సభావేదిక మారేనా..?మళ్లీ అదే వేదికగా సభ జరిగే చాన్స్..?

ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST

ఉప ఎన్నిక ప్రచార పర్వంలో చివరి రోజైన ఈ నెల 27న పెంచికల్‌పేటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ నిర్వహిస్తారని టీఆర్‌ పార్టీ ప్రకటించింది.

సభావేదిక మారేనా..?మళ్లీ అదే వేదికగా సభ జరిగే చాన్స్..?

ఈసీ తాజా వివరణతో  పెంచికల్‌పేట సభకు చిక్కులు

కరీంనగర్‌, హన్మకొండ జిల్లాల్లో వర్తించనున్న కోడ్‌

హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలో నిర్వహించేందుకు సన్నాహాలు

నేడు స్పష్టత వచ్చే అవకాశం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఉప ఎన్నిక ప్రచార పర్వంలో చివరి రోజైన ఈ నెల 27న పెంచికల్‌పేటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ నిర్వహిస్తారని టీఆర్‌ పార్టీ ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్‌ డైరెక్టర్‌ తాజాగా ఇచ్చిన వివరణతో ఈ సభ స్థలం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.


తాజా వివరణలు ఇవి..

ఉప ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గం ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌లో లేదా రాష్ట్ర రాజధానిలో, మెట్రోపాలిటన్‌ నగరంలో ఉంటేనే ఎన్నికల కోడ్‌ ఆ నియోజకవర్గ పరిధికి మాత్రమే వర్తిస్తుందని, వీటి పరిధిలో లేని నియోజకవర్గం అయితే జిల్లా అంతటికి కోడ్‌ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. 


- దీంతో హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో కరీంనగర్‌, హన్మకొండ జిల్లాల్లో కోడ్‌ అమలులో ఉండనున్నది. 

- ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో స్టార్‌ క్యాంపెయినర్లు పాల్గొనే సభల్లో కొవిడ్‌ నిబంధనల మేరకు వెయ్యి మంది హాజరయ్యేందుకు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనే సభకు భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని టీఆర్‌ఎస్‌ భావించింది. అందుకనుగుణంగా జిల్లా సరిహద్దుల్లో ఉన్న పెంచికల్‌ పేటలో యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. 

- తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్‌ డైరెక్టర్‌ అజయ్‌ చందక్‌ జారీ చేసిన ప్రకటనతో ముఖ్యమంత్రి పాల్గొననున్న సభకు చిక్కులు ఏర్పడ్డాయి.

- అజయ్‌ చందక్‌ జారీ చేసిన ప్రకటనలో అభివృద్ధి, పాలనాపరమైన పనులు యథావిధిగా కొనసాగాలని, ఉప ఎన్నిక ప్రచారాన్ని ఆ నియోజకవర్గ పరిధిలోనే జరిగేలా పరిమితం చేయాలని సూచించింది.

- రాజకీయ కార్యకలాపాలు నియోజకవర్గ వెలుపల, జిల్లా పరిధిలో కూడా నిర్వహించే పరిస్థితి ఉన్నదని, ఇటువంటి కార్యకలాపాలు ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన సూచనల స్ఫూర్తికి విరుద్ధమని జాయింట్‌ డైరెక్టర్‌ అజయ్‌ చందక్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా సీఎం కేసీఆర్‌ పాల్గొననున్న బహిరంగ సభనుద్దేశించేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 

- ఉప ఎన్నికకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కడ నిర్వహించినా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, కొవిడ్‌, వ్యయ పర్యవేక్షణ అమలుకు సంబంధించిన సూచనల పరిధిలోకే వస్తాయని సూచించారు. 

- జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని పేర్కొనడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నది. 

- ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనే సభ విషయంలో సందిగ్ధం నెలకొన్నది. 

- నిబంధనల ప్రకారం కరీంనగర్‌, హన్మకొండ జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుంది. దీంతో సీఎం కేసీఆర్‌ పాల్గొనే సభను నిర్వహించడానికి వీలులేని పరిస్థితి నెలకొన్నది. 


కేసీఆర్‌ అభినందన సభగా..

సీఎం సభను హుజూరాబాద్‌ నియోజకవర్గానికి పొరుగునే ఉన్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలో జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. సిద్దిపేట జిల్లా పరిధిలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండదు. హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధి హుజూరాబాద్‌ను ఆనుకొనే ఉండడంతో సభ ప్రభావం హుజూరాబాద్‌ ప్రజలపై ఉంటుందని భావిస్తున్నారు. దీంతో సభావేదిక మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో ఈ నెల 22న ఒక స్పష్టత వస్తుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఎన్నికల సభగా కాకుండా దీనిని సీఎం అభినందన సభగా నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.


ఈ నెల 25న సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికకానున్న నేపథ్యంలో ఆయనను అభినందించడానికి సభ ఏర్పాటు చేసి దాని ద్వారానే హుజూరాబాద్‌ ప్రజలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలనే పిలుపునిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికల, కొవిడ్‌ కోడ్‌, వ్యయ పర్యవేక్షణ సమస్యలను అధిగమించడానికి సీఎం అభినందన సభే సరైనదన్న అభిప్రాయానికి వచ్చిన టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆ దిశగా ఆలోచన చేస్తున్నదని సమాచారం. ఈ నెల 27న జరగనున్న టీఆర్‌ఎస్‌ సభ అధినేత అభినందన సభగా మారడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 

Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST