టీ20 వరల్డ్‌క్‌పపై ఎందుకీ నాన్చుడు?

ABN , First Publish Date - 2020-06-18T07:41:57+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఓ అంతర్జాతీయ టోర్నీని నిర్వహించడం ఎంతో కష్టమనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఆటగాళ్ల ప్రాణాలను పణంగా పెట్టడానికి దేశాలు కూడా సిద్ధంగా లేవు. ఈ నేపథ్యంలో

టీ20 వరల్డ్‌క్‌పపై ఎందుకీ నాన్చుడు?

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఓ అంతర్జాతీయ టోర్నీని నిర్వహించడం ఎంతో కష్టమనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఆటగాళ్ల ప్రాణాలను పణంగా పెట్టడానికి దేశాలు కూడా సిద్ధంగా లేవు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అక్టోబరు-నవంబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌క్‌పను రద్దు చేయాలనే డిమాండ్‌ పెరిగింది. కానీ, ఐసీసీ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తోంది. అయితే, ఐసీసీ నాన్చుడు ధోరణిపై బీసీసీఐ మండిపడుతోంది. దీని వెనుక ఐసీసీ చైర్మన్‌గా త్వరలో పదవీ విరమణ చేయనున్న శశాంక్‌ మనోహర్‌ హస్తం ఉందని బీసీసీఐ ఆరోపిస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌ రద్దయితే ఐపీఎల్‌కు మార్గం సుగమం కానుంది. కానీ, భారత బోర్డు ప్రయోజనాలను దెబ్బ తీయడానికే కంకణం కట్టుకున్న మనోహర్‌.. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మోకాలడ్డుతున్నాడని విమర్శిస్తోంది. ఈ కారణంగా ఐపీఎల్‌ సన్నాహకాలు తీవ్రంగా దెబ్బతింటాయని వాపోతోంది. ‘త్వరలో పదవీ విరమణ చేయనున్న మనోహర్‌ ఎందుకు అయోమయానికి గురి చేస్తున్నారు? ఆతిథ్య దేశమే టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణకు సుముఖంగా లేదు. మరి నిర్ణయం తీసుకోవడానికి మరో నెలపాటు వాయిదా ఎందుకో? మనోహర్‌.. డబ్బు కోసం బీసీసీఐని నిలువరించాలనుకుంటున్నారా?’ అని బోర్డు అధికారి ఒకరు ప్రశ్నించారు. పొట్టి వరల్డ్‌కప్‌ భవితవ్యం తేల్చడానికి ఈనెల ఆరంభంలో ఐసీసీ బోర్డు సమావేశమైంది. కానీ, నిర్ణయాన్ని మరో నెల వాయిదా వేసింది. అయితే, ఐసీసీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటే.. సభ్య దేశాలు ద్వైపాక్షిక సిరీ్‌సలు ఏర్పాటు చేసుకొనేందుకు ఉపయోగపడుతుందని ఆ అధికారి అన్నారు. ‘ఇది బీసీసీఐ లేదా ఐపీఎల్‌కు సంబంధించింది కాదు. వరల్డ్‌క్‌పను వాయిదా వేస్తే.. ఐపీఎల్‌తో సంబంధం లేని దేశాలు ఆ సమయాన్ని ద్వైపాక్షిక సిరీ్‌సల నిర్వహణకు ఉపయోగించుకోవచ్చు. సాగదీత వల్ల అందరి ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది’ అని బీసీసీఐ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒకటి తేల్చేస్తే ఐపీఎల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌.. వేదికల పనిని వేగవంతం చేస్తుందన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీసీసీఐ వర్సెస్‌ మనోహర్‌గా మారే అవకాశం ఉంది. ఆయన కారణంగానే ఐసీసీ రెవెన్యూలో భారీ వాటాను బీసీసీఐ కోల్పోయింది. ‘ఓ నిర్ణయం తీసుకోవడానికి ఇంత గందరగోళం ఎందుకు? కొత్త చైర్మన్‌ నామినేషన్ల ప్రక్రియను కూడా ఎందుకు ప్రకటించలేదు’ అని మరో సీనియర్‌ అధికారి ప్రశ్నించారు. మనోహర్‌ చైర్మన్‌ పదవిని వదిలేటట్టు కనిపించడం లేదన్నారు. 

Updated Date - 2020-06-18T07:41:57+05:30 IST