ప్యాకేజీ ప్రకటిస్తే రాజీనామా చేస్తా: రాజాసింగ్‌

ABN , First Publish Date - 2021-08-03T08:22:47+05:30 IST

హుజూరాబాద్‌లో మాదిరిగా గోషామహల్‌ నియోజక వర్గంలోనూ కేసీఆర్‌ సర్కారు ప్యాకేజీ ప్రకటిస్తే, ఇంటికో రూ.10 లక్షలు ఇస్తామంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజాసింగ్‌ అన్నారు

ప్యాకేజీ ప్రకటిస్తే   రాజీనామా చేస్తా: రాజాసింగ్‌

మంగళ్‌హాట్‌/హైదరాబాద్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌లో మాదిరిగా గోషామహల్‌ నియోజక వర్గంలోనూ కేసీఆర్‌ సర్కారు ప్యాకేజీ ప్రకటిస్తే, ఇంటికో రూ.10 లక్షలు ఇస్తామంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజాసింగ్‌ అన్నారు. ప్యాకేజీ కోసం తాను రాజీనామా చేయాలని ప్రజలు ఒత్తిడి చేస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే సోమవారం ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ కోట్ల రూపాయలు పంచి పెట్టి గెలిచేందుకు పథకాలు రచిస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బహుమతులు ఇస్తున్నారని, ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ.10 లక్షల చొప్పున పంచుతున్నారని అన్నారు. మునిసిపల్‌, వాటర్‌ వర్క్స్‌ నిధులు మజ్లిస్‌ పార్టీ నాయకులు ఉన్న ప్రాంతాలకే వెళ్తున్నాయని, తన నియోజకవర్గానికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో విభేదాలు అన్నదమ్ముల మధ్య ఉండే బేధాభిప్రాయాలని రాజాసింగ్‌ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన సాయం తీసుకుంటానన్నారు.


రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్‌

గోషామహల్‌ ఎమ్మెల్యేగా రెండోసారి 15 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై గెలిచిన రాజాసింగ్‌ రాజీనామా చేయాలని స్థానిక ప్రజలు ఒత్తిడి చేయడం చర్చనీయాంశమైంది. గతంలో కాంగ్రెస్‌ నుంచి రెండు సార్లు గెలిచిన ముఖే్‌షగౌడ్‌ మంత్రిగా ఉన్నప్పుడు అల్లాబండా రిజర్వాయర్‌ ఏర్పాటుతో పాటు అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి ప్రజల ఆదరణ పొందారు. తర్వాత రెండుసార్లు గెలిచిన రాజాసింగ్‌ నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి పనులు చేయలేదనే విమర్శలున్నాయి. ప్రజల కనీస సమస్యలూ పట్టించుకోరని, మజ్లిస్‌ పార్టీ నేతలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన మీడియా ముందుకు రాలేదు. సెల్ఫీ వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టేందుకే పరిమితమయ్యారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్యాకేజీతో రాజాసింగ్‌ రాజీనామాకు ప్రజల నుంచి డిమాండ్‌ పెరిగింది. దీంతో ఆత్మరక్షణలో పడిన రాజాసింగ్‌ ప్రతి ఇంటికి రూ.10 లక్షలు, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే రాజీనామా చేస్తానంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Updated Date - 2021-08-03T08:22:47+05:30 IST