తనిఖీలు ఎందుకు చేయడం లేదు?

ABN , First Publish Date - 2021-12-09T04:52:55+05:30 IST

జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పనులను ఎందుకు తనిఖీ చేయడం లేదని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు.

తనిఖీలు ఎందుకు చేయడం లేదు?
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- అధికారులపై కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆగ్రహం

శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి, డిసెంబరు 8 : జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పనులను ఎందుకు తనిఖీ చేయడం లేదని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖ పనుల విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలో వివిధ శాఖలకు చెందిన 1,122 పనులను రెండు నెలల్లో తనిఖీ చేయాల్సి ఉందన్నారు. ఇందుకు 17 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కానీ, ఇంతవరకు 76 పనులను మాత్రమే తనిఖీ చేయడంపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. పనుల రికార్డులు ఇరిగేషన్‌ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయన్నారు. పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు సిద్ధంగా ఉన్నప్పటికీ సమన్వయ లోపంతో తనిఖీలు పూర్తి కావడం లేదన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు పనులపై ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఎప్పటికప్పుడు సమావేశాలు జరుగుతున్నాయన్నారు. అందువల్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఇంకా 30 రోజులు గడువు మాత్రమే ఉందన్నారు. వచ్చే సమావేశానికి  పనుల తనిఖీలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ పి.సుధాకర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


ధాన్యం కొనుగోలు ప్రారంభించండి 

మెళియాపుట్టి : ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈనెల 15 నాటికి ప్రారంభించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆదేశించారు. బుధవారం ఆయన  పెద్దలక్ష్మీపురం, పట్టుపురం గ్రామ సచివాలయాలను సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుఫాన్‌ వల్ల పంటలు నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ఆయనను కోరారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ.. పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించామన్నారు. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. అనంతరం రేషన్‌ సరుకుల పంపిణీపై ఆరా తీశారు. వలస వెళ్లిన వారి రేషన్‌ కార్డులు తొలగించాలని డీటీ ప్రసాదరావును ఆదేశించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చూడాలన్నారు. ఓటీఎస్‌ ద్వారా లబ్ధిదారులు కట్టిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు బ్యాంకులో జమచేయాలని తెలిపారు. ఓటీఎస్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించాలని సూచించారు. రైతుభరోసా కేంద్రాల నిర్మాణంలో ఎందుకు జాప్యమవుతుందని ప్రశ్నించారు.  కార్యక్రమంలో ఎంపీపీ ఈశ్వరమ్మ, తహసీల్దార్‌ ప్రసాదరావు, ఎంపీడీవో చంద్రకుమారి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-12-09T04:52:55+05:30 IST