సింఘు వెళ్తా.. రైతులకు అండగా నిలుస్తా: నొదీప్ కౌర్

ABN , First Publish Date - 2021-02-27T17:21:34+05:30 IST

సింఘూ సరిహద్దులకు వెళ్లి, హక్కుల కోసం రైతులు, కార్మికులు చేస్తున్న పోరాటానికి..

సింఘు వెళ్తా.. రైతులకు అండగా నిలుస్తా: నొదీప్ కౌర్

న్యూఢిల్లీ: సింఘూ సరిహద్దులకు వెళ్లి, హక్కుల కోసం రైతులు, కార్మికులు చేస్తున్న పోరాటానికి తిరిగి అండగా నిలుస్తానని కార్మిక హక్కుల పోరాట కార్యకర్త నొదీప్ కౌర్ తెలిపారు. గత 45 రోజులుగా జైలులో ఉన్న నొదీప్ కౌర్‌కు పంజాబ్, హర్యానా హైకోర్టు శుక్రవారంనాడు బెయిలు మంజూరు చేసింది. దీంతో కర్నాల్ జైలు నుంచి 22 ఏళ్ల కౌర్ విడుదలయ్యారు. హర్యానాలోని కుండిల్‌లో రైతు నిరసనల్లో పాల్గొన్న ఆమెను జనవరి 12న అరెస్టు చేశారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


హక్కుల పోరాటం కొనసాగుతుంది...

బెయిలుపై విడుదలైన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, తాను సింఘు సరిహద్దుకు వెళ్తానని, రైతులు, కార్మికుల హక్కుల కోసం జరుపుతున్న పోరాటానికి అండగా నిలుస్తానని చెప్పారు. తాము ఎలాంటి నిరసనలు తెలిపినా అవి పరిమితులకు లోబడే ఉంటాయన్నారు. హక్కుల కోసం రైతులు, కార్మికులు, మహిళలు జరుపుతున్న పోరాటాలకు తాను ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని చెప్పారు. పోలీసుపై కౌర్ దాడి జరుపుతున్న ఉన్న వీడియో గురించి ఆమెను అడిగినప్పుడు, అది ఎడిట్ చేసిన క్లిప్పింగ్ అని ఆమె సమాధానమిచ్చారు. తానొక సాధారణ అమ్మాయినని, తనలాగే రైతుల హక్కుల కోసం ప్రజలు కూడా బాసటగా నిలబడాలని కోరారు. తనతో పాటు తన సహ నిందుతుడు శివకుమార్‌ను సోనిపట్ పోలీసులు టార్చర్ చేశారని కూడా ఆమె ఆరోపించారు. తన విడుదల కోరుతూ అండగా నిలిచిన వారందిరికీ కౌర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నొదీప్ విడుదల గురించి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ ఇటీవల ఒక ట్వీట్ చేశారు. నెల రోజులకు పైగా జైలులో ఉన్న భారత కార్మిక హక్కుల కార్యకర్త నొదీప్ కౌర్‌ను విడుదల చేయాలని ఆ ట్వీట్‌లో కోరారు.

Updated Date - 2021-02-27T17:21:34+05:30 IST