మనోధైర్యమే! కొవిడ్‌కు మందు

ABN , First Publish Date - 2021-05-24T05:30:00+05:30 IST

ఏడాదికి పైగా కొవిడ్‌ మీద అవిశ్రాంతంగా సమరం సాగిస్తూ, నిరాఘాటంగా సేవలందిస్తున్నారు ప్రభుత్వ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌, నేచర్‌ క్యూర్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నిర్మల ప్రభావతి మొయిళ్లకాల్వ...

మనోధైర్యమే! కొవిడ్‌కు మందు

ఏడాదికి పైగా కొవిడ్‌ మీద అవిశ్రాంతంగా సమరం సాగిస్తూ, నిరాఘాటంగా సేవలందిస్తున్నారు ప్రభుత్వ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌, నేచర్‌ క్యూర్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నిర్మల ప్రభావతి మొయిళ్లకాల్వ. ఆ సుదీర్ఘ ప్రయాణంలో కొవిడ్‌ బారిన పడినా,  త్వరగా కొలుకుని విధులను నిర్వర్తించారామె! కొవిడ్‌ మీద విజయానికి మనోధైర్యమే ఆయుధం అంటున్న ఆవిడ నవ్యతో పంచుకున్న అనుభవాలు, అభిప్రాయాలు....


‘‘కొవిడ్‌ మహమ్మారిలా ప్రబలడం ఊహించని పరిణామం! దాంతో.... మొదట్లో తొట్రుపడ్డాం, తర్వాత నిలదొక్కుకున్నాం, ఎదురుదాడితో కొవిడ్‌ కొమ్ములు విరచగలిగాం! ఇప్పటికీ కొవిడ్‌కు కచ్చితమైన మందు లేదు. అయితేనేం... అందుబాటులో ఉన్న డ్రగ్స్‌తో దాని మెడలు వంచగలుగుతున్నాం. ఈ వైరస్‌ లక్షణం రూపం మార్చుకోవడం. దాంతో గత ఏడాది మొదటి వేవ్‌లో పరిస్థితికీ, ఇప్పటి సెకండ్‌ వేవ్‌లో పరిస్థితికీ తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైర్‌సలోనే కాదు, ప్రజల్లోనూ అప్పటికీ, ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది. ప్రారంభంలో విపరీతమైన భయం ఉండేది. పిపిఇ కిట్లు ధరించకుండా బాధితులను పరీక్షించే పరిస్థితి ఉండేది కాదు. సఫాయి కర్మచారులు, జిహెచ్‌ఎమ్‌సి వర్కర్లు సైతం ఇన్‌ఫ్రారెడ్‌తో బాధితుల శరీర ఉష్ణోగ్రతలను దూరం నుంచి పరీక్షించడానికి సైతం భయపడేవారు. అలా అప్పట్లో భయం ఎక్కువ, వ్యాప్తి తక్కువ ఉండేది. ఇందుకు లాక్‌డౌన్‌తో పాటు ప్రజలు భయంతో పాటించిన నిబంధనలే కారణం కావచ్చు. కానీ ఇప్పటి పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. భయం ఉందని అంటూనే, నిబంధనలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇందుకు అలసత్వం కారణం కావచ్చు. నిబంధనలు అన్నింటినీ కచ్చితంగా పాటించడంలో కొంత అలక్ష్యం వహిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇంత కాలం గడిచినా, కొవిడ్‌తో కలిసి సాగించవలసిన జీవన విధానాన్ని అడాప్ట్‌ చేసుకోలేకపోతున్నామేమో అనిపిస్తోంది. కాబట్టే సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఇంతలా పెరిగింది.’’


భారీ బిల్లులు ఇందుకే!

తీవ్రమైన కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో ప్రైవైట్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్న కొందరు బాధితులకు, ఆస్పత్రి బిల్లులు మోయలేనంత భారంగా మారుతున్నాయి. ఈ అంశం గురించి ఏర్పాటైన ప్రభుత్వ సమీక్షా సమావేశానికి ప్రైవేట్‌ వైద్యాధికారులు కూడా హాజరైనప్పుడు వాళ్లు కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఆక్సిజన్‌ సిలిండర్ల ధర పూర్వం సుమారు 250 రూపాయలు ఉంటే, అదే సిలిండర్‌ ధర ఇప్పుడు 1200 రూపాయల ధర పలుకుతోంది. సిలిండర్‌ కోసం కంపెనీలకు కట్టే డిపాజిట్లు కూడా పెరిగాయి. అలాగే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కన్సల్టెంట్ల పీజులు కూడా విపరీతంగా పెరిగాయి. కొవిడ్‌  విధి నిర్వహణ రిస్క్‌లతో కూడుకున్నది. కాబట్టి వైద్యుల డిమాండ్లనూ అంగీకరించక తప్పడం లేదని ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యాధికారులు వివరణ ఇచ్చారు. అలాగే ఉద్యోగం మానేసి వెళ్లిపోతాం అన్న వైద్యుల వైద్యుల వేతనాలు పెంచి ఆస్పత్రుల్లో కొనసాగించడం వల్ల కూడా ప్రైవేట్‌ ఆస్పత్రుల మీద రెట్టింపు భారం పడుతున్నట్టు వాళ్లు చెప్పడం జరిగింది. 


అవసరం లేకపోయినా ఆస్పత్రికి పరుగులు

సెకండ్‌ వేవ్‌లో అలసత్వం ప్రదర్శించే వారితో పాటు అనవసరపు భయంతో ఆస్పత్రులకు పరుగులు పెట్టే వారి సంఖ్య పెరిగింది. ఇలా అవసరం లేకపోయినా ఆస్పత్రిలో చేరే వారి వల్ల అవసరం అయిన వారికి బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. నిజానికి ప్రారంభంలోనే అప్రమత్తమై చికిత్స మొదలుపెడితే, ఇన్‌ఫెక్షన్‌ ఆస్పత్రిలో చేరేటంత తీవ్రతరం కాదు. ఇప్పుడు కొవిడ్‌ కోసం వాడుతున్న మందులేవీ కచ్చితంగా ఆ ఇన్‌ఫెక్షన్‌ నివారణ కోసం ఉద్దేశించినవి కావు అనే విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ మందుల కోసం వెంపర్లాడుతున్నారు. జ్వరం లక్షణం కనిపించగానే, ఆస్పత్రుల్లో చేరిపోతున్నారు. అవసరం లేకపోయినా ఆక్సిజన్‌ కొరతకు కారణమవుతున్నారు. ఇలా బాధితుల్లో నెలకొన్న ప్యానిక్‌ ప్రవర్తన అత్యవసర చికిత్స అవసరమైన కొవిడ్‌ బాధితులకు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. గత ఏడాది ప్రభుత్వ ఆయుర్వేద కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు నోడల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో, ఇప్పుడు నేచర్‌ క్యూర్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఐసొలేషన్‌ కోసం ఎంతోమంది బాధితులు మా దగ్గరకు వచ్చారు. ఇంట్లో ప్రత్యేక వసతి ఏర్పాట్లు లేని కొవిడ్‌ బాధితులకు మేం ఐసొలేషన్‌ వసతి కల్పిస్తున్నాం. మా దగ్గర అత్యవసర పరిస్థితి కోసం రెండు, మూడు ఆక్సిజన్‌ సిలిండర్లకు మించి నిల్వలు ఉండవు. అయినప్పటికీ వాటి అవసరం ఇంతవరకూ రాలేదు. బలవర్ధకమైన ఆహారం, ఇమ్యూనిటీని పెంచే మందులన్నీ ఉచితమే! ఆక్సిజన్‌ శాచురేషన్‌ 90ుకి దిగజారిన వాళ్లు కూడా ఆక్సిజన్‌ సిలిండర్లతో పని లేకుండా పూర్తి ఆరోగ్యాన్ని పుంజుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. వీళ్లలో 90 ఏళ్లు పైబడిన వాళ్లు, గర్భిణులూ ఉన్నారు. ఇలా గత ఏడాది ఆయుర్వేద కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో సుమారు 6 వేల మంది చికిత్స పొంది క్షేమంగా ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం నేచర్‌ క్యూర్‌లో సైతం ప్రతి రోజూ 150 బెడ్ల ఆక్యుపెన్సీ ఉంటోంది. ఇలా మేం ప్రత్యక్షంగా చికిత్స అందించడంతో పాటు వందల వేల మందికి ఫోన్‌ ద్వారా కూడా కొవిడ్‌ చికిత్సను సూచించాం!


మానసిక ధైర్యమే కీలకం!

కొవిడ్‌ మీద విజయానికి మందులు, ఆహారం ఎంత ముఖ్యమో మానసిక ధైర్యం అంతే కీలకం. నేచర్‌ క్యూర్‌లో ఇమ్యూనిటీని పెంచే మందులు, ఆహారంతో పాటు, మానసికోల్లాసం, స్వాంతన కోసం యోగా, బ్రీతింగ్‌ వ్యాయామాలు చేయిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా కొవిడ్‌ బాధితులకు మానసిక స్థైర్యం కల్పిస్తాం. కొవిడ్‌... భయాందోళనలకు గురి కావలసిన ఇన్‌ఫెక్షన్‌ కాదనీ, మనోధైర్యంతో దాని మీద విజయం సాధించవచ్చనీ బాధితులకు భరోసా ఇస్తాం. మనోధైర్యం పెంచడం కోసం, కొవిడ్‌ బారిన పడిన నా ఉదంతాన్నే ఉదాహరణగా చెబుతూ ఉంటాను. ఆక్సిజన్‌ సిలిండర్‌ అవసరమయ్యే స్థాయికి వారి ఆరోగ్యం దిగజారకుండా, ఐసొలేషన్‌ ముగిసేలోపు బాధితులు పూర్తి ఆరోగ్యం పుంజుకోవడానికి అదే కారణం. చికిత్స, ఆహారం ఎవరైనా అందించగలరు. కానీ అత్యవసరమైన మానసిక ధైర్యం కూడదీసుకునేలా బాధితులను ప్రోత్సహించడమే ముఖ్యం. కొవిడ్‌ మీద విజయం సాధించిపెట్టే రహస్య ఆయుధం అదే! కాబట్టే ఆయుర్వేద ఆస్పత్రిలో, నేచర్‌ క్యూర్‌లో ఇప్పటి వరకూ ఒక్క కొవిడ్‌ మరణం కూడా లేదు! 





థర్డ్‌ వేవ్‌కు కూడా మన వ్యవహారశైలే కారణం

మొదటి వేవ్‌తో పోల్చుకుంటే... సెకండ్‌ వేవ్‌లో లక్షణాలు కనిపించడానికి, ఆస్పత్రిలో చేరే పరిస్థితి తలెత్తడానికి మధ్య వ్యవధి బాగా తగ్గింది. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుంటున్నారు. సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఎక్కువగా ఉంది, అంటున్నవారే బయట తిరిగేటప్పుడు ముక్కు, నోటికి కాకుండా గడ్డాలకు మాస్క్‌లు ధరించి కనిపిస్తూ ఉంటారు. ఇంట్లో వార్తల ద్వారా వాస్తవాలు తెలుసుకుంటున్నంతసేపూ ఇంత భయానక వాతావరణం నెలకొని ఉందా? అనిపిస్తుంది. కానీ బయటకొచ్చి చూస్తే, అసలు కొవిడ్‌ ఉందా... లేదా? అనే అనుమానం కలిగేలా జనసంచారం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితే కొనసాగితే ఇప్పటి సెకండ్‌ వేవ్‌ మాదిరిగానే భవిష్యత్తులో థర్డ్‌ వేవ్‌ కూడా రావచ్చు. దాన్ని నిలువరించడం మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా కొవిడ్‌ నిబంధనలు పాటించగలిగితే, మున్ముందు మరొక వేవ్‌ వచ్చే వీలే ఉండదు. 


నా ఇమ్యూనిటీని పరీక్షించుకున్నా!   

ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు మందులు వాడితే మన వ్యాధినిరోధక వ్యవస్థ సామర్ధ్యం తెలిసేదెలా? అందుకే గత ఏడాది జూన్‌లో నాకు కొవిడ్‌ సోకినప్పుడు ఆ అవకాశాన్ని ఇమ్యూనిటీని పరీక్షించుకోవడానికి ఉపయోగించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పుడు 14 రోజుల పాటు ఇంటికే పరిమితమై బలవర్ధకమైన ఆహారం తీసుకున్నాను. మొదటి రోజు జ్వరం తగ్గడం కోసం ఒకే ఒక డోలో మాత్ర వేసుకున్నాను. అంతే తప్ప ఎటువంటి యాంటీవైరల్‌ మందులూ వాడలేదు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఎంతటి ఇన్‌ఫెక్షన్‌తోనైనా పోరాడగలదు. కాబట్టి నా ఇమ్యూనిటీ ఏ మేరకు పని చేస్తుందో తెలుసుకోవడం కోసం అలా చేశాను. వారం రోజుల్లో పూర్తిగా కోలుకున్నా, ఐసొలేషన్‌ ముగిసిన తర్వాతే విధులకు హాజరయ్యాను. 




గోప్యత  ఎందుకు? 

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్లు విస్తృతంగా విజృంభించడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. మొదటి వేవ్‌లో ప్రభుత్వమే కొవిడ్‌ పరీక్షలను నిర్వహించేది. పాజిటివ్‌ వచ్చిన వాళ్లను, కుటుంబంతో సహా తీసుకువెళ్లి ఐసొలేట్‌ చేసేది. దాంతో ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. కానీ ఇప్పుడు ఎవరికి వారు నచ్చిన చోట పరీక్ష చేయించుకుంటున్నారు. వాళ్లకు తోచిన చికిత్సను ఎంచుకుంటున్నారు. తమకు కొవిడ్‌ సోకిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారు. పూర్తి కాలం పాటు ఐసొలేషన్‌లో ఉంటున్నారా? అనేదీ అనుమానమే! ఈ ధోరణి కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తికి ఎక్కువగా దోహదపడి ఉండవచ్చు. 


సామాజిక మాధ్యమాలపై కట్టడి అవసరం

భయాందోళనలు, అపోహలు పెంచడానికి సామాజిక మాధ్యమాలు తోడ్పడుతున్నాయి. అవాస్తవిక కొవిడ్‌ సమాచారం ప్రమాదకరమైనది. సంక్షిప్త సందేశాలు, యూట్యూబ్‌ వీడియోలు తయారుచేయడం, ఫార్వర్డ్‌ చేయడం మామూలైపోయింది. నిరాధారమైన అలాంటి వార్తలను నమ్మి, గుడ్డిగా వాటిని అనుసరించడం సరి కాదు. అశ్లీలతకు అడ్డుకట్ట వేసిన విధంగానే ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేసే సామాజిక మాధ్యమాల మీద కూడా ప్రభుత్వ కట్టడి పెరగడం ఎంతో అవసరం. 

- గోగుమళ్ల కవిత


Updated Date - 2021-05-24T05:30:00+05:30 IST