ఈ నేరం ఎవరిది? వెండి సింహాల చోరీపై ఇన్ని కథలెందుకో!

ABN , First Publish Date - 2020-09-19T09:41:08+05:30 IST

కనకదుర్గమ్మ వెండి రథంపై సింహాల ప్రతిమలు మాయమైన ఘటనపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తూర్పుగోదావ

ఈ నేరం ఎవరిది? వెండి సింహాల చోరీపై ఇన్ని కథలెందుకో!

చోరీ ఘటనపై పొంతన లేని ప్రకటనలు

ఫిర్యాదు చేయడానికీ తటపటాయింపులే

అంతర్వేదికి ఒక న్యాయం.. దుర్గగుడికి మరో న్యాయమా..?

దుర్గ గుడి ఈవోను కాపాడేందుకు మంత్రి వెల్లంపల్లి ప్రయత్నాలు!


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కనకదుర్గమ్మ వెండి రథంపై మూడు సింహాల మాయంలో ఎవరి పాపమెంత? అసలు నేరస్తులెవరు? నేరాన్ని దాచే ప్రయత్నాలెందుకు చేస్తున్నారు? ఉగాదికి వెండి రథం మరమ్మతులు చేయాలని, పాలిష్‌ పెట్టాలని ఆదేశాలు జారీ చేసిన ఈవో తాను గత ఏడాది ఏప్రిల్‌ నుంచి అసలు రథాన్నే పరిశీలించలేదని ఎందుకు చెబుతున్నారు? వెండి విగ్రహాలు మాయమైనట్టు గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పరదా ఎందుకు మార్చేసినట్టు? దుర్గగుడిలో వెండి రథంపై సింహం ప్రతిమలు మాయమైనట్టు గుర్తించిన నాటి నుంచి ఈవో తీరుపై ఎన్నో సందేహాలు.. అయినా ప్రభుత్వం ఇంత వరకూ దీనిపై స్పందించలేదు. మరో పక్క ఈవోను కాపాడేందుకు మంత్రి వెలంపల్లి బాహాటంగా చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


కనకదుర్గమ్మ వెండి రథంపై సింహాల ప్రతిమలు మాయమైన ఘటనపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధమైన ఘటనకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండానే ఆ దేవస్థానం ఈవోను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.


ఆపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా.. రాష్ట్రంలో కోట్లాది మంది భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతున్న కనకదుర్గమ్మ దేవస్థానంలో వెండి రథంపై మూడు సింహం విగ్రహాలను దుండగులు చోరీ చేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నా.. అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చోరీ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా, ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. అసలు చోరీయే జరగలేదన్నట్టు ఘటనను తప్పుదారి పట్టించేందుకు యత్నించిన దుర్గగుడి ఈవోపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మూడు రోజులు సమయం తీసుకున్న దుర్గగుడి అధికారుల వ్యవహార శైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తూ దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు రంగంలోకి దిగి ఈవోను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చోరీ ఘటనకు ఈవో సురేశ్‌బాబుకు ఎలాంటి సంబంధం లేదనే తరహాలోనే మంత్రి వెలంపల్లి మాట్లాడుతున్నారు.


తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనకదుర్గమ్మ వెండి రథాన్ని బయటకే తీయలేదని, ఆ రథంపై వెండి సింహం విగ్రహాలు గత ప్రభుత్వ హయాంలో పోయాయా? ఈ పదహారు నెలల్లోనే పోయాయా? అనేది విచారణలో తేలుతుందంటూ వింత వాదనను తెరమీదకు తీసుకువచ్చి నెపాన్ని గత ప్రభుత్వంపైకి నెట్టేసే ప్రయత్నం చేశారు. 


ఎవరిది కుట్ర..!

వెండి సింహం విగ్రహాలు గత ప్రభుత్వ హయాంలోనే పోయాయన్నట్టు మంత్రి వెలంపల్లి, ఈవో సురేశ్‌బాబు, దుర్గగుడి చైర్మన్‌ సోమినాయుడూ అందరూ ఒకటే పాట మొదలుపెట్టారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చి 25న వసంత్సోవాల్లో భాగంగా వెండి రథోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం వెండి రథానికి మరమ్మతులు, పాలిష్‌ చేయాలని ఆదేశిస్తూ ఈవో మార్చి 11న ఆదేశాలు జారీ  చేశారు.


ఆయన ఆదేశాల మేరకు మార్చి 13న రథానికి ఉన్న పట్టాను దుర్గగుడి అప్రయిజర్‌ షమి తొలగించారు. ఆ సమయంలో రథానికి నాలుగు సింహాలు ఉన్నట్లు షమి శుక్రవారం పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. షమి ఈవో వద్ద సెకండ్‌ సీసీగా పనిచేస్తున్నారు. ఈవోకి అత్యంత నమ్మకస్థుడు. ఈ నేపథ్యంలో రథానికి ఎన్ని గుర్రాలు ఉన్నాయో కూడా తనకు తెలియదని ఈవో బుకాయించడం ఎవరిని రక్షించడానికి అనే ప్రశ్న సాధారణ భక్తులకు సైతం వస్తుంది.


వెండి సింహాలు మాయమైన కేసును గత టీడీపీ ప్రభుత్వంపై నెట్టేందుకు దుర్గగుడి అధికారులు పక్కా స్కెచ్‌ వేసినట్లు స్పష్టమవుతోంది. మంత్రి అంతా తెలిసి కూడా ఏమీ తెలియనట్టు వెండి సింహాల మాయంలో కుట్ర ఉందని, గత ప్రభుత్వ హయాంలోనే జరిగి ఉండొచ్చని ప్రకటనలు చేశారు. ఈవో, దుర్గగుడి చైర్మన్‌ కూడా అదే పాట పాడారు. ఈ నేరాన్ని టీడీపీ ప్రభుత్వంపైకి నెట్టేందుకే  2019 ఏప్రిల్‌ 6 నుంచి 2020 సెప్టెంబరు 15 నడుమ చోరీ జరిగి ఉండొచ్చని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


వాస్తవానికి ఈ ఏడాది మార్చి 13న రథానికి పాలిష్‌ చేసేందుకు పట్టా తొలగించినప్పుడు నాలుగు సింహాలు ఉన్నాయని దుర్గగుడి అప్రయిజర్‌ షమి స్పష్టం చేస్తున్నా, ఫిర్యాదులో 2019 ఏప్రిల్‌ 6 నుంచి అని పేర్కొనడంలో అధికారుల దురుద్దేశం స్పష్టమవుతోంది. 


 ఇది ఏ కుట్రలో భాగం

గత ఏడాది ఆగస్టు 2న దుర్గగుడి ఈవోగా సురేశ్‌బాబు బాధ్యతలు చేపట్టారు. అమ్మవారి బంగారం, వెండి వస్తువులతోపాటు ఇతర విలువైన ఆస్తులను దేవస్థానం నిర్వహించే ఇన్వెంటరీ రికార్డు ప్రకారం గత ఏడాది సెప్టెంబరు 19న అంతకుముందు ఈవోగా పనిచేసిన ఐఆర్‌ఎస్‌ అధికారిణి కోటేశ్వరమ్మ.. కొత్త ఈవోగా వచ్చిన సురేశ్‌బాబుకు అప్పగించారు. గత ఏడాది ఏప్రిల్‌ ఆరో తేదీ తరువాత అమ్మవారి వెండి రథాన్ని తాను పరిశీలించలేదని ఈవో చెబుతుండటం ఏ కుట్రలో భాగమో తేలాల్సి ఉంది. 


 గుట్టు దాచే కుట్ర

సాధారణంగా ఎక్కడ చోరీ జరిగినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అలాంటిది దుర్గమ్మ వెండి రథానికి ఉండాల్సిన సింహాలు చోరీకి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అధికారులు ఉద్దేశపూర్వకంగానే చోరీ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. చోరీ జరిగిన సమయంలో రథానికి నీలం రంగు పట్టా ఉన్నట్లు ఫొటోల్లో కోసేసిన పట్టా ముక్కలు స్పష్టం చేస్తున్నాయి. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన అధికారులు దుండగులు కోసేసిన ఆనవాళ్లు లేకుండా బ్లూ రంగు పట్టాను తొలగించి, ఎర్ర రంగు పట్టాను కప్పారు. దీన్నిబట్టి చోరీ విషయాన్ని కప్పిపుచ్చాలన్న ఉద్దేశంతోనే వారు అలా చేసినట్లు స్పష్టమవుతోంది. 


ప్రతినెలా పాలిషింగ్‌.. బంగారం, వెండి, ఇత్తడి వస్తువులకు పెట్టాల్సిందే

 శార్వాణీ ఇండస్ట్రీకి కాంట్రాక్టు

దుర్గగుడిలో అమ్మవారికి చెందిన బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను ప్రతినెలా పాలిష్‌ పెడతారు. ఈ కాంట్రాక్టును శార్వాణీ ఇండస్ట్రీకి అప్పగించారు. పాలిష్‌ పెట్టినందుకుగాను ఆ సంస్థకు నెలకు రూ.47వేలు దుర్గగుడి అధికారులు చెల్లిస్తున్నారు. పాలిష్‌ పెట్టే పనిని శార్వాణీ ఇండస్ట్రీస్‌ వెంకట్‌ అనే వ్యక్తికి అప్పగించింది.


ఈ ఏడాది మార్చిలో చివరిసారిగా రథానికి పాలిష్‌ పెట్టినట్లు, ఆ సమయంలో రథానికి నాలుగు సింహాలు ఉన్నట్లు వెంకట్‌, అప్రయిజర్‌ షమి పోలీసుల విచారణలో అంగీకరించారు. మార్చి తర్వాత లాక్‌డౌన్‌ కారణంగా నెలనెలా జరిగే పాలిష్‌ పనులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని కప్పిపుచ్చి, రథాన్ని చాలాకాలంగా పరిశీలించలేదన్నట్లు మాట్లాడటం అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - 2020-09-19T09:41:08+05:30 IST