చైనా మనపై యుద్ధానికి వస్తుందా?

ABN , First Publish Date - 2020-09-30T07:15:40+05:30 IST

ఐదారు నెలలుగా ప్రతి భారతీయుడి ఆలోచనలను చైనా ఆవహించి ఉంది. మనదేశ ప్రజలలో చాలా మందికి పాకిస్థాన్ నుంచి ఎదురవుతున్న ముప్పు గురించి తెలుసు...

చైనా మనపై యుద్ధానికి వస్తుందా?

భారత్ తనకు తానుగా యుద్ధానికి దిగకూడదు. కానీ యుద్ధానికి సదా సంసిద్ధమై ఉండి తీరాలి. తనతో పోరాడేందుకు భారత్ సర్వసన్నద్ధమై ఉందని చైనా గ్రహించి తీరాలి. జయాపజయాలు ఏమైనప్పటికీ భారత్ కదనోత్సాహంతో ఉందని చైనా తెలుసుకునేట్లు చేసి తీరాలి. మన యుద్ధ సన్నాహాలను జాగ్రత్తగా బేరీజు వేసుకొంటున్న చైనా మనం సమరసన్నద్ధంగా ఉన్నామని భావిస్తే యుద్ధానికి రాదు. చైనా సైనిక మహాశక్తిని మన మేధో ప్రజ్ఞ– దౌత్య కుశలత, ఆర్థిక దక్షత, రాజనీతిజ్ఞత-లతో ఓడించి తీరాలి. 


ఐదారు నెలలుగా ప్రతి భారతీయుడి ఆలోచనలను చైనా ఆవహించి ఉంది. మనదేశ ప్రజలలో చాలా మందికి పాకిస్థాన్ నుంచి ఎదురవుతున్న ముప్పు గురించి తెలుసు. నేటి శతాధిక కోట్ల భారతీయులలో 75 శాతం మంది, 1962 అక్టోబర్ లో చైనా మన భూభాగాలను ఆక్రమించిన నాటికి, ఇంకా పుట్టనే లేదు. మన సరిహద్దులలో ఒక మహాబలుడు ఒక దుష్టసంకల్పంతో కాచుకుని కూర్చున్నాడన్న వాస్తవాన్ని మనం 2020 జూన్ దాకా అర్థం చేసుకోలేదు. లద్దాఖ్ లో మన భూభాగాలను దురాక్రమిస్తున్న చైనాను నిలువరించే ప్రయత్నంలో మన వీరసైనికులు ఇరవైమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన నిర్ఘాంతపరిచిన తరువాతనే మన సార్వభౌమత్వానికి చైనా నుంచి వాటిల్లుతున్నచేటు తెలిసివచ్చింది. ప్రకృతి వరప్రసాదమైన మన హిమాలయాలలో లక్ష చదరపు కిలోమీటర్ల భూభాగాలను స్వాయత్తం చేసుకునేందుకు వేచి ఉన్న ఒక సుప్తశత్రువు చైనా అన్న సత్యాన్ని ఆసేతుహిమాచలం అవగతం చేసుకుంది. 


భారతదేశ చరిత్రలో, భారతీయుల జీవితాలలో హిమాలయాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సింధు నది ప్రస్థానం హిమాలయాల్లోనే ప్రారంభమవుతుంది. గంగోత్రి ఆ మంచుకొండలలోనే ఉంది. బ్రహ్మపుత్రా ప్రవాహఝరికి నిత్యం తొలుత పులకించేది ఆ హిమనగాలే. ఆ హిమాలయాలలో 1962 నాటి పరాజయం భారతీయులకు ఒక చేదుస్మృతిగా మిగిలిపోయింది. అవును, కాలం చెరిపివేయలేని ఒక బాధాకర జ్ఞాపకమది. శత్రువును జాగ్రత్తగా గమనించాలని చాణక్యుడు, ఇతర పురాతన భారతీయ ప్రాజ్ఞులు ప్రబోధించారు. కమ్యూనిస్టు చైనాను మనం సరిగా అర్థం చేసుకున్నామా? లేదు. 1951దాకా చైనా మనకు పొరుగుదేశం కానేకాదు. ఆ ఏడాది మన పొరుగుదేశమైన టిబెట్ ను చైనా ఆక్రమించింది. టిబెట్ దేశం చైనా హస్తగతం కావడంతో భారత్, చైనాలు ఇరుగు పొరుగు దేశాలయ్యాయి. ఇప్పుడు ఇరుదేశాల మధ్య 3500 కిలోమీటర్ల నిడివిగల సరిహద్దు ఉంది. 1951 నుంచి మన దేశానికి చైనా ఎడతెగని సమస్యలు సృష్టిస్తూనే ఉంది. మంచి పొరుగుదేశంగా మనగలదనే విశ్వాసంతో చైనా డిమాండ్లు అన్నిటినీ జవహర్ లాల్ నెహ్రూ అంగీకరించారు. టిబెట్ ఆక్రమణను ప్రశ్నించకపోగా ఆ దేశంతో వందల సంవత్సరాలుగా కుదుర్చుకున్న ఒప్పందాలన్నిటికీ ఆయన తిలోదకాలు ఇచ్చారు. చైనాను సంతృప్తిపరచడానికే నెహ్రూ అలా చేశారన్నది స్పష్టం. అయినప్పటికీ చైనా 1956 నుంచి హిమాలయ ప్రాంతాలైన అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ మొదలైన వాటిని తమ భూభాగాలుగా ప్రకటించుకుంటూ వస్తోంది. ఆ ప్రాంతాలు అన్ని చారిత్రక యుగాలలోనూ తనలో అంతర్భాగంగా ఉన్నాయని మన దేశం వాదించింది. సింధు -గంగా మైదాన ప్రాంతాలలో విలసిల్లిన వివిధ సామ్రాజ్యాల అధినేతలు పలు సందర్భాలలో ఆ హిమాలయ రాజ్యాల పాలకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని, సంబంధిత ఒప్పందపత్రాలు ఇంకా భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే ఆ పాత ఒప్పందాలు ఇప్పుడు నిరుపయోగమని, ఇరు దేశాలూ మళ్ళీ సరికొత్త ఒడంబడికలకు చేసుకోవలసిన అవసరముందని చైనా వాదించింది. 1867లో రష్యా నుంచి అలాస్కాను అమెరికా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ సువిశాల ప్రాంతాన్ని మళ్ళీ తమకు ఇచ్చివేయాలని రష్యా డిమాండ్ చేస్తుందా? 


‘మీరు మీ శత్రువుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. మీ గురించి మీరు ఒక కచ్చితమైన అంచనాకు రావాలి. అప్పుడు మీరు వంద భయానక యుద్ధాలలో కూడా ప్రమాదంలో పడరు’ అని చైనా పురాతన యుద్ధతంత్ర నిపుణుడు ఒకరు చెప్పారు. మరి చైనీయుల చింతనా ధోరణి ఏమిటి? ప్రపంచానికి తమ దేశమే కేంద్రమని చైనా వారు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మానవ జాతులలో తామే ఆధిక్యులమని, ఇతరులు తమ కంటే తక్కువ వారనే అభిజాత్యం కూడా వారిలో నిండుగా ఉంది. మహోన్నత పురాతన నాగరికతలలో ఒకటి చైనాలో విలసిల్లింది. చైనీయులు చైనీస్ భాషను మాత్రమే మాట్లాడతారు. 1949లో మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు చైనా అధికారాన్ని కైవసం చేసుకున్నాక ఒక శక్తిమంతమైన నిరంకుశాధికార వ్యవస్థను నెలకొల్పారు. ప్రాచీన యుగాల పాలకుల వలే నవీన కాలం కమ్యూనిస్టులూ నియంతృత్వాధికారాలను చెలాయిస్తూ వస్తున్నారు. 


కమ్యూనిస్టు చైనా నిరంతరం ఇరుగు పొరుగు దేశాల భూభాగాలు కొన్నిటిపై తమకు హక్కు ఉన్నదని బెదిరిస్తూనే ఉంది. మనతో చైనా సరిహద్దు వివాదం 1959లో ప్రారంభమయింది. ఆరు దశాబ్దాలుగా తమ భౌగోళిక రేఖాపటాలను నివేదించాలని మన దేశం డిమాండ్ చేస్తున్నా, అందుకు చైనా పాలకులు ససేమిరా అంటున్నారు. ఫలితంగా సరిహద్దు వివాదం ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. పరిష్కార జాప్యానికి బాధ్యులు ఎవరు? కాల విలంబనతో పైచేయి సాధించాలనేది చైనా యుక్తి. చైనాలో 1949 నుంచీ అదే కమ్యూనిస్టు ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఇదే కాలంలో మన దేశం 15 మంది ప్రధానమంత్రుల పాలనను చూసింది. 


చైనాకు 14 దేశాలతో భూ సరిహద్దులు ఉన్నాయి. భారత్, భూటాన్ మినహా మిగతా దేశాలతో ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకుంది. ఇప్పుడేమో దక్షిణ చైనా సముద్రంపై పూర్తి హక్కు తనదేనని వాదిస్తూ పలు దేశాలతో వివాదానికి దిగుతోంది. ఆ వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. దక్షిణ చైనా సముద్రంలో తాము మినహా మరే దేశం వారూ చేపలు పట్టుకోకూడదని; చమురు, సహజవాయు నిక్షేపాలను వినియోగించుకోకూడదని ఆంక్షలు విధిస్తోంది. 1963 నుంచి చైనా పాలకులు పాకిస్థాన్ ను మన పైకి ఉసికొల్పుతున్నారు. సాధ్యమైనంతవరకు యుద్ధానికి దిగకుండా ఉండడమే చైనా వ్యూహం. లద్దాఖ్‌లో ఇటీవల పరిణామాలను నిశితంగా గమనిస్తే చైనా మనపై ఈపాటికే దాడి చేసి ఉండాల్సిందన్న భావన కలుగుతుంది. కానీ అలా జరగలేదు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలు తనను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నందునే వెనుకాడింది.  


సరే, ప్రస్తుత సంకట పరిస్థితుల్లో భార‍త్ ఏం చేయాలి? చైనాతో శత్రుత్వం సుదీర్ఘకాలం కొనసాగగలదనే సత్యాన్ని ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. మనం మన సైనికపాటవాన్ని అన్నివిధాలా పెంపొందించుకోవాలి; టిబెట్ ఆక్రమణను ప్రశ్నించేందుకు గట్టిగా ప్రయత్నించాలి. ఆ దేశం నుంచి చైనా వైదొలగాలని ఐక్యరాజ్యసమితిలో డిమాండ్ చేయాలి. చైనా, పాకిస్థాన్‌ల నుంచి ఏకకాలంలో ఎదురయ్యే సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొనేందుకు మనం ఆర్థికంగా బలపడాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలి. మన దేశం తనకు తానుగా యుద్ధానికి దిగకూడదు. అయితే యుద్ధానికి సదా సంసిద్ధమై ఉండితీరాలి. తనతో పోరాడేందుకు భారత్ సర్వసన్నద్ధమై ఉన్నదని చైనా గ్రహించి తీరాలి. జయాపజయాలు ఏమైనప్పటికీ భారత్ కదనోత్సాహంతో ఉందని చైనా తెలుసుకునేట్లు చేసి తీరాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే మన యుద్ధ సన్నాహాలను జాగ్రత్తగా బేరీజు వేసుకొంటోంది. మనదేశం సమరసన్నద్ధంగా ఉందని భావిస్తే మనపై యుద్ధానికి అది రాదు. అవును, చైనా సైనిక మహాశక్తిని మన మేధో ప్రజ్ఞ-– దౌత్య కుశలత, ఆర్థిక దక్షత, రాజనీతిజ్ఞత-లతో ఓడించితీరాలి. 

పెంటపాటి పుల్లారావు

Updated Date - 2020-09-30T07:15:40+05:30 IST