెరగడానికి కారణమేంటని చాలా మంది ప్రశ్నలు కురిపిస్తున్నారు. దీనికి కొందరు నిపుణులు చెప్తున్న సమాధానం ఏంటంటే.. భారత్‌లో చాలా చోట్ల పేషెంట్లకు ఆక్సిజన్ అందించడంలో అపరిశుభ్ర పద్ధతులు అమలు చేస్తున్నారట. బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి ఇదో కారణం. దీంతోపాటు కరోనా పేషెంట్ల చికిత్సలో విపరీతంగా వాడే స్టెరాయిడ్లు కూడా ఒక కారణమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెండింటినీ అదుపు చేయడం దాదాపు అసాధ్యం. మరి ఈ ఫంగస్ ఇతర దేశాల్లో కనిపించలేదా? అదే నిజమైతే ఎందుకిలా జరిగింది? అనేది కీలకమైన ప్రశ్న.


ప్రపంచం మొత్తం కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో.. బ్లాక్ ఫంగస్ సమస్య కేవలం భారత్‌నే ఎందుకింతలా పీడిస్తోంది? అంటే దీనికి సరైన సమాధానం చెప్పడం కష్టమే. కానీ ఈ సమస్య మనదేశానికే పరిమితం కాదు. ప్రపంచం మొత్తం నమోదైన బ్లాక్ ఫంగస్ కేసుల్లో 71శాతం భారత్‌లో ఉన్న మాట మాత్రం వాస్తవం. మిగతా వాటిలో ఎక్కువ భాగం మన దాయాది దేశం పాకిస్తాన్‌లోనూ, రష్యాలోనూ కనిపించాయి. ఇటీవలి కాలంలో రష్యాలో ఈ ఫంగస్ కేసులు బాగా పెరిగాయని సమాచారం. ఇక్కడ కూడా భారత్‌లోలానే కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లలోనే ఈ ఫంగస్ ఎక్కువగా వెలుగు చూస్తోంది. ఈ నెల 17న రష్యా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే ఇది అంటువ్యాధి కాదని, కాబట్టి ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకే ప్రమాదం లేదని మాత్రం తెలిపింది. అంటే కరోనాతో పాటు భారతీయులను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్ కేవలం మన దేశానికే పరిమితమైన సమస్య కాదు. మిగతా దేశాల్లో కూడా ఇవే పరిణామాలు కనిపిస్తున్నాయి. కానీ మనదేశంలో మాత్రం పరిస్థితులు మరీ భయానకంగా ఉన్నాయి.

Updated Date - 2021-05-25T20:33:28+05:30 IST