లైవ్‌షోలో భర్త, బిడ్డల్ని వదిలి ప్రియుడితో వెళ్లింది!

ABN , First Publish Date - 2021-12-31T14:09:45+05:30 IST

తమిళనాట ఓ నాలుగైదేళ్ల క్రితం.. ఓ తమిళ టీవీ లైవ్‌షోను యావత్‌ రాష్ట్రం ఉత్కంఠతో చూసింది. అందులో అన్నపూర్ణ అనే ఓ మహిళ తనకు భర్త, కుమారుడు అవసరం లేదని, తన ప్రియుడే తనకు ప్రాణమంటూ అతని చేతులు పట్టుకుని విసావిసా

లైవ్‌షోలో భర్త, బిడ్డల్ని వదిలి ప్రియుడితో వెళ్లింది!

- నాలుగేళ్ల తరువాత ఆదిపరాశక్తిగా అవతారం

- పాత వీడియోలతో విరుచుకుపడుతున్న నెటిజన్లు

- ఆమెను అరెస్టు చేయాలంటూ హిందూ సంస్థల ఫిర్యాదు


చెన్నై: తమిళనాట ఓ నాలుగైదేళ్ల క్రితం.. ఓ తమిళ టీవీ లైవ్‌షోను యావత్‌ రాష్ట్రం ఉత్కంఠతో చూసింది. అందులో అన్నపూర్ణ అనే ఓ మహిళ తనకు భర్త, కుమారుడు అవసరం లేదని, తన ప్రియుడే తనకు ప్రాణమంటూ అతని చేతులు పట్టుకుని విసావిసా బయటకు వెళ్లిపోయింది. ఆ కార్యక్రమం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తరువాత ఆ మహిళ ఏమైందో ఎవ్వరికీ తెలియదు. సీన్‌ కట్‌ చేస్తే.. ఆమె ఇప్పుడు తను ఆదిపరాశక్తి అవతారమంటూ అందరికీ ఆశీస్సులందజేస్తోంది. మాతాజీగా భక్తుల్ని ఆకట్టుకునేందుకు రకరకాల పాట్లు పడుతోంది. చెన్నై శివారుప్రాంతంలో ఆ మహిళ ఆదిపరాశక్తి అవతారం తానేనంటూ భక్తుల నడుమ విన్యాసాలు చేస్తోంది. పట్టుచీర, వంటి నిండా నగలు, మెడలో తామరపూల మాలలు వేసుకుని, అరచేతిని అభయహస్తంగా చూపుతూ పూనకం వచ్చినట్టు ఊగిపోతోంది. భక్తులు ఆమెకు హారతులు పట్టడం, ఆమె వద్ద తమ కష్టాలు చెప్పుకోవడం, వారి కోర్కెలు వింటూ ఆమె కుర్చీలో ఊగిపోవడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ప్రసారమవ్వడంతో ఆమెకు భక్తులు పెరిగారు. అయితే ఆమె అప్పట్లో టీవీ షోలో భర్త, కొడుకులను వదిలేసి, ప్రియుడితో వెళ్లిపోయిన మహిళేనని గుర్తించిన కొంతమంది నెటిజన్లు ఆమెపై ఎదురుదాడికి దిగారు. సచ్చీలత లేని ఆమె ఇప్పుడు ఆదిపరాశక్తిగా ఎలా మారిందంటూ చర్చలు లేవదీశారు. అదే సమయంలో ఆంగ్ల సంవత్సరాదికి ఈ ‘మాతాజీ’ భక్తులకు ప్రత్యేక సందేశం ఇవ్వనున్నారంటూ పత్రికలు, టీవీ ఛానెళ్లలో ప్రకటనలు వెలువడ్డాయి. దీనితో ఆధ్యాత్మిక సంస్థలు మాతాజీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, ఆమెను అరెస్టు చేయాలని పట్టుబడుతున్నాయి. కాగా రెండు రోజుల క్రితం అన్నపూర్ణ చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేసింది. తనకు హత్యా బెదిరింపులు వస్తున్నాయంటూ ఆరోపించింది. గతంలో తను వదిలేసిన భర్త మృతికి తానే కారణమంటూ వారు వదంతులు వ్యాపింపజేస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని ఆమె అభ్యర్థించింది. ఆ మరుసటి రోజు ఐదు హిందూసంస్థలు అన్నపూర్ణపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాయి. ఆదిపరాశక్తి అవతారమంటూ ఆమె చేసుకుంటున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని, అమాయక భక్తులను వంచిస్తున్న ఆమెను అరెస్టు చేయాలని కోరాయి. కాగా ఈ మొత్తం వ్యవహారం తమిళనాట తీవ్ర చర్చనీయాంశమైంది. 

Updated Date - 2021-12-31T14:09:45+05:30 IST