Abn logo
Sep 24 2021 @ 13:25PM

పాలమూరుపై Revanth reddy ప్లాన్ అదేనా..!

పాలమూరుపై కాంగ్రెస్ కన్ను.. తెరపైకి పాత నేతలు..

పార్టీకి పూర్వవైభవం తెచ్చే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు.!


పాలమూరులో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం దిశగా పయనించనుందా..? ఆయన రాకతో పాత తరం నేతలంతా ఆ గూటికే చేరుతున్నారా..? ఆ పార్టీలో పనిచేసిన సీనియర్లంతా హస్తం వైపు చూడడానికి కారణమేంటి? టీకాంగ్రెస్‌కు కొత్త బాస్ రావడంతో జిల్లా సీన్ పూర్తిగా మారిపోయిందా?

తెరపైకి వస్తున్న పాతనేతలు..

ఒకప్పుడు పాలమూరులో ప్రభంజనంగా ఉండి.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత చతికిలబడ్డ కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక పాత నేతలంతా తెరపైకి వస్తున్నారు. ముఖ్యంగా టీపీడీలో రేవంత్‌తో కలిసి పనిచేసిన వాళ్లంతా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే.. బీజేపీ పాలమూరు జిల్లా మాజీ అధ్యక్షుడు ఎర్రశేఖర్ కాంగ్రెస్‌లో చేరాలని.. బీజేపీకి రాజీనామా చేసి, లైన్‌ క్లియర్‌ చేసుకున్నారట. ఇప్పటి దాకా తెలుగుదేశంలోనే ఉంటూ మీనమేషాలు లెక్కించిన మరో ఇద్దరు మాజీలు సైతం హస్తం గూటికి చేరేందుకు రెడీ అయ్యారు.

పార్టీని వీడే దిశగా దయాకర్ రెడ్డి..

పాలమూరు జిల్లాలో టీడీపీని ఇప్పటికీ అంటిపెట్టుకుని ఉన్న నేతలు.. మాజీ ఎమ్మెల్యే దంపతులు సీతా దయాకర్‌రెడ్డి, దయాకర్ రెడ్డి. చివరికి టీడీపీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. ఇన్నాళ్లూ వీరు కన్నతల్లిగా భావిస్తున్న పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు నాయకులను కాపాడుకుంటూ వచ్చారు.


దయాకర్ రెడ్డి దంపతులు కార్యకర్తలకు అండగా ఉంటూనే, టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆందోళనలను కొనసాగించారు. ఇప్పటి వరకు క్యాడర్‌‌లో మానసిక ధైర్యాన్ని నింపిన దయాకర్‌ రెడ్డి.. ఇక పార్టీలో కొనసాగడం వల్ల కార్యకర్తలకు ఏ మాత్రం న్యాయం చేయలేనన్న భావనకు వచ్చారని తెలుస్తోంది. కార్యకర్తల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్న ఒత్తిడులను కూడా దయాకర్‌ రెడ్డి పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

ఆ నియోజకవర్గాలపై బలమైన పట్టు..

తనను నమ్ముకున్న క్యాడర్‌ కూడా నాయకుడికి చెప్పలేక.. పార్టీలో కొనసాగలేక సతమతమవుతున్నారనే ఆవేదన కూడా దయాకర్‌రెడ్డి మనసును తొలుస్తోంది. ఇదంతా జరుగుతున్నా తనకెందుకులే అనుకుని తాను నమ్మిన పార్టీలోనే కొనసాగాలన్న ఆలోచనచేసే నాయకుడు కాదు దయాకర్‌ రెడ్డి. గత ముప్పై ఏళ్లుగా జిల్లాలో ఆయన తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని పొందారు. ఒకప్పటి అమరచింత నియోజకవర్గం.. దేవరకద్ర, నారాయణపేట అనే కొత్త నియోజకవర్గాలుగా మారాయి. వీటితో పాటు అంతకు ముందే ఉన్న మఖ్తల్‌ లోని చాలా గ్రామాలు కూడా అమరచింత నియోజకవర్గ పరిధిలోకి వస్తుండేవి.


దీంతో దయాకర్ రెడ్డికి ఈ మూడు నియోజకవర్గాల్లో మంచి క్యాడర్‌ ఉంది. 2009 ఎన్నికల్లో దయాకర్‌ సతీమణి సీతాదయాకర్‌ రెడ్డి దేవరకద్ర నుంచి.. దయాకర్ రెడ్డి మఖ్తల్‌ నుంచి గెలుపొందారు. ఎమ్మెల్యే దంపతులుగా అప్పట్లో రికార్డు సాధించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చేసినా ఓటమిపాలయ్యారు. అయినా తమ కార్యకర్తలను మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు.

 రేవంత్ రెడ్డి ఒత్తిడితో..

రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఎంపికైన తర్వాత చాలా మంది కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా దయాకర్ రెడ్డి దంపతులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మఖ్తల్‌, దేవరకద్ర, నారాయణపేటలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న నాయకుల్లో చెప్పుకోదగ్గ నేతలు లేరని వారి వాదన. దయాకర్‌ దంపతులు కాంగ్రెస్‌ పార్టీలో చేరితే, ఖచ్చితంగా గెలిచే అవకాశముందని కార్యకర్తలు అంటున్నారు.


దయాకర్‌ రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో చేరమని తనకు ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు రాలేదని.. పార్టీ మారే విషయాన్ని ఇంకా ఆలోచించలేదని కార్యకర్తలతో చెబుతున్నారట. ఇంకో రెండు నెలలు ఆగి.. ఏదో ఓ నిర్ణయం తీసుకుంటామని సంకేతాలిస్తున్నారు. దీంతో కార్యకర్తల్లో కాస్త.. ఉత్సాహం కనిపిస్తోంది. మరికొందరు కీలక నేతలు, కార్యకర్తలు కూడా వీరి బాటలోనే నడుస్తున్నారని తెలుస్తోంది.

 సీనియర్లతో విభేదాల కారణంతో..

దయాకర్ రెడ్డి దంపతులతో పాటు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ రంగం సిద్దం చేసుకున్నారు. టీడీపీ నుంచి మూడుసార్లు జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎర్రశేఖర్.. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2018లో జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ కు మకాం మార్చి, మహాకూటమిలో భాగంగా టీడీపీ తరపున పోటీ చేసి, ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రెండేళ్ల క్రితం బీజేపీలో చేరి, జిల్లా అధ్యక్షుడు అయ్యారు.


సీనియర్లతో విభేదాల కారణంగా బీజేపీ ఆయనకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా పర్యటనలోనూ ఇది బయటపడింది. దీంతో మనస్తాపానికి గురైన ఎర్రశేఖర్‌ బీజేపీకి రాజీనామా చేశారు. చివరికి బండి సంజయ్ బుజ్జగించడంతో విత్ డ్రా చేసుకున్నారు. అయినా అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.

 పూర్వ వైభవం దిశగా.. అడుగులు..

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక సీన్ మారింది. డీసీసీ అధ్యక్ష పదవితో పాటు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మహబూబ్ నగర్ లేదా జడ్చర్ల టిక్కెట్ ఇస్తామని రేవంత్ హామీ ఇవ్వడంతో.. కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. ఇలా ఇప్పటికే పాతతరం టీడీపీ నాయకులు కాంగ్రెస్‌ వైపు తరలేందుకు ఎవరికి వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే జరిగితే, కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మళ్లీ పూర్వ వైభవం దిశగా పయనించనుంది.

ఇవి కూడా చదవండిImage Caption