TTD : సంప్రదాయ భోజనానికి ఆదిలోనే బ్రేకెందుకు పడింది..!?

ABN , First Publish Date - 2021-08-31T13:01:31+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎంతో ప్రచారం చేసుకుని ప్రయోగాత్మకంగా ..

TTD : సంప్రదాయ భోజనానికి ఆదిలోనే బ్రేకెందుకు పడింది..!?

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎంతో ప్రచారం చేసుకుని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంప్రదాయ భోజనం ఆదిలోనే ఆగిపోవడం వెనుక ఏం జరిగిందా..? అనే చర్చ జరుగుతోంది. ధర్మకర్తల మండలి లేని సమయంలో అధికారులు తీసుకున్న నిర్ణయం అని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పి మరీ దీనిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి మూడు నెలలుగా గోఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం పెడుతున్నారు. దీన్ని మరింత విస్తరించి భక్తులకు కూడా ఆరోగ్యకరమైన సంప్రదాయ ఆహారం అందించాలని టీటీడీ భావించింది.


మీడియాలో ఈ ఆలోచనకు మంచి ప్రాధాన్యం కూడా లభించింది. అయితే ఇంతలో ఏం జరిగిందో కానీ సోషల్‌ మీడియాలో విమర్శలు అనే కారణంతో ఈ ఆలోచనను విరమించుకుంటున్నట్టు సోమవారం స్పష్టం చేశారు.   రూ.వేల కోట్ల ఆదాయం వచ్చే టీటీడీ భక్తులకు అన్నప్రసాదాలను విక్రయించడం పట్ల సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చినా, ఇటువంటి అనేక విమర్శలను పెద్దగా పట్టించుకోని టీటీడీ దీనిమీద వెంటనే నిర్ణయం తీసుకోవడం పలువురిని విస్మయపరుస్తోంది. తిరుమలలో టీటీడీ భోజన విక్రయం మొదలు పెట్టడం అంటే ఒక హోటల్‌ నడపడం వంటిదే అని, ప్రస్తుతం ఉన్న హోటళ్లకు ఇది పెద్ద దెబ్బ అవుతుందనే ప్రచారం కూడా గతంలో వినిపించింది. ఇదే సమయంలో అన్నప్రసాదాలను వ్యాపారకోణంలో చూసి విక్రయించడం సరైన నిర్ణయం కాదంటూ పలు హిందూ ధార్మిక సంస్థలు కూడా అభ్యంతరం తెలిపినట్లు చెబుతున్నారు.


ప్రకృతి వ్యవసాయవేత్తలు చేసిన సూచనలతో  ఇందుకు శ్రీకారం చుట్టారు సేంద్రియ సేద్యంతో పండించిన బియ్యం, కూరగాయలు, పప్పుదినుసులను తిరుమలకు తీసుకు వచ్చారు. ఈనెల 26వ తేదీ నుంచి తిరుమలలోని అన్న మయ్య భవనంలో ప్రయోగాత్మకంగా ‘సాంప్రదాయ భోజనం’ ఉచితంగా పెడుతున్నారు. సెప్టెంబరు 8వ తేదీ వరకు ఈ విధానాన్ని పరిశీలించి లోటుపాట్లను సరిచేసిన తర్వాత భక్తులకు పూర్తిస్థాయిలో అందజేయాలని నిర్ణయించారు.టీటీడీకి ఇది భారం కాకూడదనే ఉద్దేశ్యంతో  లాభాపేక్షలేకుండా కాస్ట్‌ టూ కాస్ట్‌ కింద భక్తులకు సంప్రదాయ భోజనం విక్రయిస్తామని టీటీడీ ఉన్నతాఽధికా రులు ప్రకటించారు.


దీంతో ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడినట్లయింది. భవిష్యత్తులో ఇది మరింత వివాదాస్పదం అయ్యే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే విరమించుకున్నారని చెబుతున్నారు. పూర్వపు ఆహార పద్ధతులు అలవాటు చేయాలనే ఆలోచన మంచిదే నని, అమ్మకం ద్వారా కాక ఉచితంగా భక్తులకు అందించే ప్రయత్నం చేసి ఉండవచ్చని కొందరు అంటున్నారు. టీటీడీకి దాతల కొదవేమీ లేదని, ఈ పథకాన్ని వివరిస్తే రూ.కోట్లు పోగవడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు. సరైన ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, తమ నిర్ణయాలను తామే తప్పు పట్టి వెనక్కి తగ్గడం వంటి చర్యలు టీటీడీని అప్రతిష్టపాలు చేస్తాయనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-08-31T13:01:31+05:30 IST