పల్లె ప్రగతి ముందుకు సాగేనా?

ABN , First Publish Date - 2021-06-20T06:27:55+05:30 IST

పల్లె ప్రగతి ని మరింత పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభు త్వం చర్యలు చేపట్టింది. ఇటీవల జిల్లా అదనపు కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఉ న్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్షించాలని ఆదేశించారు.

పల్లె ప్రగతి ముందుకు సాగేనా?
ఆదిలాబాద్‌ మండలంలోని లాండసాంగి పల్లె ప్రకృతి వనం

- రేపటి నుంచి పల్లె నిద్ర కార్యక్రమం

- పల్లె ప్రగతి పనులపై ప్రత్యేక దృష్టి 

- అధికారుల బృందాలతో తనిఖీలు

- అభివృద్ధి పనులపై నివేదికలు కోరిన రాష్ట్ర ప్రభుత్వం 

- ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ఉరుకులు పరుగులు

ఆదిలాబాద్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): పల్లె ప్రగతి ని మరింత పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభు త్వం చర్యలు చేపట్టింది. ఇటీవల జిల్లా అదనపు కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఉ న్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్షించాలని ఆదేశించారు. అలాగే గ్రా మాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతామని స్వయాన ముఖ్యమంత్రే చెప్పడంతో జిల్లా అధికారులు అప్రమత్తమవుతున్నారు. ముఖ్యమంత్రి హెచ్చరికలతో కదిలిన జిల్లా అధికార యంత్రాంగం, ఎంపీడీవో, డీఎల్‌పీవో, ఎంపీవో, గ్రామ కార్యదర్శులతో సమావేశమైన కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ పల్లె ప్రగతి పనులపై దిశా నిర్దేశం చేశారు. దానికనుగుణంగానే అసంపూర్తిగా ఉన్న పల్లె ప్రగతి పనులను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డు, నర్సరీలు, సెగ్రిగేషన్‌ షెడ్స్‌, వైకుంఠధామాల పనులపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా వానాకాల సీజన్‌ ప్రారంభం కావడంతో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామ పంచాయతీలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నాయి. దాదాపు తుదిదశలో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే రాష్ట్రస్థాయి అధికారులు జిల్లాలో పర్యటించే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లా అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.

క్రమంతప్పకుండా నిధులు

పల్లె ప్రగతి పనులకు ప్రభుత్వం క్రమంతప్పకుండా నిధులు మంజూరు చేస్తోంది. దీనిలో భాగంగా స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులను పంచాయతీలకు కేటాయిస్తున్నారు. జిల్లాకు ప్రతీనెల రూ.6కోట్లకు పైగానే నిధులు మంజూరవుతున్నాయి. ఇందులో ఒక్కో గ్రామ పంచాయతీకి జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపులు చేస్తున్నారు. అయితే సరిపడా నిధులు ఉన్నా.. కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా పల్లె ప్రగతి పనులు ముందుకు సాగడం లేదని భావించిన ప్రభుత్వం పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి జిల్లాలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జిల్లాస్థాయి అధికారుల నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకు గ్రామాల్లో పర్యటించి, ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నారు. అందరి భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. 

ప్రగతి పనులు ముందుకు సాగేనా?!

ఇప్పటికే పల్లె ప్రగతి కింద పంచాయతీల్లో చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల పనులు కొనసాగుతున్నాయి. ఇంకా కొన్ని గ్రామాలలో వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డు పనులు అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. అప్పట్లో హడావిడిగా పనులను ప్రారంభించిన సర్పంచ్‌లు, సకాలంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయక పోవడంతో పనుల జోలికి వెళ్లడం లేదని తెలుస్తుంది. ఉన్నతాధికారులు గ్రామాల్లో పర్యటిస్తే కొంత మేరకైనా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందంటున్నారు. జిల్లాలో 101 రైతు వేదికల నిర్మాణ పనులను పూర్తి చేసినా.. అవి అందుబాటులోకి రాక పోవడంతో వృథాగానే కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినా.. స్థల ఇబ్బందులతో ఊరికి చివరన కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడంతో రక్షణ లేకుండా  పోతోంది. అసలే వర్షాకాలం కావడంతో ప్రకృతి వనాలు, పిచ్చిమొక్కలతో నిండిపోయి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. 

అభివృద్ధిపై నివేదికలు

ప్రభుత్వం నెలనెలా మంజూరు చేస్తున్న నిధులతో గ్రామాల్లో ఏ మేరకు అభివృద్ధి జరుగుతుందనే విషయంపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది.  గ్రామాల వారీగా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను, వాటి పురోగతిని నివేదికల రూపంలో ఇవ్వాలని జిల్లా అధికారులను కోరింది. కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో కలిసి గ్రామాలలో జరుగుతున్న ప్రగతి పనులను తనిఖీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మంజూరైన నిధుల ఆధారంగా జరిగిన అభివృద్ధిపై నివేదికలను రూపొందించి ప్రభుత్వానికి అందించనున్నారు. ముఖ్యంగా డీపీవో, డీఆర్డీవో, జడ్పీ సీఈవో, ఎంపీడీవో, డీఎల్‌పీవో, ఎంపీవోలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. మండలాల వారీగా ఇన్‌చార్జి అధికారులను నియమించి ప్రగతి పనులపై ప్రత్యేక నిఘా సారించనున్నారు. ఎలాంటి పనులు చేయకుండానే కొందరు సర్పంచ్‌లు, అధికారులు కలిసి నిధులను దుర్వినియోగం చేశారన్న ఫిర్యాదులు రావడంపై కూడా ప్రత్యేక దృష్టిని సారించనున్నారు.

పల్లెనిద్ర కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం

: శ్రీనివాస్‌, డీపీవో, ఆదిలాబాద్‌

త్వరలోనే జిల్లాలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పల్లె ప్రగతి పనులపై దృష్టి సారించాలని సంబంధిత మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై దృష్టి సారిస్తునే.. పంచాయతీ పరిధిలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను పరిశీలిస్తాం. గ్రామాల వారీగా పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొనే అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నాం. అలాగుచ కలెక్టర్‌ ఆదేశాలతో పల్లె నిద్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. 

Updated Date - 2021-06-20T06:27:55+05:30 IST