మళ్లీ.. మళ్లీ అవే పనులు.. ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2021-06-15T18:12:46+05:30 IST

హుస్సేన్‌సాగర్‌లో చేరే వ్యర్థాలను దాదాపు కట్టడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

మళ్లీ.. మళ్లీ అవే పనులు.. ఎందుకిలా..!?

  • ‘సాగర్‌’లో ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్స్‌
  • ఆపరేషన్‌, మెయింటెన్స్‌కు రూ. 4 కోట్లు
  • ఐదేళ్ల నిర్వహణకు టెండర్లు
  • నిధుల వినియోగంపైనే దృష్టి

హుస్సేన్‌సాగర్‌లో చేరే వ్యర్థాలను దాదాపు కట్టడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సాగర్‌లోకి చెత్త చేరకుండా, దుర్వాసన రాకుండా ఇప్పటికే పలు పద్ధతుల ద్వారా అనేక చర్యలు చేపడుతున్నారు. అయినా మరోసారి ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్స్‌ ద్వారా చెత్త తొలగింపునకు ప్రయత్నిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మూడేళ్ల క్రితం కూడా ఈ విధానం అవలంబించారు. అయినప్పటికీ సాగర్‌ జలాల పరిస్థితిలో మార్పు రాకపోవడంతో అప్పటి హెచ్‌ఎండీఏ కమిషనర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా చర్యలకు ఆ సంస్థ టెండర్లను ఆహ్వానించింది. 


హైదరాబాద్‌ సిటీ : హుస్సేన్‌సాగర్‌ వ్యర్థాలను తొలగించి మెరుగుపరిచేందుకు హెచ్‌ఎండీఏ కొన్నేళ్లుగా చర్యలు చేపడుతోంది. ఇటీవల సాగర్‌ పరీవాహక ప్రాంతం నుంచి వచ్చే నీటి వ్యర్థాలు జలాశయంలోకి చేరకుండా కట్టడి చేసేందుకు ‘బూమ్‌ బారియర్‌ అండ్‌ అటోమేటెడ్‌ రైసర్సిస్టెమ్‌’ విధానాన్ని అధికారులు తీసుకొచ్చారు. డెన్మార్క్‌కు చెందిన డెస్మీ కంపెనీ నీటి ద్వారా వచ్చే వ్యర్థాలను ఈ విధానం ద్వారా ఎంట్రీ పాయింట్‌లోనే ఎప్పటికప్పుడు ఏరివేస్తుంది. దీంతో నీరు మాత్రమే హుస్సేన్‌సాగర్‌లోకి వెళ్తుంది. తొలుత సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే పికెట్‌ నాలాపై కిమ్స్‌ ఆస్పత్రి సమీపంలో హుస్సేన్‌సాగర్‌లోకి మురుగు ప్రవేశించే మార్గంలో ఈ విధానాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.


దాదాపు వ్యర్థాల కట్టడి

సాగర్‌లోకి వ్యర్థ జలాలను ఎక్కువగా మోసుకొచ్చే పికెట్‌, బల్కంపేట, కూకట్‌పల్లి, బంజారా నాలాలు నేరుగా కలవకుండా మళ్లించారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను హెచ్‌ఎండీఏ, వాటర్‌బోర్డు తదితర శాఖలు ఖర్చు చేశాయి. ఇటీవల కూకట్‌పల్లి నాలా ఇంటర్‌సెక్షన్‌ అండ్‌ డైవర్షన్‌ (ఐఅండ్‌డీ) పనులు పూర్తి అయ్యాయి. దాదాపుగా వ్యర్థాలు రాకుండా కట్టడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఖైరతాబాద్‌ ప్లైఓవర్‌ పక్కన 20 ఎంఎల్‌డీ ఎస్టీపీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత హుస్సేన్‌సాగర్‌లోకి శుభ్రమైన నీరు మాత్రమే కలుస్తోందని, మురుగునీరు చేరడం లేదని పేర్కొంటున్నారు. ఏళ్ల తరబడి దుర్గంధం వెదజల్లుతున్న సాగర్‌లో పరిస్థితి మార్చేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు బయోరిమిడేషన్‌ చేపట్టారు. ఏటా వేసవిలో పనులు ప్రారంభించించేవారు. ఈ సారి నెల ఆలస్యంగా ఏప్రిల్‌లో పనులు ప్రారంభమయ్యాయి. బయోరిమిడేషన్‌ ద్వారా ఆక్సిజన్‌ స్థాయిలను పెంచి, బీఓడీ లెవల్స్‌ తగ్గిస్తున్నట్లు చెబుతున్నారు. దాంతో నీటిలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు కూడా ప్రత్యేకంగా 50 మంది కార్మికులను ఏర్పాటు చేశారు.


సమన్వయ లోపమా?

చెత్త రాకుండా, మురుగు నీరు చేరకుండా, దుర్గంధం వెదజల్లకుండా హెచ్‌ఎండీఏ అధికారులు మరోసారి ఫ్లోటింగ్‌ ట్రష్‌ కలెక్టర్స్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. హుస్సేన్‌సాగర్‌ నిర్వహణ గతంలో హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్‌ అధికారులు చేపట్టగా, ప్రస్తుతం నిర్వహణ తీరు మారింది. సాగర్‌ చుట్టుపక్కల అభివృద్ధి పనులు ఇంజనీరింగ్‌ అధికారులు చేపడుతుండగా, జలాల శుద్ధిని ఇతర విభాగాలకు అప్పగించారు. దాంతో కొన్నాళ్లుగా సాగుతున్న పనులు యథావిధిగా నిర్వహిస్తున్నారే తప్ప.. క్షేత్రస్థాయి పరిశీలన ఉండడం లేదు. ఎక్కడికక్కడే చెత్త రాకుండా చర్యలు చేపట్టినట్లు ఇంజనీరింగ్‌ అధికారుల చెబుతుంటే, హుస్సేన్‌సాగర్‌లో చేరిన చెత్తను తొలగించేందుకు ట్రాష్‌ కలెక్టర్స్‌ ఏర్పాటుకు బీపీపీలోని ఓఎస్డీ విభాగ అధికారులు టెండర్లను పిలవడం అధికారుల సమన్వయ లోపానికి అద్దం పడుతోంది. నాలుగు ట్రాష్‌ కలెక్టర్స్‌ ద్వారా హుస్సేన్‌సాగర్‌లో ఐదేళ్ల పాటు వ్యర్థాలను తొలగించడానికి, ఆపరేషన్‌, మెయింటనెన్స్‌ పనులు రూ.4కోట్లతో టెండర్లను పిలిచారు. బిడ్‌ దాఖలుకు బుధవారం చివరి రోజుగా పేర్కొన్నారు. నిధుల ఖర్చు చేయడంపైనే అధికారులు దృష్టి పెడుతున్నారే కానీ.. ఏ మేరకు ఆ పనులు అవసరమనే అంశాన్ని పట్టించుకోవట్లేదు.

Updated Date - 2021-06-15T18:12:46+05:30 IST