పారిశ్రామిక ప్రాంతంపై ఎందుకీ చిన్నచూపు

ABN , First Publish Date - 2021-06-22T05:02:17+05:30 IST

ఈ నెల 23న జరగనున్న జీవీఎంసీ రెండో కౌన్సిల్‌ సమావేశంలో పారిశ్రామిక ప్రాంతంలోని 40, 58 నుంచి 63 వార్డులలో ఉన్న ఏ సమస్య చర్చకు రావడం లేదని తెలిసి వైసీపీ కార్పొరేటర్లు ఆవేదన చెందుతున్నారు.

పారిశ్రామిక ప్రాంతంపై ఎందుకీ చిన్నచూపు
పారిశ్రామిక ప్రాంతం వ్యూ

కౌన్సిల్‌ అజెండా పాయింట్లలో ఏడు వార్డుల ఊసేలేదు

ఆవేదన చెందుతున్న వైసీపీ కార్పొరేటర్లు


మల్కాపురం, జూన్‌ 21 : పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధిపై వైసీపీ కార్పొరేటర్లు దృష్టి పెట్టారు. ఇక్కడి సమస్యలను ఎప్పటికప్పుడు మేయర్‌, జీవీఎంసీ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు కూడా అందజేశారు. అయితే ఈ నెల 23న జరగనున్న జీవీఎంసీ రెండో కౌన్సిల్‌ సమావేశంలో పారిశ్రామిక ప్రాంతంలోని 40, 58 నుంచి 63 వార్డులలో ఉన్న ఏ సమస్య చర్చకు రావడం లేదని తెలిసి ఆవేదన చెందుతున్నారు. తొలి సమావేశంలోనే వార్డులలో ఉన్న సమస్యలు ప్రస్తావనకు రాలేదు. పోనీ రెండో సమావేశంలో అయినా ప్రస్తావనకు వస్తుందని భావించినా కౌన్సిల్‌ అజెండా పాయింట్లలో దీని గురించి లేకపోవడంతో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని వాపోతున్నారు. జీవీఎంసీ ఉన్నతాధికారులు ఈ నెల 23న నిర్వహించనున్న కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించి అజెండా పాయింట్లతో కూడిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ బుక్‌లెట్‌లో ఈ ప్రాంతంలోని సమస్యలకు ప్రాధాన్యం లభించలేదు. గత కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదం పొందిన 40వ వార్డు పరిధిలోని యారాడ ఘాట్‌ రోడ్డు అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని మాత్రమే అజెండా పాయింట్‌లో జీవీఎంసీ అధికారులు మళ్లీ పెట్టారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు నిరాశ చెందారు. 

వార్డుల్లోని సమస్యలు ఇవీ..

40వ వార్డు పరిధిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సమస్య, ఏకేసీ కాలనీలో సెప్టిక్‌ ట్యాంక్‌ల ఏర్పాటు, ప్రధాన గెడ్డ విస్తరణ, రాజీవ్‌కాలనీ సమస్యలను పరిష్కరించాలని వార్డు కార్పొరేటర్‌ అధికారులకు వినతి పత్రం ఇవ్వడంతో పాటు కౌన్సిల్‌ సమావేశం అజెండా పాయింట్లలో పెట్టాలని కోరారు. కానీ ఫలితం లేకపోయింది. 

58వ వార్డులో..

ఈ వార్డులో ప్రధానంగా రామ్‌నగర్‌, గుల్లలపాలెం గెడ్డ సమస్యలు ఉన్నాయి. ఈ గెడ్డలను ఆధునికీకరించడంతో పాటు గెడ్డలో ప్రవేశించే మురుగునీరు, వర్షపు నీరు హెచ్‌పీసీఎల్‌ లోపల నుంచి ఉన్న కాలువ ద్వారా ప్రవేశించే విధంగా మార్గం ఏర్పాటు చేయాలని సదరు కార్పొరేటర్‌ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. ఇది కూడా ప్రస్తావనకు రావడం లేదు.

59వ వార్డులో.. 

ఈ వార్డులో కొండవాలు ప్రాంతాల అభివృద్ధి, రక్షణ గోడల నిర్మాణం, కొండలపై ఉన్న ప్రజలకు మంచినీటి అవసరాలు తీర్చడం వంటి ప్రధాన సమస్యలతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వార్డులో ఉన్న సామాజిక భవనాలను సచివాలయాలకు కేటాయించడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సామాజిక భవనాలను నిర్మించాలని కోరినా ఈ సమస్యలపై కూడా ఎటువంటి ప్రస్తావన లేదు. 

60వ వార్డులో..

ఈ ప్రాంతంలో ఉన్న ఏడు వార్డులకు సంబంఽధించి కోరమాండల్‌ ఎరువుల కర్మాగారం గేటుకు సమీపంలో ఉన్న శ్మశానవాటిక అభివృద్ధి, ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులను పూర్తి చేయడం, పారిశుధ్య సిబ్బంది కొరత వంటి సమస్యలను వార్డు కార్పొరేటర్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇవి కూడా అజెండాలో లేవు. 

61వ వార్డులో..

ఈ వార్డు విషయానికి వస్తే ఈ వార్డు కార్పొరేటర్‌ దాడి సూర్యకుమారి మృతి చెందడంతో ఇక్కడి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకె వెళ్లేవారే లేరు. ఈ వార్డులో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ వార్డు పరిధిలో రామకృష్ణపురంలో భూగర్భ జలాలు కలుషితం కావడం, వెంకన్నపాలెంలో భూగర్భ జలాలు ఎండిపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. 

62వ వార్డులో..

ఈ వార్డులో క్రీడా మైదానం, కొండలపై రక్షణ గోడల నిర్మాణం, దుర్గానగర్‌ గెడ్డ అభివృద్ధి, మల్కాపురం ఎస్సీ కాలనీని ఆనుకుని ఉన్న పోర్టు స్థలంలో భారీ కల్యాణ మండపం ఏర్పాటుకు సంబంఽధించి అనేక సమస్యలు ఉన్నాయి.  

63వ వార్డులో..

ఈ వార్డులో కొండవాలు ప్రాంతాల అభివృద్ధి, సామాజిక భవనాలు, రోడ్లు, విద్యుత్‌, మంచినీటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలతో జనం నిత్యం బాధపడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ఆ వార్డు కార్పొరేటర్‌ అధికారులను కోరారు. కానీ వీటికీ అజెండాలో చోటు దక్కలేదు.  




Updated Date - 2021-06-22T05:02:17+05:30 IST