ఎందుకింత నిశ్చేష్ట?

ABN , First Publish Date - 2020-06-10T05:48:19+05:30 IST

కరోనా ఉపద్రవం ఎంత పని చేసిందో తలచుకున్న కొద్దీ ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచాన్నంతా, జనజీవనాన్నంతా స్తంభింపజేయడమే కాకుండా, దృక్కోణాలను, ఆలోచనలను, చొరవలను, చురుకుదనాలను కూడా ప్రభావితం చేసింది...

ఎందుకింత నిశ్చేష్ట?

కరోనా ఉపద్రవం ఎంత పని చేసిందో తలచుకున్న కొద్దీ ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచాన్నంతా, జనజీవనాన్నంతా స్తంభింపజేయడమే కాకుండా, దృక్కోణాలను, ఆలోచనలను, చొరవలను, చురుకుదనాలను కూడా ప్రభావితం చేసింది. బహుశా, ఇటువంటి సందర్భాలలో తగినరీతిన స్పందించడానికి అనువుగా మనుషులు శిక్షణ పొంది ఉండలేదు. కానీ, సహజాతాలు అయినా పనిచేయాలి కదా? పనిచేయలేదని అనలేము. స్వార్థమూ లోభమూ ద్వేషమూ కాపాడుకుంటూనే ఉన్నారు. అక్కడక్కడ స్వార్థత్యాగాన్నీ, అసాధారణమైన సేవాభావాన్నీ ప్రదర్శిస్తూనే ఉన్నారు. వారు వేరు, వీరు వేరు. వలసకార్మికుల విషయంలో అనేకమంది వ్యక్తులు, అనేక బృందాలు నడుంకట్టి, వారి దుస్థితిని సాధ్యమైనంత తగ్గించడానికి చేసిన ప్రయత్నం నిజంగానే భవిష్యత్తు మీద, సకాలంలో సరైన విధంగా స్పందించగలిగిన మానవప్రవృత్తి మీద నమ్మకాన్ని కలిగించింది. కానీ, మరోవైపు, ప్రపంచం మొత్తం నూటికి ఇద్దరినో, అయిదుగురినో, పదిమందినో బలి ఇచ్చుకోవలసి వచ్చిన ఈ ప్రళయకాలంలో కూడా, వెనుకటి గుణం ఏమీ వదలని రక్తపిశాచితనం కూడా మనుషుల్లోనే చూస్తున్నాము. 


స్వార్థం అత్యాశ వంటి సామాజిక సహజాతమే భయం కూడా. ప్రాణభయం చిన్నది కాదు. కరోనా ప్రమాదఘంటికలు మోగగానే, ప్రభుత్వాలు జనజీవితానికి తాళాలు బిగించగానే, పాలకుల చేతికి తమ భవితవ్యాన్ని అప్పగించి, మీరే తప్ప ఇతఃపరంబెరుగ అన్నట్టు బేలగా మారారు అనేకులు. జనతాకర్ఫ్యూ అన్నప్పుడు ఏమన్నా ప్రజాభాగస్వామ్యం, ప్రజాప్రమేయం ఉన్నాయోమే కానీ, లాక్‌డౌన్‌ అంటే అంగీకృత నిర్బంధమే. మునుపటి నుంచే గేటెడ్‌ కమ్యూనిటీల్లోనూ, రక్షిత కాలనీల్లోనూ, భారీ అపార్ట్‌మెంటుల్లోనూ ఉండడం అలవాటైన వారికి ఈ స్వీయనిర్బంధం పరిచితమే అయినప్పటికీ, లాక్‌డౌన్‌ దాని పరాకాష్ఠ. నివాస సంఘాల నాయకులదే సర్వాధికారం. గృహస్థులంతా స్వచ్ఛందంగా తమ విధేయతను సమర్పించుకున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రప్రభుత్వం ముందు అట్లాగే సమర్పణ చేసుకున్నారు. విడియోకాన్ఫరెన్సుల్లో ప్రధాని ఎదుట బుద్ధిమంతులైన శ్రోతలయ్యారు. కరోనా కరోనాయే, రాజకీయం రాజకీయమే అన్నట్టు, ప్రభుత్వాల కూల్చివేతలు, ఉద్యమకారుల అరెస్టులు, బెయిళ్ల నిరాకరణలు, భారీ ప్రైవేటైజేషన్లు అన్నీ జరిగిపోతున్నా, ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు. అవకాశం లేకపోవడమే కాదు, అంత చొరవ తీసుకోదగిన మనస్థితి కూడా ఎవరికీ ఉన్నట్టు లేదు. ఇంతగా తమ ఉనికిని, హక్కులను స్వచ్ఛందంగా సమర్పించుకోగలిగిన పౌరసమాజాలు, రేపు సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత కూడా బిగిసంకెళ్లనే ప్రేమిస్తారేమోనని భయం వేస్తుంది. అందరూ అన్ని చోట్లా అట్లా ఉన్నారని కాదు, మూలుగులు, ఆర్తనాదాలు, మంద్రస్థాయి నినాదాలు, సంతకాల నిరసనలు, ఆన్‌లైన్‌ సభలు, ర్యాలీలు– జరుగుతూనే ఉన్నాయి. ప్రవహించవలసిన మాటలను ఎట్లాగో ప్రసారం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, అత్యధికులు ముఖ్యంగా సామాజిక ఉద్యమ సంస్థలు, సంఘటిత ఉద్యోగ సంఘాలు, రచయితలు, కళాకారుల సంఘాలు, రాజకీయపార్టీలు, వాటి అనుబంధ యంత్రాంగాలు– వీరందరూ ఎందుకు చేష్టలుడిగిపోయారన్నది ఆశ్చర్యమే కాదు, విచారాన్నీ కలిగిస్తున్నది. 


వలసకార్మికుల వ్యధను ఉపశమింపజేయడానికి ప్రయత్నించిన వారు వ్యక్తులూ, చిన్న చిన్న బృందాలే. వారు వారి వారి అభిప్రాయాల రీత్యా ఏవో రాజకీయాలను అభిమానిస్తూ ఉండవచ్చు, సంఘాల్లో పనిచేస్తూ ఉండవచ్చు, కానీ, వారు చేసిన పని, చూపిన చొరవ, మొత్తంగా సేవ– వ్యక్తిగత చైతన్య ప్రేరితమే. మరి, ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేస్తున్నామని చెప్పే పార్టీల ప్రజాసంఘాలు, కార్యకర్తలు ఏమి చేశారు? అంతా సజావుగా ఉన్నప్పుడు, ఎంతో సంఘటితంగా కనిపించే నోరున్న శ్రేణులన్నీ, ఒక తాటి మీద ఎందుకు పనిచేయలేకపోయాయి? నాయకులు వారిని ఎందుకు నడిపించలేకపోయారు? అన్నవి సమాధానం దొరకని ప్రశ్నలు. 


వ్యాధి వ్యాప్తి ఆరంభదశలో ఉన్నప్పుడు, కట్టడి కఠినంగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడడం, దీపాలు పెట్టమనో, చప్పుళ్లు చేయమనో, ఇళ్లలో ఉండమనో కార్యక్రమాలు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు వ్యాధి తీవ్రమైంది. కట్టడి సరళమైంది. ప్రధానికి, ముఖ్యమంత్రులకు జనం ముందుకు రావడానికి మొహమాటంగా ఉంది. ప్రాణరక్షణ ఎవరికి వారు చేసుకోవలసిన విధి అయింది. ఇప్పుడు ప్రజలకు దిశానిర్దేశం చేయగలిగేవారు కావాలి. ఇప్పుడన్నా ఆ ఖాళీని భర్తీ చేయడానికి, వివిధ సంఘటిత శక్తులు, సంస్థలు రంగంమీదకు రావచ్చు కదా? అన్నిటిని బార్లా తెరవాలని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించినప్పుడు, ఆచితూచి మాత్రమే బహిరంగంలోకి వెళ్లండని మరొకరు పిలుపునివ్వవచ్చు కదా? జనతాకర్ఫ్యూ వంటి తీవ్రచర్యలు ఇప్పుడు కష్టం కావచ్చును కానీ, ప్రజలు స్వీయనియంత్రణ పాటించడానికి కావలసిన పిలుపులు, హితవులు, కార్యక్రమాలు రాజకీయపార్టీల సంఘాలు, ప్రజాసంఘాలు, ఉద్యమసంఘాలు, ఉద్యోగ కార్మిక సంఘాలు, వివిధ వృత్తి, ప్రవృత్తి సంఘాలు ఇవ్వవచ్చును కదా? అయ్యో అయ్యో, వ్యాధి పెరిగిపోతోంది, జనం కట్టుబాటులో ఉండడం లేదు, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తింది– అని విమర్శించడంతో ఆగకుండా, పరిస్థితిని తమ చేతిలోకి తీసుకునే ప్రయత్నాలు ప్రజా జీవితం నుంచి పౌరసమాజం నుంచి జరగవచ్చును కదా? 


గొప్ప ఫలితాలు వస్తాయని చెప్పలేకపోవచ్చు. గొప్ప ప్రయత్నంగా మిగిలిపోవచ్చును.

Updated Date - 2020-06-10T05:48:19+05:30 IST