అఫ్ఘాన్‌లో తాలిబన్ రాజ్యం.. మళ్లీ ఆ చట్టాలు తెస్తారా?

ABN , First Publish Date - 2021-08-16T14:42:34+05:30 IST

అమెరికా సైన్యం వీడిన నెల రోజులు కూడా కాకముందే అఫ్ఘానిస్తాన్ దేశం.. తాలిబన్ వశమైంది. ఆ దేశాధ్యక్షుడు దేశాన్ని తాలిబన్లకు అప్పగించి, తను మాత్రం కుటుంబంతో సహా పారిపోయారు!

అఫ్ఘాన్‌లో తాలిబన్ రాజ్యం.. మళ్లీ ఆ చట్టాలు తెస్తారా?

కాబూల్: అమెరికా సైన్యం తిరిగెళ్లి 15 రోజులు కూడా కాకముందే అఫ్ఘానిస్తాన్ దేశం.. తాలిబన్ వశమైంది. ఆ దేశాధ్యక్షుడు దేశాన్ని తాలిబన్లకు అప్పగించి, తను మాత్రం కుటుంబంతో సహా పారిపోయారు! ఈ క్రమంలో చాలా మంది ప్రజలు అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీని ‘పిరికివాడు’ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరికొన్ని రోజుల్లో తాలిబన్లకు అధికారాన్ని బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. తమ కార్యాలయాన్ని ఎయిర్‌పోర్టులోకి తరలించింది. ముఖ్యమైన అధికారులను హెలికాప్టర్లలో ఎయిర్‌పోర్టుకు తరలించారు. వారి భవితవ్యంపై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు.


మళ్లీ ఆ చట్టాలు తెస్తారా?

సాయుధ పోరాటం చేసి, రక్త పాతాలు సృష్టించి మరీ అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో చాలా మంది ప్రజలు అఫ్ఘాన్ సరిహద్దులు దాటి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ వంటి దేశాలు.. అఫ్ఘాన్ సరిహద్దుల్లో కొన్ని శిబిరాలు ఏర్పాటు చేసి, అఫ్ఘాన్ నుంచి పారిపోయి వస్తున్న వారికి షెల్టర్ కల్పిస్తున్నాయి. ప్రస్తుతం అఫ్ఘానిస్తాన్‌లో చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్లు ఏం చేస్తారు? గతంలో అంటే 1996-2001 మధ్య కాలంలో కూడా అఫ్ఘాన్ గడ్డపై తాలిబన్లు రాజ్యమేలారు. ఆ సమయంలో షరియా అంటే ఇస్లామిక్ చట్టం అమలు చేశారు. తప్పు చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపడం, కొరడాలతో అందరి కళ్లముందూ హింసించండం వంటి దారుణాలు ఆ సమయంలో వెలుగు చూశాయి. ఈ క్రమంలో మరోసారి తాలిబన్లు అధికారంలోకి రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.


ఈ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తాలిబన్లు అంటున్నారు. ‘‘ప్రజలు.. ముఖ్యంగా కాబూల్ వాసులు భయపడాల్సిన పనిలేదు. వారి ఆస్తులు, ప్రాణాలు భద్రంగా ఉంటాయని హామీ ఇస్తున్నాం’’ అని ఈ ఉగ్రవాదులు చెప్పారు. మహిళల హక్కులను గౌరవిస్తామని, అఫ్ఘానీయులతోపాటు విదేశీయులకు కూడా రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. కానీ, వీళ్లు ఎంతవరకూ తమ మాట నిలబెట్టుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ తాలిబన్లు మళ్లీ పాత పద్ధతుల్లోకి వెళ్లిపోతే నెక్స్ట్ ఏం చేయాలి? అలా కాకుండా మాట నిలబెట్టుకొని మారితే ఏం చేయాలి? అనే ప్రశ్నలు అందరి మనసుల్లోనూ మెదులుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మాత్రం మరికొంతకాలం ఆగక తప్పదు.

Updated Date - 2021-08-16T14:42:34+05:30 IST