చాలు... ఆగిపోండి! ఎవరూ, ఎక్కడికీ వెళ్లొద్దు

ABN , First Publish Date - 2020-03-27T09:24:26+05:30 IST

తెలంగాణ నుంచి ఏపీలోని తమ స్వస్థలాలకు రావొద్దని, ఇప్పుడు ప్రయాణాలేవీ పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం గట్టి సూచనలు జారీ చేసింది. ఇప్పటికే ఏపీ సరిహద్దులకు చేరిన వారిని నేరుగా ఇళ్లకు పంపించకుండా...

చాలు... ఆగిపోండి! ఎవరూ, ఎక్కడికీ వెళ్లొద్దు

  • ‘లాక్‌డౌన్‌’ అంటే ప్రయాణాలు కాదు
  • ఇప్పటికే వచ్చిన వారు క్వారంటైన్‌కు
  • అర్థం చేసుకుని సహకరించాలి
  • మంత్రి గౌతం రెడ్డి, డీజీపీ సవాంగ్‌ పిలుపు

అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి ఏపీలోని తమ స్వస్థలాలకు రావొద్దని, ఇప్పుడు ప్రయాణాలేవీ పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం గట్టి సూచనలు జారీ చేసింది. ఇప్పటికే ఏపీ సరిహద్దులకు చేరిన వారిని నేరుగా ఇళ్లకు పంపించకుండా... క్వారంటైన్‌లో ఉంచుతామని స్పష్టం చేసింది. రాష్ట్ర మంత్రి, కరోనా టాస్క్‌పోర్స్‌ సభ్యుడు మేకపాటి గౌతమ్‌ రెడ్డి దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తూ దాచేపల్లి సమీపంలోని సరిహద్దులో ఆగిపోయిన వారితో ఆయన గురువారం మాట్లాడారు. అక్కడున్న పోలీసు అధికారులతోనూ చర్చించారు. సరిహద్దుల్లో ఆగిపోయిన వారికి మంచినీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. మాచర్లలో ఉన్న క్వారంటైన్‌కు వెళ్లేందుకు అంగీకరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలని స్పష్టంచేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.  అలాగే పొందుగుల చెక్‌పోస్టు వద్ద నిలిచిపోయిన విద్యార్థులు, ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించి ఏపీలోకి అనుమతించాలని కోరారు. గురువారం హైదరాబాద్‌ నుంచి వస్తున్న మంత్రి చెక్‌పోస్టు వద్ద ప్రయాణికుల అవస్థను గమనించారు. కారుదిగి తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఫోన్‌లోను, అనంతరం ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, గుంటూరు రూరల్‌ ఎస్పీతో కూడా మాట్లాడారు. 


అనుమతించే ప్రసక్తే లేదు: డీజీపీ

‘ప్రజల ప్రాణాల కన్నా ఏదీ ముఖ్యం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. కాదని ఎవ్వరొచ్చినా ఏపీలోకి అనుమతించే ప్రసక్తేలేదు’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్‌ చేతులు జోడించి చేస్తున్న అభ్యర్థనను అందరూ అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. హైదరాబాద్‌ నుంచి  బుధవారం రాష్ట్రంలోకి వచ్చిన వారిని కూడా క్వారంటైన్‌లో ఉంచిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌పై గురువారం జిల్లాల ఎస్పీలతో డీజీపీ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సరిహద్దు జిల్లాల పోలీసులకు ప్రత్యేక సూచనలు చేశారు.


తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా ఎటు నుంచి వచ్చిన వారినైనా అడ్డుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా సరిహద్దుల్లో బుధవారం సాయంత్రం ఎదురైన సమస్యను వివరిస్తూ...  పద్నాలుగు రోజులు క్వారంటైన్‌లో ఉండేందుకు అంగీకరిస్తే పూర్తి వివరాలు తీసుకుని వైద్య సిబ్బందితో పంపాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌ అంటే ఇంటి నుంచే బయటికి  రాకూడదని... అలాంటిది ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి ప్రయాణించడం ఎంతవరకు సబబు అని డీజీపీ ప్రశ్నించారు. రోడ్లెక్కడం, పోలీసులతో వాదనకు దిగడం సరికాదని హితవు పలికారు. ‘దయచేసి అర్థం చేసుకోవాలని ప్రజలను కోరుతున్నాం. కాదని రోడ్డెక్కితే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనుకాడం’’ అని డీజీపీ హెచ్చరించారు. 


Updated Date - 2020-03-27T09:24:26+05:30 IST