రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

ABN , First Publish Date - 2022-01-28T06:44:38+05:30 IST

అనకాపల్లి మండలం ఉమ్మలాడ జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

మృతులు భవన నిర్మాణ కార్మికులు

అనకాపల్లి టౌన్‌/బుచ్చెయ్యపేట, జనవరి 27: అనకాపల్లి మండలం ఉమ్మలాడ జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి ట్రాఫిక్‌ సీఐ సీహెచ్‌ ప్రసాద్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. బుచ్చెయ్యపేట మండలం పెదమదీన గ్రామానికి చెందిన యర్రంశెట్టి నాగేశ్వరరావు (45), ఆయన భార్య రామలక్ష్మి (40) భవన నిర్మాణ కార్మికులు. రోజు మాదిరిగానే ద్విచక్ర వాహనంపై గురువారం ఉదయం నాగులాపల్లిలో పనికి వచ్చారు. సాయంత్రం తిరిగి వెళుతుండగా ఉమ్మలాడ జంక్షన్‌ దాటిన తరువాత వీరి పైనుంచి విశాఖపట్నం నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న కంటైనర్‌ దూసుకుపోవడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందో విచారణలో తెలియాల్సి వుందని సీఐ ప్రసాద్‌ తెలిపారు. భార్యాభర్తలు బైక్‌పై వెళుతూ అదుపుతప్పి వాహనం కింద పడ్డారా?, లేక మరో వాహనం ఢీకొనడం వల్ల కంటైనర్‌ కిందపడి మృతిచెందారా?...అన్నది తేలాల్సి ఉందన్నారు. మృతదేహాలను ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.


పెదమదీనలో విషాదం

పొట్టకూటి కోసం పనికి వెళ్లిన దంపతులు అందని లోకాలకు చేరుకోవడంతో పెదమదీనలో పెను విషాదం చోటుచేసుకుంది. నాగేశ్వరరావు, రామలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తాపీ మేస్ర్తీ అయిన నాగేశ్వరరావు కుటుంబ పోషణ కష్టంగా మారడంతో భార్యను కూడా తనతో పాటు భనవ నిర్మాణ పనులకు తీసుకువెళుతున్నాడు. అలా పనికి వెళ్లి ఇంటికి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. 


Updated Date - 2022-01-28T06:44:38+05:30 IST