Abn logo
Mar 3 2020 @ 00:56AM

టెల్కోలను ఎందుకు ఆదుకోవాలి?

టెలికాం కంపెనీలు 2006లో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో మార్పులు చేర్పులు జరగాలి. టెలికాం సేవల ధరల పెంపుదలకు అనుమతించడమంటే వినియోగదారునిపై మరింత ఆర్థిక భారాన్ని మోపడమే అవుతుంది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోను భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్- – ఐడియా కంపెనీలను దివాలా తీసే దుస్థితికి నెట్టకూడదు. అవి దివాలా తీస్తే మన బ్యాంకింగ్ వ్యవస్థ పెను ప్రమాదంలో పడుతుంది. 


భా‍రతీ ఎయిర్ టెల్, వోడాఫోన్–ఐడియా, జియో మొదలైన టెలికాం కంపెనీలు తాము ఆర్జించే సకల ఆదాయాలపై స్పెక్ట్రమ్ వినియోగ చార్జీ చెల్లించాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ కంపెనీలు 2006లో ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం మేరకు, టెలికాం సేవలపై ఆర్జించే ఆదాయాలపైనే కాకుండా, తమకు వచ్చే అన్ని రాబడులపైన స్పెక్ట్రమ్ వినియోగ చార్జీలను అవి చెల్లించవలసివున్నది. రెంట్, డివిడెండ్, ఆస్తుల విక్రయంపై ఆర్జించే లాభాలు మొదలైనవి టెలికాం సంస్థల ఆదాయాలలో భాగంగా వున్నాయి. అప్రధానమైన వ్యాపారా లపై స్పెక్ట్రమ్ వినియోగ చార్జీలు చెల్లించవలసిరావడంవల్ల భారతీ ఎయిర్ టెల్ , వోడాఫోన్–ఐడియా కంపెనీలపై రూ.50,000 కోట్ల చొప్పున అదనపు ఆర్థిక భారం పడనున్నది. ఈ అదనపు భారం జియోపై మాత్రం నామమాత్రంగా వుంటుంది. మార్కెట్‌లోకి ఈ కంపెనీ ఇటీవలే ప్రవేశించినందున బకాయిలు తక్కువగా వుండడమే అందుకు కారణం. భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్–ఐడియా తాము సమకూరుస్తున్న టెలికాం సేవలపై ఇప్పటికే నష్టాల్లో వున్నాయి. సుప్రీం కోర్టు నిర్దేశించిన భారీ మొత్తాన్ని చెల్లించగల స్తోమత వాటికి ఇంకెంత మాత్రం లేదు.


టెలికాం కంపెనీలను సతమతం చేస్తున్న ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేందుకు మూడు మార్గాలు వున్నాయి. మొదటిది- బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం పట్టబట్టడం; భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్–-ఐడియా దివాలా తీయడానికి అనుమతించడం. ఇక్కడ సమస్యేమిటంటే ఆ మూడు కంపెనీలు మన బ్యాంకుల నుంచి లక్ష కోట్ల రూపాయల మేరకు రుణాలు తీసుకున్నాయి. సుప్రీం కోర్టు నిర్దేశించిన విధంగా స్పెక్ట్రమ్ వినియోగ చార్జీలు చెల్లించవలసివస్తే బ్యాంకులు తమ సొమ్మును తిరిగి వసూలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల, మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థే అపాయంలో పడుతుంది. అంతేకాక ఈ మార్గం, జియో కంపెనీ గుత్తాధిపత్యానికి దారితీస్తుంది. అప్పుడు జరిగేదేమిటి? టెలికాం సేవలకు సంబంధించిన చార్జీలను ఆ కంపెనీ తన ఇష్టానుసారంగా మార్చి వేస్తుంది. జియో తొలుత తమ టెలికాం వ్యాపార వ్యవహారాల నిర్వహణకు అయ్యే వ్యయం కంటే తక్కువ చార్జీలను నిర్ణయించడం వల్ల భారతీ ఎయిర్ టెల్, వోడా ఫోన్- ఐడియాలు భారీగా నష్టపోయాయన్నది గమనార్హం. సకల ఆదాయాలపైన స్పెక్ట్రమ్ వినియోగ చార్జీలు చెల్లించవలసివస్తే ఆ రెండు కంపెనీలు అనివార్యంగా దివాలా తీస్తాయి. అప్పుడు తన పోటీదారులపై జియో శాశ్వతంగా పై చేయి సాధిస్తుంది. ఈ పరిస్థితి, డేటా బేస్ట్ కమ్యూనికేషన్స్ దిశగా మన పురోగమనాన్ని మందగింపజేస్తుంది.


రెండో మార్గం– ప్రభుత్వం గతంలో జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్–-ఐడియాతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుని కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవడం. తద్వారా ఆ కంపెనీలు టెలికం సేవలపై ఆర్జిస్తున్న ఆదాయాలపైనే స్పెక్ట్రమ్ వినియోగ చార్జీలను చెలించాలని నిర్దేశించడం. నిజానికి ఆ కంపెనీలు ఇప్పటికే ఈ చార్జీలను చెల్లించాయి. 


సుప్రీం కోర్టు తీర్పుతో సమకూరనున్న అనూహ్య లాభాలు ప్రభుత్వానికి వాస్తవంగా దక్కే అవకాశం లేకపోవడం ఇక్కడ ఎదురయ్యే సమస్య. అదే నిష్పత్తిలో ప్రభుత్వం తన భావి వ్యయాలను పెంచుకోకుండా సంయమనం పాటించవలసివుంటుంది. ఈ మార్గం మరో తీవ్ర సమస్యను కూడా సృష్టిస్తుంది. పవర్ గ్రిడ్, రైల్ టెల్, గెయిల్ మొదలైన నాన్-టెలికాం కంపెనీలు కూడా తమ అంతర్గత వినియోగానికి స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. తమ సకల ఆదాయాలపై చార్జీలు చెల్లించుటకు అవి సైతం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఉదాహరణకు గెయిల్ తాను కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌పై రూ.35కోట్ల విలువైన వ్యాపారం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ కంపెనీ స్థూల ఆదాయం రూ.2, 50,000 కోట్లు. ఈ మొత్తంపై 5 శాతం స్పెక్ట్రమ్ చార్జి అంటే రూ.12, 500 కోట్లు. ఆ ప్రకారం రూ.35 కోట్ల వ్యాపారంపై గెయిల్ రూ. 12, 500 కోట్లు చెల్లించవలసివుంటుంది! 


మూడో మార్గం- జియోతో పాటు భారతీ ఎయిర్ టెల్, వోడా పోన్–-ఐడియా కూడా తాము సమకూర్చే టెలికాం సేవల ధరలు పెంచి, తద్వారా ఆర్జించే ఆదాయంతో ప్రభుత్వ బకాయిలను చెల్లించడం. దీనివల్ల టెలికాం సేవల ధరలు పెరుగుతాయి. వినియోగదారులపై ఆర్థిక భారం పడుతుంది. అదే దామాషాలో డేటా ఆధారిత కమ్యూనికేషన్స్ దిశగా పురోగతి వేగవంతమవుతుంది. 


టెలికాం కంపెనీల దివాలా దేశ ఆర్థిక వ్యవస్థకు నాలుగు విధాల నష్టాన్ని కలుగజేస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిగా కుదేలుపరచడం, ప్రభుత్వానికి అనూహ్య ఆదాయాలు లేకుండా చేయడం, టెలికాం సేవలపై జియో గుత్తాధిపత్య ధరలు, డేటా ఆధారిత కమ్యూనికేషన్స్ దిశగా పురోగతి మందగించడం మన ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయనడంలో సందేహం లేదు. మరి మార్గాంతరమేమిటి? టెలికాం కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందంలో మార్పులుచేర్పులు చేయాలి. ఈ చర్య రెండు ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది. టెలికాం రంగానికి చెందని ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్, తన పెట్రోలియం వ్యాపారంపై కూడా స్పెక్ట్రమ్ వినియోగ చార్జీలను చెల్లించవలసివుంటుంది; ప్రభుత్వం తనకు అనూహ్యంగా సమకూరే ఆదాయాలను కోల్పోవవలసివస్తుంది. టెలికాం సేవల ధరల పెరుగుదల వల్ల ఒకే ప్రతికూల ప్రభావం వుంటుంది. ఇది, వినియోగదారుపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. టెలికాం కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందంలో మార్పులు చేర్పులు చేయడం లేదా టెలికాం సేవల ధరల పెరుగుదలకు అనుమతించడం- అంతిమంగా ఈ రెండిటిలో ఒక దాన్ని ఎంచుకోవల్సివుంటుంది. ఒప్పందంలో మార్పులు చేర్పుల వల్ల ప్రభుత్వం అనూహ్య ఆదాయాలను కోల్పోవటం లేదా అనూహ్య లబ్ధి పొందడం జరుగుతుంది; టెలికాం సేవల ధరల పెరుగుదల భారాన్ని వినియోగదారు భరించడం అనివార్యమవుతుంది. టెలికాం కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందంలో మార్పులు చేర్పులు చేయడమే మంచిదని నేను భావిస్తున్నాను. టెలికాం సేవల ధరల పెంపుదలకు అనుమతించడానికి నేను ద్వితీయ ప్రాధాన్యమిస్తున్నాను. ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోను భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్-–ఐడియా కంపెనీలను దివాలా తీసే దుస్థితికి నెట్టకూడదు. ఆ కంపెనీలు దివాలా తీస్తే మన బ్యాంకింగ్ వ్యవస్థ పెనుప్రమాదంలో పడుతుంది. అంతేగాక జియో గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించడమే అవగలదు. 


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...