Congress : ప్రశాంత్ కిశోర్ ‘పాత్ర’ పై సందిగ్ధంలో కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-07-29T22:10:59+05:30 IST

వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరిపోతున్నారని తీవ్రంగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నేతలు కూడా అప్పట్లో వచ్చేస్తున్నారు

Congress : ప్రశాంత్ కిశోర్ ‘పాత్ర’ పై సందిగ్ధంలో కాంగ్రెస్

న్యూఢిల్లీ : వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరిపోతున్నారని తీవ్రంగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నేతలు కూడా అప్పట్లో వచ్చేస్తున్నారు... వచ్చేస్తున్నారు.. అని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ కొందరు నేతలు పీకే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ పీకే కాంగ్రెస్‌లో చేరుతారా? మిన్నకుండిపోతారా? అన్నది తేలాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం పీకే వ్యవహారంలో కాస్త డోలాయమాన స్థితిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఈ మధ్య ఓ సమావేశం నిర్వహించారు. సీనియర్లందరూ హాజరయ్యారు. కమల్‌నాథ్, ఖర్గే, ఆంటోనీ, అజయ్ మాకెన్, ఆనంద్ శర్మ, హరీశ్ రావత్, అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్ లాంటి వారు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీకేతో జరిగిన సమావేశాన్ని రాహుల్ సీనియర్లందరకీ కూలంకషంగా వివరించినట్లు తెలుస్తోంది. పార్టీ ఎదుగుదల కోసం, రాహుల్ ఎదుగుదల కోసం పీకే విషదీకరించిన వ్యూహాన్ని కూడా రాహుల్ సీనియర్ల ముందుంచారు. వీటన్నింటి తర్వాత పీకే కాంగ్రెస్‌లో చేరడంపై సీనియర్ల అభిప్రాయాన్ని కూడా రాహుల్ కోరారు. పార్టీ కండువా కప్పుకోకుండా, కేవలం పార్టీ సలహాదారు మాత్రమే ఉంటే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చ జరిగిందని ఆ భేటీలో పాల్గొన్న నేత ఒకరు తెలిపారు. అలా కాకుండా పీకేను కాంగ్రెస్‌లోకి తీసుకుంటే వచ్చే లాభంపై కూడా రాహుల్ చర్చించినట్లు సమాచారం. అయితే చాలా మంది సీనియర్లు మాత్రం పీకే కాంగ్రెస్‌లో చేరితే లాభమే ఎక్కువ అన్న కృత నిశ్చయంతో ఉన్నారు. వారందరు కూడా పీకే విషయంలో సుముఖంగానే ఉన్నారు. అయితే.. పీకే నిర్వహించాల్సిన ‘పాత్ర’ విషయంలోనే అధిష్ఠానం డోలాయమానంలో పడిపోయినట్లు తెలుస్తోంది. పీకేను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన తర్వాత ఆయనకు ఎలాంటి బాధ్యతలు కేటాయించాలన్న విషయంలోనే రాహుల్ ఓ కృత నిశ్చయానికి రాలేకపోతున్నారని సమాచారం. 

Updated Date - 2021-07-29T22:10:59+05:30 IST