YSRCP : మహిళా ఎమ్మెల్యే ముందు ఏంటిది సారూ..!?

ABN , First Publish Date - 2021-12-22T06:32:01+05:30 IST

మహిళా ఎమ్మెల్యే ముందు ఏంటిది సారూ..!?

YSRCP : మహిళా ఎమ్మెల్యే ముందు ఏంటిది సారూ..!?

  • మీ ఆయన అప్పుచేస్తే ప్రభుత్వం కడుతుందా..?
  • అధికారిక కార్యక్రమంలో శింగనమల ఎమ్మెల్యే బావ కొడుకు దర్పం
  • బాధితురాలికి చేదు అనుభవం
  • కవరేజీ చేస్తున్న మీడియాపై సీఐ చిందులు


అనంతపురం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘మీ ఆయన అప్పు చేస్తే ప్రభుత్వం కడుతుందా..?’ అంటూ ఓ బాధితురాలిపై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి బావ కుమారుడు అధికార దర్పాన్ని ప్రదర్శించారు. మంగళవారం బుక్కరాయసముద్రంలో ఏర్పాటు చేసిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం జిల్లాస్థాయి ప్రా రంభోత్సవం అందుకు వేదికైంది. స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉంటే... వారి భర్తలు అధికారం చెలాయించడం ఇప్పటివరకూ చూశాం. ఓ మహిళ ఎమ్మెల్యేగా ఉండగా... ఆమె బావకొడుకు ఆ ప్రజాప్రతినిధి ఎదుటే పెత్తనం చెలాయించడం జగన ప్రభుత్వంలోనే చూడొచ్చనేందుకు ఈ ఘటనే నిదర్శనం. సమావేశం ప్రారంభానికి ముందు స్థానిక ఎమ్మెల్యేతోపాటు జిల్లా పరిషత చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, స్థానిక మండల అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంలో స్థానికంగా నివాసముంటున్న అరుణమ్మ అక్కడికి వచ్చింది. తనకు ప్రభుత్వ ఇల్లు మంజూరు కాలేదంటూ ఎమ్మెల్యే ఎదుట ఆ వేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే స్పందించే తరుణంలోనే... ఆమె బావ కొడుకు ఎర్రిస్వామి రెడ్డి కలగజేసుకున్నాడు. అంతా తానై అన్నట్లుగా వ్యవహరించాడు.


ఏంటిది..!?

ఆయన ప్రజాప్రతినిధి కాదు... కేవలం ఎమ్మెల్యే బావకొడుకు మాత్రమే. ఎలాంటి అధికారం లేకపోయినా... మహిళల నుంచి వినతిపత్రాలు తీసుకుంటూ వారి సమస్యలు తీర్చే నాయకుడిగా దర్పం ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే అరుణమ్మ తన కష్టాలు చెబుతుండగా.. ‘మీ ఆయన అప్పు చేస్తే ప్రభుత్వం కడుతుందా...?’ అంటూ గద్దించాడు. అంతటితో ఆగని ఆయన.. తహసీల్దార్‌ ఎక్కడున్నాడంటూ అధికారులను తన ఆధీనంలో ఉన్నట్లు వ్యవహరించడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఎలాంటి అధికారం లేకపోయినా ప్రభుత్వ కార్యక్రమంలో దర్పం ప్రదర్శించిన ఎర్రిస్వామి రెడ్డి తీరుపై అధికార పార్టీ నేతల్లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. వినతిపత్రాలు తీసుకోవడానికి ఆయనకేమి అర్హతలున్నాయని పలువురు చ ర్చించుకోవడం కనిపించింది. తనకు ప్రభుత్వం నుంచి ఇల్లు రాలేదని ఎమ్మెల్యేకి విన్నవించుకుంటుండగా... ఆమె బావ కొడుకు ప్రశ్నలతో గద్దించడంతో బాధిత మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న ఓ కెమెరామనపై స్థానిక సీఐ సాయిప్రసాద్‌ చిందులేశాడు. కెమెరాను పక్కకు తోశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే... దౌర్జన్యానికి దిగారనడంలో సందేహం లేదు. ‘పనీపాటా లేదు మీకు... మూసుకో.. మూసుకో నువ్వు... ప్రోగ్రామంతా డిస్టర్బ్‌ చేస్తున్నారం’టూ చిర్రుబుర్రులాడాడు. అ క్కడున్న కొందరు పోలీసులు వారించడంతో వివాదం సద్దుమనిగింది.

Updated Date - 2021-12-22T06:32:01+05:30 IST