బంగారం... రూ. 60 వేలకు చేరనుందా ?

ABN , First Publish Date - 2021-05-04T01:07:23+05:30 IST

బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

బంగారం... రూ. 60 వేలకు చేరనుందా ?

ముంబై : బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్‌ నెలలో 10 గ్రాముల బంగారం ధర రూ. 2,602 వరకు పెరిగింది. మార్చి 31 న 10 గ్రాముల బంగారం ధర రూ. 44,190 ఉంది. ఇక మే నెలకు సంబంధించి బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్న బంగారం ఇదే నెల నుంచి పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 


దీపావళి నాటికి రూ. 60 వేల వరకు ...

రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 60 వేలు దాటిపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం దిగివస్తోన్న బంగారం ధరలు..రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశాలున్నాయని కొందరు చెబుతుండగా, తాజాగా... దీపావళీ నాటికి భారీగా పెరిగే అవకాశాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటుండడం గమనార్హం.


కరోనా నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం నెలకొందని భావిస్తున్నారు. కాగా... గతేడాది ఆగస్టులో 10 గ్రాముల ధర  రికార్డు స్థాయి(రూ. 56, 200)కి చేరగా, రానున్న రోజుల్లో సైతం ఇదే మాదిరిగా పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా అమెరికన్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,773 డాలర్లపైన ట్రేడవుతోంది. 

Updated Date - 2021-05-04T01:07:23+05:30 IST