కొత్త చాంపియన్‌ను చూస్తామా?

ABN , First Publish Date - 2021-05-30T09:31:08+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఈసారి మెయిన్‌ డ్రా నుంచే ఆసక్తికరంగా మారింది. టెన్నిస్‌లో బిగ్‌త్రీగా భావించే రోజర్‌ ఫెడరర్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్‌ నడాల్‌, నొవాక్‌ జొకోవిచ్‌లు పురుషుల సింగిల్స్‌ డ్రాలో...

కొత్త చాంపియన్‌ను చూస్తామా?

  • బిగ్‌త్రీలో ఒక్కరికే ఫైనల్‌ చాన్స్‌
  • జోరుమీదున్న యువ కెరటాలు
  • రికార్డు టైటిల్‌ వేటలో సెరెనా
  • నేటినుంచే ఫ్రెంచ్‌ ఓపెన్‌
  • మ. 2.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో


పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఈసారి మెయిన్‌ డ్రా నుంచే ఆసక్తికరంగా మారింది. టెన్నిస్‌లో బిగ్‌త్రీగా భావించే రోజర్‌ ఫెడరర్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్‌ నడాల్‌, నొవాక్‌ జొకోవిచ్‌లు పురుషుల సింగిల్స్‌ డ్రాలో ఒకే పార్శ్వం నుంచి ఆడడనుండంతో.. టైటిల్‌ ఫైట్‌కు ముందు ఒకటి లేదా రెండు ఫైనల్‌ కాని ఫైనల్‌ మ్యాచ్‌లు జరిగే చాన్సుంది. ఇక్కడ 14వ టైటిల్‌ వేటలో ఉన్న స్పెయిన్‌ బుల్‌ నడాల్‌.. ఆదివారం మొదలయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇక.. డ్రా ప్రకారం క్వార్టర్స్‌లోనే స్విస్‌ దిగ్గజం ఫెడరర్‌తో వరల్డ్‌ నంబర్‌ వన్‌ జొకోవిచ్‌ తలపడే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌ విజేత సెమీ్‌సలో నడాల్‌తో అమీతుమీ తేల్చుకోవచ్చు. తొలి రౌండ్‌లోశాండ్‌గ్రెన్‌ (అమెరికా)తో టాప్‌సీడ్‌ జొకో, అలెక్సీ పాపిరన్‌ (ఆస్ట్రేలియా)తో మూడోసీడ్‌ నడాల్‌, క్వాలిఫయర్‌ డెన్నిస్‌ ఇస్టోమెన్‌ (ఉజ్బెకిస్థాన్‌)తో ఎనిమిదో సీడ్‌ రోజర్‌ తలపడనున్నారు.  


కొత్త వాళ్లకూ చాన్స్‌ 

బిగ్‌త్రీ ఒకే పార్శ్వంలో ఆడడం.. గాయం కారణంగా మాజీ చాంప్‌ వావ్రింకా దూరమవడంతో మరో పార్శ్వం నుంచి కొత్త ఆటగాడు ఫైనల్‌ చేరనున్నాడు. ఈ క్రమంలో నాలుగో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌కు అవకాశాలెక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆస్ట్రియా ఆటగాడైన థీమ్‌రే ఇదివరకే మూడుసార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరిన రికార్డు ఉంది. మరి థీమ్‌ టైటిల్‌ కొట్టి కొత్త విజేతగా అవతరిస్తాడో లేదో చూడాలి. 


నాలుగో రౌండ్‌లోనే హోరాహోరీ?

సీడెడ్‌ ఆటగాళ్లందరూ నాలుగో రౌండ్‌కు చేరితే.. గట్టిపోటీ నెలకొనే అవకాశం ఉంది. గొఫిన్‌తో జొకో, మెటో బెరెట్టినీతో ఫెడరర్‌, మోన్‌ఫిల్స్‌తో నడాల్‌, క్లే కోర్ట్‌ స్పెషలిస్ట్‌ కాస్పర్‌ రడ్‌తో థీమ్‌, రష్యన్‌ స్టార్‌ మెద్వెదెవ్‌తో దిమిత్రోవ్‌ తలపడే అవకాశముంది. 


మెద్వెదెవ్‌కు కఠినం?

రెండో సీడ్‌ మెద్వెదెవ్‌కు తొలి రౌండ్‌లోనే కఠిన పరీక్ష ఎదురు కానుంది. 37వ ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ బబ్లిక్‌తో అతడు తలపడనున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మెద్వెదెవ్‌ నాలుగుసార్లు బరిలోకి దిగినా.. అతడు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. మరి ఈసారైనా ఆ గండాన్ని అధిగమిస్తాడో వేచి చూడాలి. 




ఈసారైనా నెరవేరేనా?

ఓపెన్‌ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించాలనుకుంటున్న అమెరికా టెన్నిస్‌ క్వీన్‌ సెరెనా విలియమ్స్‌ కల ఈసారైనా నెరవేరుతుందో? లేదో చూడాలి. 23 గ్రాండ్‌స్లామ్‌లతో మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డును సమం చేసిన సెరెనా.. 24వ టైటిల్‌ కోసం ఎదురు చూస్తోంది. తొలి రౌండ్‌లో 74వ ర్యాంకర్‌ ఇరినా కెమేలియా బిగుతో సెరెనా తలపడనుంది. మహిళల సింగిల్స్‌లో హాట్‌ ఫేవరెట్‌ అయిన వరల్డ్‌ నంబర్‌ త్రీ సిమోనా హలెప్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొంది. కాగా, 2019 చాంపియన్‌ ఆష్లే బార్టీ మరోసారి టైటిల్‌పై గురి పెట్టింది. అయితే, యువ కెరటం నవోమి ఒసాకతో పాటు కొకొ గాఫ్‌, స్టార్లు ప్లిస్కోవా, స్విటోలినా, డిఫెండింగ్‌ చాంప్‌ స్వియాటిక్‌ ఉన్న పార్శ్యంలో ఉండడంతో బార్టీకి గట్టిపోటీ తప్పదు. కేన్సర్‌ను జయించిన తర్వాత తొలిసారి ఆడుతున్న స్పెయిన్‌ ప్లేయర్‌ సువారెజ్‌ నవారో.. తొలి రౌండ్‌లో స్లోన్‌ స్టీఫెన్స్‌తో తలపడనుంది. 

Updated Date - 2021-05-30T09:31:08+05:30 IST