కూల్చేస్తారా..? అవకాశమిస్తారా?

ABN , First Publish Date - 2021-01-17T05:23:36+05:30 IST

మున్సిపల్‌ కార్పొరేషన్లలో టౌనప్లాన అనుమతుల్లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తారా.. లేక ప్రభుత్వం క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తుందా అన్న చర్చ జిల్లాలో నడుస్తోంది.

కూల్చేస్తారా..? అవకాశమిస్తారా?

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు 3390 

అనుమతుల్లేని లేఅవుట్లు 368

వీటికి అనుమతులపై సందిగ్ధం

(కడప - ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ కార్పొరేషన్లలో టౌనప్లాన అనుమతుల్లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తారా.. లేక ప్రభుత్వం క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తుందా అన్న చర్చ జిల్లాలో నడుస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వస్తుండడంతో మున్సిపల్‌, కార్పొరేషన్లు విస్తరిస్తున్నాయి. దీంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ ఊపందుకుని నిర్మాణ రంగానికి అడుగులు పడుతున్నాయి. గృహ నిర్మాణాలకు కూడా బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేస్తుండడంతో చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. అర్బన ప్రాంతాల్లో టౌన ప్లానింగ్‌ మేరకే నిర్మాణాలు, లేఅవుట్లు వేయాల్సి ఉంది. అయితే కొందరు రియల్టర్లు నిబంధనలకు నీళ్లొదలగా, కొంతమంది అత్యాశపరులు ప్లాన ఓకే చేసుకుని నిర్మాణం మరొక విధంగా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో అక్రమ కట్టడాలపై దృష్టి సారించి వాటిని గుర్తించాలని ఆదేశించింది. జిల్లాలో 3390 భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరగ్గా అనుమతుల్లేకుండా 368 లేఅవుట్లు వెలిసినట్లు గుర్తించారు. వీటిని మున్సిపల్‌ శాఖ సూచించిన విధంగా యూసీఎంఎస్‌ యాప్‌లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ పూర్తయి మూడు మాసాలు కావస్తోంది. అయితే వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రావడంలేదు.


భవన నిర్మాణాల్లో నిబంధనలకు తూట్లు

భవన నిర్మాణంలో కొందరు నిబంధనలు గాలికొదిలేశారు. జీప్లస్‌ 1 అనుమతి తీసుకుని జీప్లస్‌ 2 నిర్మిస్తే మరికొందరు జీప్లస్‌ 3 నిర్మాణాలు చేపట్టారు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ఇంటి చుట్టూ ఫైరింజన తిరిగేలా సెట్‌బ్యాక్‌ వదలాల్సి ఉంది. అయితే చాలా చోట్ల నిబంధనలు గాలికొదిలేశారు. కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, ఎర్రగుంట్ల, మైదుకూరు, జమ్మలమడుగు, బ ద్వేలు, పులివెందులలో పెద్దఎత్తున ఉల్లంఘన జరిగినట్లు టౌన ప్లానింగ్‌ గుర్తించింది. ఇక అనుమతుల్లేని లేఅవుట్ల విషయంలో కడపలో అయితే కడప, ప్రొద్దుటూరులో పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇక్కడ నిబంధనలు పాటించకుండా అనుమతుల్లేకుండా లేఅవుట్లు వేశారు. ముఖ్యంగా కడప నగరంలో అయితే ఇర్కాన కూడలి, పాతకడప, సాయిపేట, రామరాజుపల్లె, పాలెంపల్లె, చిన్నమాచుపల్లె, మోడమీదపల్లె, దేవునికడప, రూకవారిపల్లె, బచ్చంపల్లె, నానాల్లె, ఉక్కాయపల్లె, రింగురోడ్డు, తాడిపత్రిరోడ్డు, తిరుపతిరోడ్డు, పుట్లంపల్లె, మామిళ్లపల్లె, రామాంజనేయపురం, సరోజనీనగర్‌, రామచంద్రయ్యకాలనీ, చౌటపల్లె, మామిళ్లపల్లె, క్రిష్ణాపురం సర్కిల్‌, వినాయక్‌నగర్‌, విజయదుర్గా టెంపుల్‌ ప్రాంతాల్లో లేఅవుట్లు వెలిశాయి. అయితే ఇక్కడ చాలామంది తెలియక ప్లాట్లను కొనుగోలు చేశారు.


రెగ్యులర్‌ చేస్తే రూ.400  కోట్లకుపైగా ఆదాయం

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు, అనుమతుల్లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశమిస్తే మున్సిపల్‌ కార్పొరేషన్లకు రూ.400 కోట్లకు పైగా ఖజానాకు జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు. కడప కార్పొరేషనలోనే సుమారు రూ.300 కోట్లు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరి వీటిని ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుందా, కూల్చేస్తుందా అనేది చర్చనీయాంశంగా ఉంది. చాలా మంది తెలియక కొనుగోలు చేశారు. వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది.


ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు

- క్రిష్ణసింగ్‌, సిటీ ప్లానింగ్‌ ఆఫీసర్‌, కడప కార్పొరేషన

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు, అనుమతుల్లేని లేఅవుట్లను యూసీఎంఎస్‌ యాప్‌లో నమోదు చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. 



అనుమతుల్లేని కట్టడాలు, అక్రమ కట్టడాల జాబితా ఇవే

--------------------------------------------------------

మున్సిపల్‌/ అక్రమ అనుమతుల్లేని 

కార్పొరేషన కట్టడాలు లేఅవుట్లు

--------------------------------------------------------

కడప కార్పోరేషన 1320 128

ప్రొద్దుటూరు 298 9

రాజంపేట 98 10

రాయచోటి 493 103

బద్వేలు 294 13

ఎర్రగుంట్ల 130 13

మైదుకూరు 271 24

జమ్మలమడుగు 291 53

పులివెందుల 190 13

కమలాపురం 5 2

-----------------------------------------------------------

Updated Date - 2021-01-17T05:23:36+05:30 IST