‘కరోనా’ కట్టడికి విస్తృత చర్యలు

ABN , First Publish Date - 2020-03-30T10:34:02+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యలపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ఇక్కడ నియోజకవర్గ స్థాయి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు.

‘కరోనా’ కట్టడికి విస్తృత చర్యలు

అధికారుల సమీక్షలో మంత్రి ముత్తంశెట్టి వెల్లడి

సమస్యలపై శాఖల వారీగా అధికారులు మొర


 నర్సీపట్నం, మార్చి 29  : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యలపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ఇక్కడ నియోజకవర్గ స్థాయి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రతను అరికట్టేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విస్తృత చర్యలు చేపడుతున్నారన్నారు.  మిగిలిన రాష్ర్టాలతో పోలిస్తే ఆంధ్రలో పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. రహదారుల దిగ్బంధంతో కరోనా కరుణించదని, స్వీయ నిర్బంధ వల్లే వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చునన్నారు.


అనంతరం  పలువురు అధికారులు శాఖాపరంగా సమస్యలపై మొరపెట్టుకున్నారు. నర్సీపట్నం మునిసిపాలిటీకి అవసరమైన బ్లీచింగ్‌, ఫినాయిల్‌ సరఫరా చేయాలని ఎమ్మెల్యే గణేశ్‌ కోరారు. ప్రాంతీయ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రక్త నమూనాల సేకరణకు పరికరాలు అందజేయాలని, కనీసం ఒక వెంటిలేటర్‌ అయినా ఏర్పాటు చేయాలని, ఐసోలేషన్‌ వార్డు నిర్వహణకు పరికరాలు సమకూర్చాలని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలవేణి దేవి విజ్ఞప్తి చేశారు.  పీహెచ్‌సీల్లో సిబ్బందికి అవసరమైన  మాస్కులు, ఇతర పరికరాలు  లేవని వైద్యులు వాపోయారు. ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గణేశ్‌, జేసీ శివశంకర్‌, ఏఎస్పీ రిశాంత్‌రెడ్డి, ఆర్డీవో కేఎల్‌ శివజ్యోతి, మునిసిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణితో పాటు ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-30T10:34:02+05:30 IST