HYD : Criminals పాలిట సింహస్వప్నంలా మారి కటకటాల్లోకి నెట్టాల్సిన కొందరు ఇన్‌స్పెక్టర్లు.. ఇలాంటి పాడు పనులు చేస్తున్నారేంటి..!?

ABN , First Publish Date - 2021-09-02T19:19:45+05:30 IST

‘కంచే చేను మేస్తే..’.. అన్న చందంగా తయారైంది,....

HYD : Criminals పాలిట సింహస్వప్నంలా మారి కటకటాల్లోకి నెట్టాల్సిన కొందరు ఇన్‌స్పెక్టర్లు.. ఇలాంటి పాడు పనులు చేస్తున్నారేంటి..!?

  • శివారు పోలీ‌స్‌స్టేషన్‌లలో మారని కొందరి తీరు
  • ఫిర్యాదులు వద్దు.. సెటిల్‌మెంట్లు ముద్దు
  • పట్టించుకోని ఏసీపీ, డీసీపీలు
  • న్యాయం కోసం సీపీల వద్దకు బాధితుల పరుగులు

హైదరాబాద్‌ సిటీ : ‘కంచే చేను మేస్తే..’.. అన్న చందంగా తయారైంది కొన్ని పోలీ‌స్‌స్టేషన్‌లలో పరిస్థితి. నేరస్థుల పాలిట సింహస్వప్నంలా మారి కటకటాల్లోకి నెట్టాల్సిన కొందరు ఇన్‌స్పెక్టర్లు వారితో దోస్తీ కడుతున్నారు. కాసుల వేటలో పడి ఉద్యోగధర్మానికి తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితులతో మంచి, మర్యాద నటిస్తూనే.. నేరస్థులకు కొమ్ము కాస్తున్నారు. భూముల ధరలు పెరిగిపోవడంతో ఇన్‌స్పెక్టర్‌లు, సెక్టార్‌ ఎస్‌ఐలు దగాకోరులతో దోస్తీ కట్టి కాసులు దండుకుంటున్నారు. ఒక్క పోస్టింగ్‌ దొరికితే చాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా సంపాదిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వారు చేస్తున్న అవినీతి, అక్రమాలు బయటపడినా స్థానిక రాజకీయనేతలు వారిని కాపాడటానికి సిద్ధంగా ఉన్నారనే ధైర్యంతో అడ్డదారులు తొక్కుతున్నారు. 


రాజకీయ బలం ఉన్న ఇన్‌స్పెక్టర్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోలీస్‌ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ వేటు వేసినా కొద్దిరోజుల్లోనే తమకున్న రాజకీయ పలుకుబడితో మరోచోట, మరో కమిషనరేట్‌లో పోస్టింగ్‌లు పొందుతున్నారు. నిజాయితీగల అధికారులకు ఏళ్ల తరబడి ఎదురుచూసినా ఎస్‌హెచ్‌వో పోస్టింగ్‌ దక్కడంలేదు. పోస్టింగ్‌ల విషయంలో మితిమీరిన రాజకీయ జోక్యం ఉందనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు, నాయకులకు నచ్చిన వారికే పోస్టింగ్‌ ఇచ్చే పరిస్థితి దాపురించడంతో.. పోలీస్‌ ఉన్నతాఽధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందనే ఆరోపణలున్నాయి. ఏదేమైనా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కొంతమంది ఇన్‌స్పెక్టర్‌లపై ఇటీవల రాచకొండ, సైబరాబాద్‌ ఉన్నతాధికారులు వేటు వేశారు. అయినప్పటికీ మిగిలిన ఇన్‌స్పెక్టర్‌లలో మార్పు రావడం లేదు. కొంతమంది ఇన్‌స్పెక్టర్‌లు, ఏసీపీల వల్ల మొత్తం డిపార్టుమెంట్‌కే చెడ్డ పేరు వస్తోందని ఉన్నతాధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి స్టేషన్‌ల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో పలువురు బాధితులు సీపీ ఆఫీసులకు వెళ్తున్నారు. ఏసీపీలు, డీసీపీలను కలవడానికి మొగ్గు చూపడం లేదు.


ఇవిగో నిదర్శనాలు

- చేవెళ్ల నియోజకవర్గం పరిధి శివారు పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్‌పై ఇటీవల వేటు వేశారు మాజీ సీపీ సజ్జనార్‌. ఆ ఇన్‌స్పెక్టర్‌కు అంతకు ముందే అక్కడ ఎస్‌హెచ్‌వోగా పోస్టింగ్‌ ఇచ్చారు. విధుల్లో చేరిన కొద్దిరోజులకే ఆయన కాసుల వేటలో పడ్డారు. నేరస్థులకు కొమ్ముకాస్తు బాధితులకు చుక్కలు చూపించారు. విషయం ఉన్నతాధికారి దృష్టికి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాస్‌ ఇటీవల ఆ ఇన్‌స్పెక్టర్‌పై వేటు వేశారు. ఎక్కడి నుంచి అయితే పోస్టింగ్‌ ఇచ్చారో.. తిరిగి అదే విభాగానికి పంపించారు.


- బాలానగర్‌ జోన్‌లోని ఓ శివారు పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ విధి నిర్వహణలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. ఫిర్యాదులు వద్దు.. సెటిల్‌మెంట్లే ముద్దు అన్నట్లుగా ఆయన వ్యవహారశైలి ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇటీవలే ఆయన ఇన్‌స్పెక్టర్‌గా పోస్టింగ్‌ తీసుకున్నాడు. నేరస్థులపై కేసు నమోదు చేయకుండా సెటిల్‌మెంట్లు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో తప్పతాగిన సదరు ఇన్‌స్పెక్టర్‌ అక్కడ పనిచేస్తున్న వారిపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. ఆ విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయినట్లు ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆరా తీసిన డివిజన్‌, జోన్‌ స్థాయి ఉన్నతాధికారులు ఇన్‌స్పెక్టర్‌ను తీవ్రంగా మందలించినట్లు సమాచారం.


- పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే భూ వివాదాల్లో తలదూర్చి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఆయనపై నమ్మకంతో ఉన్నతాఽధికారులు వరుసగా మూడు పోలీస్‌ స్టేషన్‌లలో ఎస్‌హెచ్‌వోగా పోస్టింగ్‌ ఇచ్చారు. విధినిర్వహణలో ఆయన  విశ్వరూపం ప్రదర్శించారు. భూ దందాలు, బాధితులను వేధించడం మొదలుపెట్టారు. విషయం ఉన్నతాధికారికి తెలిసింది. ఆ ఇన్‌స్పెక్టర్‌ను అక్కడి నుంచి తప్పించారు.


- రాచకొండ కమిషనరేట్‌ పరిధి హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై శివారులో ఉన్న పోలీ్‌సస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్‌పై సీపీ మహేష్‌ భగవత్‌ ఇటీవల వేటు వేశారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఇన్‌స్పెక్టర్‌ దారితప్పి భూ వివాదాల్లో తలదూర్చి అక్రమార్కులకు కొమ్ము కాయడంతో వేటు పడింది. ఆ తర్వాత వచ్చిన ఇన్‌స్పెక్టర్‌ సైతం ఇదే తరహా అక్రమాలకు పాల్పడుతున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆస్పత్రిపై  ఫిర్యాదు రావడంతో వైద్యులపై కేసు నమోదు చేయకుండా సదరు ఇన్‌స్పెక్టర్‌ ఆస్పత్రి వర్గాలకు కొమ్ముకాసినట్లు తెలిసింది. అంతేకాకుండా, ఓ దొంగను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇన్‌స్పెక్టర్‌ ఆ దొంగను వదిలేశాడు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ తీరుపై స్థానికులు మండిపడినట్లు తెలిసింది.


- అదే జాతీయ రహదారిపై ఉన్న రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ పై కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఒక క్రషర్‌ కంపెనీలో ఇటీవల ఒక కార్మికుడు మృతి చెందాడు. కంపెనీ యాజమాన్యంపై, వారి నిర్లక్ష్యంపై కేసు నమోదు చేయాల్సిన ఇన్‌స్పెక్టర్‌ అలా చేయకుండా.. కార్మికుడు మద్యం మత్తులో మృతి చెందినట్లు కేసు ఫైల్‌ చేశాడు. తెల్లవారుజామున కార్మికుడు మృతి చెందితే, నిజా నిజాలు తెలుసుకోకుండా మద్యం మత్తు అని కేసు ఫైల్‌ చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. టౌన్‌, రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌లపై సీపీ అంతర్గత విచారణకు ఆదేశించినట్లు  సమాచారం.

Updated Date - 2021-09-02T19:19:45+05:30 IST