ఎన్నికల సర్వేలు ఫెయిల్ అవుతాయి: అఖిలేష్ యాదవ్

ABN , First Publish Date - 2022-01-13T23:35:59+05:30 IST

ఇప్పటికి వెలువడుతున్న ఒపీనియన్ పోల్ సర్వేల్లో భారతీయ జనతా పార్టీ 215-250 సీట్లు గెలుస్తుందని చెప్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలుచుకుంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ గత ఎన్నికల్లో 47 సీట్లు గెలుచుకోగా.. ఈ ఎన్నికల్లో 100 సీట్ల వరకు గెలుస్తుందనే అంచనాలు వస్తున్నాయి..

ఎన్నికల సర్వేలు ఫెయిల్ అవుతాయి: అఖిలేష్ యాదవ్

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వస్తున్న సర్వేలు అన్ని అవాస్తవమని ఎన్నికల ఫలితాల అనంతరం నిరూపితమవుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం వస్తున్న ఒపీనియన్ పోల్స్ సర్వేల్లో ఉత్తరప్రదేశ్‌లో మరోసారి కమలం అధికారం చెపడుతుందని చెప్తున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెజారిటీ తగ్గినప్పటికీ బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని వెల్లడిస్తున్నాయి.


అయితే ఈ విషయమై అఖలేష్ మాట్లాడుతూ ‘‘ఈ ఎన్నికల్లో యూపీలో నిర్వహించే సర్వేలు అన్నీ విఫలమవుతాయి. ఇప్పుడు వెలువడుతున్న సర్వే ఫలితాలకు ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాలు భిన్నంగా ఉంటాయి. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో ఓడుతుంది’’ అని అన్నారు.


ఇప్పటికి వెలువడుతున్న ఒపీనియన్ పోల్ సర్వేల్లో భారతీయ జనతా పార్టీ 215-250 సీట్లు గెలుస్తుందని చెప్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలుచుకుంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ గత ఎన్నికల్లో 47 సీట్లు గెలుచుకోగా.. ఈ ఎన్నికల్లో 100 సీట్ల వరకు గెలుస్తుందనే అంచనాలు వస్తున్నాయి. ఇక రాష్ట్రంలో మరొక ప్రధాన పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ 30 లోపు స్థానాలనే గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో 19 స్థానాలు మాత్రమే గెలిచిన బీఎస్‌పీ 22.23 శాతం ఓట్ బ్యాంక్‌తో రెండవ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి ఓట్ల శాతంలో కూడా బీఎస్‌పీ బాగా వెనకబడి పోనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

Updated Date - 2022-01-13T23:35:59+05:30 IST