20 కేజీల రసగుల్లాలు సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలిస్తే..!

ABN , First Publish Date - 2021-05-06T21:33:16+05:30 IST

పోలీసులు 20 కేజీల రసగుల్లాలు సీజ్ చేశారు. దీంతో పాటు వాటిని పంచిపెడుతున్న ...

20 కేజీల రసగుల్లాలు సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలిస్తే..!

లక్నో: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు 20 కేజీల రసగుల్లాలు సీజ్ చేశారు. దీంతో పాటు వాటిని పంచిపెడుతున్న ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ పోలీస్ స్టేషన్ పరిథిలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీలో ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన కొందరు అభ్యర్థులు విజయోత్సవాలు జరుపుతుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. రసగుల్లాలతో పాటు ఇద్దరు వ్యక్తులను ఠాణాకు తీసుకొచ్చారు.  ‘‘కోవిడ్-19 మార్గదర్శకాలు, సీఆర్‌పీసీ సెక్షన్ 144ను  ఉల్లంఘించి, రసగుల్లాలు పంచిపెడుతున్న ఇద్దరు వ్యక్తులను హాపూర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 కేజీల రసగుల్లాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది..’’ అని హాపూర్ పోలీసులు ట్విటర్లో వెల్లడించారు.


కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవాలు జరుపుకోవడాన్ని నిషేధిస్తూ ఈసీ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు యూపీలో ఇటీవల పంచాయితీ ఎన్నికలు జరిగాయి. విజయోత్సవాలపై నిషేధం ఉన్నప్పటికీ.. దేశంలో పలుచోట్ల ప్రజలు ఎన్నికల విజయంపై సంబరాలు చేసుకుంటూ కనిపించారు. కోల్‌కతాలో వందలాది మంది టీఎంసీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం వెలుపల సంబరాలు చేసుకున్నారు. తమిళనాడులో దశాబ్ద కాలం తర్వాత  డీఎంకేకి అధికారం దక్కడంతో ఆ పార్టీ కార్యకర్తలు సైతం విజయోత్సవాలు చేసుకున్నారు. దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న వేళ ఇలా ఉత్సవాలు జరుపుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.

Updated Date - 2021-05-06T21:33:16+05:30 IST