ఫీజుల భారం తగ్గేనా?

ABN , First Publish Date - 2021-08-28T04:56:02+05:30 IST

ఫీజుల భారం తగ్గేనా?

ఫీజుల భారం తగ్గేనా?

- ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి కళ్లెం

- పాఠశాలలు, కళాశాలల ఫీజులు ఖరారు చేసిన ప్రభుత్వం

- జీవో అమలుపై సందేహాలు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇష్టారాజ్యంగా సాగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గరిష్ఠంగా వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేసింది. పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్‌లకు కూడా నిర్ణీత మొత్తంలోనే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులతో ఫీజుల భారం తగ్గుతుందా? ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సక్రమంగా అమలవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో పూర్తయ్యాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో లక్షలాది రూపాయల ఫీజుల ఒప్పందంతో అడ్మిషన్లు జరిగాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో కూడా విద్యార్థులు చేరిపోయి.. తొలిటెర్మ్‌ ఫీజులు కట్టేశారు. ఈ తరుణంలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు ఎంతవరకూ కట్టుబడి ఉంటాయనే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


‘ప్రైవేటు’ బాదుడు..

జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో రూ.వేలు, రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. తరగతులతో పాటు ఏపీఈఏపీ సెట్‌, నీట్‌, జేఈఈ తదితర పోటీ పరీక్షల కోచింగ్‌కు అదనంగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లోని ప్రైవేటు విద్యాసంస్థల్లో 1 నుంచి 5వ తరగతి వరకు రూ.10వేల నుంచి రూ.20 వేలు తీసుకుంటున్నారు. 5 నుంచి పదో తరగతి వరకు రూ.15వేల నుంచి రూ.45 వేల వరకు వసూలు చేస్తున్నారు. పట్టణాల్లో ఐదో తరగతి లోపు రూ.15వేల నుంచి రూ.25వేలు, ఆరు నుంచి పదోతరగతి లోపు విద్యార్థులకు రూ.25వేల నుంచి రూ.70వేల వరకు వసూలు చేస్తున్నారు. నగరాల్లో కూడా పట్టణాల కన్నా.. అదనంగా మరో రూ.5వేల నుంచి రూ.10వేలు చొప్పున గుంజుతున్నారు. 

జూనియర్‌ కళాశాలల్లో సంవత్సరానికి ఏపీఈఏపీ సెట్‌, నీట్‌, జేఈఈ శిక్షణకు రూ. 75 వేల నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్నారు. హాస్టల్‌ ఫీజుగా రూ.40 వేల నుంచి లక్ష వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ఫీజుల భారంతో విద్యార్థుల తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. పోటీ ప్రపంచంలో తమ పిల్లలు వెనుకబడిపోతారేమోనన్న ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు విద్యాసంస్థలకు అధిక ఫీజులు చెల్లిస్తూ.. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.  


ఖరారు చేసిన ఫీజులిలా..

 - పాఠశాలలకు సంబంధించి.. గ్రామ పంచాయతీల్లో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు రూ.10వేలు, పట్టణాల్లో 11వేలు, నగరాల్లో రూ.12వేలు ఫీజు వసూలు చేయాలి.  

- ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు గ్రామాల్లో రూ.12వేలు, పట్టణాల్లో రూ.15వేలు, నగరాల్లో రూ.18వేలు మాత్రమే వసూలు చేయాలి. 

 విద్యార్థి హాస్టల్‌లో ఉంటే... గ్రామ పంచాయతీల్లో రూ.18 వేలు, పట్టణాల్లో రూ.20వేలు, నగరాల్లో రూ.24వేలు చొప్పున ఫీజు వసూలు చేయాలి. 

 ఇంటర్‌ విద్యార్థులకు మ్యాథ్స్‌, సైన్స్‌ గ్రూపులకు గ్రామ పంచాయతీల్లో రూ.15వేలు, పట్టణాల్లో రూ.17,500... కార్పొరేషన్లలో గరిష్ఠంగా రూ.20వేలు మాత్రమే వార్షిక ఫీజు వసూలు చేయాలి. అదే ఆర్ట్స్‌ గ్రూపులైతే... రూ.12వేలు, రూ.15వేలు, రూ.18వేలుగా ఫీజు నిర్ణయించారు.

 హాస్టల్‌ ఫీజు ఏడాదికి గ్రామ పంచాయతీల్లో 18వేలు, పట్టణాల్లో 20వేలు, నగరాల్లో 24వేలు మించకూడదు.

 పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల రవాణా చార్జీల కోసం కిలోమీటరుకు రూ.1.20 మాత్రమే వసూలు చేయాలి.


అధిక ఫీజులపై చర్యలేంటి?

ప్రభుత్వం జీవో నెంబర్‌ 54లో ఫీజులు ఖరారు చేసింది. కానీ, నిర్దేశించిన దాని కంటే అధికంగా ఫీజులు వసూలు చేసే కళాశాలలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెల్లడించలేదు. అటువంటి కళాశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరికి ఫిర్యాదు చేయాలో స్పష్టం చేయలేదు. నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ కార్పొరేటు, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు జూన్‌ నుంచే ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించేశాయి.  ఇప్పటికే 30 శాతం మేర ఫీజులు కట్టించుకున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రైవేటు యాజామాన్యాలు ఫీజులు తగ్గించకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఫీజులు వసూలు చేస్తే.. తమకు కొంత భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు.


నోటీసు బోర్డులో ఉంచాలి

ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పొందుపరచాలి. ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజులను మాత్రమే తల్లిదండ్రులు చెల్లించాలి. ఈ ఫీజులు 2021-22 నుంచి 2023-24 విద్యాసంవత్సరాల వరకు వర్తిస్తాయి. అఽధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం.  

- ఎస్‌.తవిటినాయుడు, ఆర్‌ఐవో

 

Updated Date - 2021-08-28T04:56:02+05:30 IST