కరోనా దెబ్బ.. వారంలో పనిదినాలు నాలుగే...?

ABN , First Publish Date - 2020-05-26T01:57:36+05:30 IST

కరోనా దెబ్బకు తెరపైకొచ్చిన నాలుగు రోజుల పనిదినాలు

కరోనా దెబ్బ.. వారంలో పనిదినాలు నాలుగే...?

వెల్లింగ్టన్: కరోనా కోరలు పెరికేసిన దేశం న్యూజీల్యాండ్‌పైనే ప్రస్తుతం అందరిదృష్టి కేంద్రీకృతమైంది. ఆ దేశ ప్రధాని తీసుకున్న సత్వర నిర్ణయాలు.. ప్రజలకు కరోనా పీడ విరగడయ్యేలా చేశాయి. అయితే కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోని కారణంగా ఏమాత్రం అలసత్వానికి తావులేదని అనేక దేశాలు గర్తించాయి. ఇక కరోనా కట్టడిలో ముందున్న న్యూజీలాండ్ ఈ విషయంలోనూ ప్రపంచానికి మార్గదర్శనం చేస్తోంది. పర్యాటక రంగాన్ని ఎలా పరుగులెత్తించాలనే దానిపై ఇటీవల న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డర్న్ మాట్లాడారు. ఆంక్షలను అమలు చేస్తూనే పర్యటక రంగాన్ని లేవనెత్తేందుకు సృజనాత్మకమైన ఆలోచనలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా.. కరోనా కారణంగా పని ప్రదేశాల్లో వస్తున్న మార్పులపై కూడా ఆమె చర్చించారు. ముఖ్యంగా భౌతిక దూరం నిబంధన పాటించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వారానికి నాలుగు పనిదినాలుండే  విధానం గురించి తన వద్ద అనేక మంది ప్రస్తావించారని తెలిపారు. ఇటువంటి కొత్త ఆలోచనల అవసరం ఎంతో ఉందని వ్యాఖ్యానించిన ఆమె.. నాలుగు రోజుల పనిదినాల అంశమనేది యజమాన్యాల, ఉద్యోగుల వైఖరులపై ఆధారపడుతుందని తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సింది వారేనని వ్యాఖ్యానించారు.  

Updated Date - 2020-05-26T01:57:36+05:30 IST