రాజకీయాలు చేయడం తప్పుకాదు.. కానీ..

ABN , First Publish Date - 2021-07-21T05:54:10+05:30 IST

అన్యాయాన్ని ఎదురిస్తూ..

రాజకీయాలు చేయడం తప్పుకాదు.. కానీ..
దంతన్‌పల్లిలో మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ప్రాణం ఉన్నంత వరకు న్యాయం కోసం పోరాడుతా

ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌


ఉట్నూర్‌: అన్యాయాన్ని ఎదురిస్తూ.. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు న్యాయం కోసం పోరాడుతానని స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మండలంలోని దంతన్‌పల్లిలో స్వేరోస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్ఞాన ఖడ్గధారణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాజకీయాలు చేయడం తప్పుకాదని తనకు ప్రస్తుతం ఆ ఆలోచన లేదన్నారు. భవిషత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఐపీఎస్‌ సాధించాక జిల్లాలో తొలిసారిగా ఉద్యోగంలో చేరానని, యాదృచ్ఛికంగా ఉద్యోగ విరమణ అనంతరం కూడా జిల్లాకే తొలిసారిగా వచ్చానని అన్నారు. జిల్లాతో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. జ్ఞాన ఖడ్గధారణ కార్యక్రమం ద్వారా పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు మంచి ఆలోచన వస్తుందన్నారు. అంతకు ముందు మండలంలోని లింగోజి తండా ఎక్స్‌ రోడ్డు వద్ద ఉన్న గిరిజన దివంగత ఐఏఎస్‌ అధికారి మడావి తుకారాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దంతన్‌పల్లికి చేరుకున్న ప్రవీణ్‌కుమార్‌కు స్వేరోస్‌ ఆధ్వర్యంలో ఘన స్వాగతం  చేయగా అక్కడ ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుమ్ర ఈశ్వరీబాయి, సర్పంచ్‌ ముచ్చినేని భూమన్న, స్వేరోస్‌ జిల్లా అధ్యక్షుడు ఊశన్న,  సోలపోగుల స్వాములు పాల్గొన్నారు. 


నాగోబాకు పూజలు.. 

ఇంద్రవెల్లి: మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని మంగళవారం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సర్పంచ్‌ మెస్రం రేణుక నాగ్‌నాథ్‌, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు ఆధ్వర్యంలో శాలువతో సత్కరించారు. ముందుగా ముత్నూర్‌లోని కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇంద్రవెల్లిలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 ఏళ్ల ఉద్యోగ జీవితంలో పదిశాతం మందికి సేవలు అందించామని, మిగిలిన 90 శాతం మందికి సేవలు అందిచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమలో స్వేరోస్‌ జిల్లా అధ్యక్షుడు పెంటపర్తి ఊశన్న, జిల్లా నాయకులు సోన్‌కాంబ్లే వికాష్‌, మండల అధ్యక్షుడు కోవా మనోజ్‌, అంబేద్కర్‌ సంఘం మండల అధ్యక్షుడు సర్కాలే శివాజీ, భీం ఆర్మీ అధ్యక్షుడు పరత్‌వాగ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-21T05:54:10+05:30 IST