ఇప్పుడెందుకో?

ABN , First Publish Date - 2020-11-26T05:33:12+05:30 IST

వైద్యఆరోగ్యశాఖలో తాజాగా కొలువులు సాధించిన మరో ఇద్దరు ఉద్యోగులు రాజీనామా చేశారు. కొలువు సాధించిన కొద్దిరోజుల వ్యవధిలోనే అనారోగ్యం కారణమని ఒకరు.. మానసికస్థితి బాగోలేదని మరొకరు.. విధుల నుంచి తప్పుకున్నారు. కష్టపడి కొలువులు సాధించి... ఆకస్మికంగా రాజీనామా చేయడం వెనుక ‘నకిలీ సర్వీస్‌ సర్టిఫికెట్ల డొంక’ కదులుతుండడమే కారణమన్న ప్రచారం జోరందుకుంది.

ఇప్పుడెందుకో?
డీఎంహెచ్‌వో కార్యాలయం

 వైద్యఆరోగ్య శాఖలో మరో ఇద్దరు రాజీనామా

 అనారోగ్యం... మానసికి స్థితి బాగోలేదంటూ విధులకు స్వస్తి

 నకిలీ సర్వీస్‌ సర్టిఫికెట్ల బాగోతమే కారణమని ప్రచారం

 చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు మరో ఫిర్యాదు 

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

వైద్యఆరోగ్యశాఖలో తాజాగా కొలువులు సాధించిన మరో ఇద్దరు ఉద్యోగులు రాజీనామా చేశారు. కొలువు సాధించిన కొద్దిరోజుల వ్యవధిలోనే అనారోగ్యం కారణమని ఒకరు.. మానసికస్థితి బాగోలేదని మరొకరు.. విధుల నుంచి తప్పుకున్నారు. కష్టపడి కొలువులు సాధించి... ఆకస్మికంగా రాజీనామా చేయడం వెనుక ‘నకిలీ సర్వీస్‌ సర్టిఫికెట్ల డొంక’ కదులుతుండడమే కారణమన్న ప్రచారం జోరందుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం పరిధిలో ఇటీవల కాంట్రాక్టు ప్రాతిపదికన ఫార్మాసిస్టు, స్టాఫ్‌నర్శు, ల్యాబ్‌టెక్నీషియన్‌ పోస్టులు భర్తీ ప్రక్రియ జరిగింది. స్టాఫ్‌నర్శులు, ఫార్మాసిస్ట్‌ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు విధుల్లో కూడా చేరిపోయారు. అయితే కొంతమంది నకిలీ సర్టిపికెట్లతో ఈ కొలువులు సాధించారనే ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలో నకిలీ సర్వీస్‌ సర్టిఫికెట్ల ఉదంతంలో మోనిక అనే అభ్యర్థినిపై క్రిమినల్‌ కేసు నమోదైంది. ఈ సంఘటనకు ముందుగానే ఆమె తన ఫార్మాసిస్ట్‌ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. అయినప్పటికీ జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభమైంది. ఇతర జిల్లాల నుంచి తెచ్చి దరఖాస్తులతో సమర్పించిన సర్వీస్‌ సర్టిఫికెట్లపైనే అందరికీ అనుమానాలుండడంతో వాటినిగ్గు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ఈలోగా ఉద్యోగాలు చేస్తున్న మరికొందరు రాజీనామా బాటపట్టడంతో వారి సర్వీస్‌ సర్టిఫికెట్లపైనా మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లావేరు మండలం మురపాకలో ఈ ఏడాది సెప్టెంబర్‌ 25న ఫార్మాసిస్ట్‌గా ఓ మహిళ విధుల్లో చేరారు. ఈ అభ్యర్థిని సమర్పించిన సర్వీస్‌ సర్టిఫికెట్‌పైనా కొంతమంది ఫిర్యాదు చేశారు. తాజాగా ఫార్మాసిస్ట్‌ పోస్టుకు ఈనెల 23న ఆమె రిజైన్‌ చేసేశారు. అనారోగ్యం, ఆపై మానసిక స్థితి బాగోలేదని కారణంగా చూపి తాను ఉద్యోగం వదులుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఫార్మాసిస్టు ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు మురపాక పీహెచ్‌సీ వైద్యాధికారి కూడా  ధ్రువీకరించారు. ఉద్యోగంలో చేరడం.. ఇప్పుడేమో ఆకస్మాత్తుగా రిజైన్‌ చేయడంపైనా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వీస్‌ సర్టిఫికెట్‌ వ్యవహారం రాజీనామాకు కారణమని ప్రచారం జరుగుతోంది. ఇక మందస మండలంలో, జలుమూరు మండలంలో పీహెచ్‌సీలో ఒక ఫార్మాసిస్టు, ఒక స్టాఫ్‌నర్శు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇంకొందరు అభ్యర్థులు కూడా రాజీనామా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదిక అయినప్పటికీ కొలువుల కోసం ఆరాటపడి.. తీరా ఉద్యోగం లభించాక కొందరు మాత్రమే రిజైన్‌ చేయడం చర్చనీయాంశమవుతోంది. ఎక్కడ తమ బాగోతం కూడా బయటపడుతుందో అని ముందస్తుగానే వారు రిజైన్‌ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.  


అధికంగా నకిలీ సర్వీస్‌ సర్టిఫికెట్లు  

పోస్టుల భర్తీలో వెయిలేజీ మార్కుల కోసం ఎక్కువ మంది అభ్యర్థులు ఇతర జిల్లాల నుంచి తెచ్చిన సర్వీస్‌ సర్టిఫికెట్లను సమర్పించారు. ఇందులో నకిలీవే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇతర జిల్లాల నుంచి తెచ్చిన సర్వీస్‌ సర్టిఫికెట్లు అసలువా? నకిలీవా? అన్నది తేల్చేందుకు ఇప్పటికే జిల్లాలవారీగా జిల్లావైద్యఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి లేఖలు వెళ్లాయి. మరికొద్దిరోజుల్లో భాగోతం బయటపడనుంది. వాస్తవంగా ఇంకా ఎన్ని సర్వీస్‌సర్టిఫికెట్లు నకిలీవి ఉన్నాయన్నదీ నిర్ధారణ కావడం.. ఆపై వారిపైనా చర్యలు తీసుకునే అవకాశముంది. ఇందులో ఉద్యోగాలు పొందినవారు కూడా ఉండడంతో వారి మనస్సులో ఆందోళన ప్రారంభమైందని... నకిలీ బాగోతం బయటపడకుండా ముందుగానే ఉద్యోగాన్ని వదిలేసుకోడానికి సిద్ధపడిపోతున్నట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉండగా జిల్లాలో జిల్లావైద్యఆరోగ్యశాఖ పరిధిలో నకిలీ సర్వీస్‌సర్టిఫికెట్లను ఎవరెవరు సమర్పించారు.. ఏయే అభ్యర్థులు ఉద్యోగం పొందారు... వారి పేర్లతోసహా ఆధారాలను సైతం కలెక్టర్‌ నివాస్‌కు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తే  నకిలీ సూత్రధారులు భారీ సంఖ్యలోనే బయటపడే అవకాశముందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. 


నా దృష్టికి రాలేదు : 

ఫార్మాసిస్టులు, స్టాఫ్‌నర్శులు రాజీనామాల విషయం ఇంతవరకు నా దృష్టికి రాలేదు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సర్వీస్‌ సర్టిఫికెట్లు వివరాలు వచ్చేశాయి. ఇంకా ఇతర జిల్లాల నుంచి తెచ్చిన సర్వీస్‌ సర్టిఫికెట్లు వివరాలు ఇంకా రాలేదు. అవి అందాక వాటిపై చర్యలు తీసుకుంటాం.  

- డీఎంహెచ్‌ఓ చంద్రానాయక్‌


 

 

Updated Date - 2020-11-26T05:33:12+05:30 IST