విస్తారంగా వర్షాలు

ABN , First Publish Date - 2020-08-11T11:06:15+05:30 IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో రెండుమూడు రోజులుగా ముసుర్లు పడుతున్నాయి. పగలు అక్కడక్కడా చిరుజల్లులు కురిసినప్పటికీ, రాత్రి

విస్తారంగా వర్షాలు

అర్బన్‌ జిల్లాలో 86మి.మీ నమోదు


వరంగల్‌ అర్బన్‌ అగ్రికల్చర్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో రెండుమూడు రోజులుగా ముసుర్లు పడుతున్నాయి. పగలు అక్కడక్కడా చిరుజల్లులు కురిసినప్పటికీ, రాత్రి వర్షం దంచికొడుతోంది. వరినాట్లు మొదలైనప్పటి నుంచి వానలు సరిగా కురవకపోవడంతో రైతులు కొంత ఆందోళన చెందారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 86.0 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. భీమదేవరపల్లిలో 95.8మి.మీ, ఎల్కతుర్తి 96.8మి.మీ, కమలాపూర్‌99.2 మి.మీ, హసన్‌పర్తి 43.2మి.మీ, ధర్మసాగర్‌ 83.4మి.మీ, హన్మకొండ 98.4మి.మీ, వరంగల్‌85.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆకాశం పూర్తిగా మేఘవృతమై వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. జిల్లాలో వరినాట్లు చివరి దశలో ఉన్నాయి. వానాకాలం పంటలకు ఈ వర్షాలు మేలుకూర్చేవేనని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు అధికంగా పొలంలో నిల్వ ఉండకుండా రైతులు చర్యలు చూసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. 


లోతట్టు ప్రాంతాలు జలమయం..

వరంగల్‌ టౌన్‌: నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కాశిబుగ్గ లేబర్‌కాలనీ, ఏనుమాములలోని పలు లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు చేరింది. ఎస్‌ఆర్‌నగర్‌, సాయిగణే్‌షకాలనీ, మధురానగర్‌, లక్ష్మిగణ్‌షకాలనీల్లోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఖిలావరంగల్‌, శివనగర్‌, మైసయ్యనగర్‌, గాంధీనగర్‌, శాలినీనగర్‌, చంద్రవదనకాలనీ, జ్యోతిబసునగర్‌, కట్టమల్లన్న గుడి ప్రాంతాలు జలమయమయ్యాయి. కార్పొరేటర్లు, అధికారులు స్పందించి లోతట్టు ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.


శాకరాసికుంటలో నాలాకు గండి

కరీమాబాద్‌: వరంగల్‌ 20వ డివిజన్‌ శాకరాసికుంట నాలా వ్యర్థాలతో నిండిపోయింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్డు మధ్యలో గండిపడటంతో ప్రమాదకరంగా మారింది. వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బల్దియ సిబ్బంది వ్యర్థాలను తొలగించే పనులు ప్రారంభించారు. 

Updated Date - 2020-08-11T11:06:15+05:30 IST