దళితబంధుతో నర్సిగాడు నర్సయ్య అవుతాడా?

ABN , First Publish Date - 2021-08-04T05:59:07+05:30 IST

రైతుబంధు లాగా, రైతుబీమా లాగా దళితబంధు పథకాన్ని అమలు జరపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం ఆహ్వానించదగ్గది....

దళితబంధుతో నర్సిగాడు నర్సయ్య అవుతాడా?

రైతుబంధు లాగా, రైతుబీమా లాగా దళితబంధు పథకాన్ని అమలు జరపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం ఆహ్వానించదగ్గది. అయితే ఈ పథకం వల్ల కొన్ని దళిత కుటుంబాలు మాత్రమే బాగుపడతాయి తప్ప, దళితులందరి జీవితాల్లోనూ మౌలిక మార్పు సాధ్యం కాకపోవచ్చు. కొందరు దళితులకు గృహవసతి, జీవనోపాధి, చదువు, ఆరోగ్యం, ఉద్యోగం, మంచి జీవన సౌకర్యాలు లభించినా, వారిపై పులిమిన సామాజిక మాలిన్యం రూపు మార్చుకుని కులవివక్ష మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దళితులు అధికార వ్యవస్థను శాసించే స్థాయికి చేరినప్పుడే, వారు పడుతున్న సామాజిక కష్టాలకు ముగింపు ఉంటుంది. ఇలా కొద్ది మేరకైనా శక్తిని ఇవ్వగలిగితేనే దళితబంధు పథకం సార్థకమవుతుంది.


సంపద రూపం డబ్బు ఒక్కటే కాదు. సాగుభూమి, ఉన్నత విద్య, సాంకేతిక వృత్తి నైపుణ్యాలు, నాయకత్వ నైపుణ్యాలు, విధాన నిర్ణయాలు చేయగలిగే శక్తి, ప్రామాణికమైన స్వయం ఉపాధి కల్పనాశక్తి కల్పించటం; గనులు, వైన్ షాపులు, మెడికల్ షాపులు, ఎరువులూ పురుగు మందుల షాపులు, రైసుమిల్లులు, రైతుబజార్లు, షాపింగ్ కాంప్లెక్సులలో మడిగలను కేటాయించడం; అభివృద్ధి చెందిన కీలక ప్రాంతాల్లో సొంతభూములు, ఇళ్లు, స్థిరాస్తులు కల్పించడం; రాజకీయ అవకాశాలు కల్పించి, అధికారంలో సరైన వాటా ఇవ్వడం... ఇవన్నీ సంపదకు వివిధ రూపాలే. కనుక దళితబంధు పథకానికి మించి, పైన తెలిపిన సంపద అన్ని రూపాలలోనూ దళిత సాధికారత కోసం రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దళితులకు అవకాశాల చేపల కూర వండిపెట్టడంతో పాటు, అవకాశాల చేపలను పట్టే నైపుణ్యాలను అభివృద్ధిపరచడానికి ప్రణాళికాబద్ధమైన కృషి చెయ్యాలి.


రాష్ట్రంలోని సుమారు పంతొమ్మిది లక్షల దళిత కుటుంబాలకు సాధికార, సంక్షేమ పథకాలను అమలు జరిపేటప్పుడు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి: 1) కులాలవారీగా లబ్ధిదారుల నిష్పత్తి, అమౌంట్ ఆఫ్ మనీ ఉండాలి. 2) దళితబంధు పథకం అమలులో జెండర్ నిష్పత్తిని పాటించాలి. 3) రాష్ట్ర షెడ్యూల్డు కులాలలో అత్యంత వెనుకబడిన సంఖ్యాపరమైన చిన్న కులాల వారికి తగిన ప్రాధాన్యం కల్పించాలి. 4) రాష్ట్ర షెడ్యూల్ కులాలలో సంఖ్యాపరమైన మెజారిటీలై, అభివృద్ధిలో వెనుకబడివున్న మాదిగ, అనుబంధ కులాల వారికి సంబంధిత సంక్షేమశాఖ అధికార పదవులు ఇవ్వాలి. ఉదాహరణకు తెలంగాణ దళిత అభివృద్ధిశాఖ మంత్రి పదవిలోను, ఆ శాఖ ముఖ్యఅధికారి పదవిలోను ఉన్న మాల కులస్థులు కొప్పుల ఈశ్వర్, బొజ్జా రాహుల్ గార్లను వేరే శాఖలకు బదిలీ చేసి, వారి స్థానంలో మాదిగ సంబంధిత కులాల వారికి ఆ పదవులను ఇవ్వాలి. 5) మంత్రి, నామినేటెడ్ చైర్మన్, ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల్లోనూ, రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ మాదిగ అనుబంధ కులాల అధికారులకు ఇరవైశాతం ప్రాతినిధ్యం కల్పించాలి. 6) సంస్కృత విద్యాభివృద్ధి పేరిట కేంద్ర ప్రభుత్వం బ్రాహ్మణులకు కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాలు కల్పించిన మాదిరిగానే మాదిగ అనుబంధ కులాల వారి కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (4) ప్రకారం రాష్ట్రంలో మూడు గురుకుల విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. 7) అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తున్న మాదిరిగానే దళితుల్లో సంప్రదాయక చర్మకార, కాటికాపరి తదితర వృత్తిదారులుగా, పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించి జీతభత్యాలు చెల్లించాలి. 8) దళితబంధు లబ్ధిదారులు తీసుకున్న లబ్ధి, సహాయం, గ్రాంటుకి తగిన బీమా రక్షణ కల్పించాలి. 9) హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రభుత్వం దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టు అమలును తక్షణం ప్రారంభించాలి. 10) తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చిన మాదిరిగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కీలక అధికార పదవుల్లో మాదిగ అనుబంధ కులాలవారికి సరైన ప్రాధాన్యమివ్వాలి. 11) దళితబంధు పథకం మాదిరిగా రాష్ట్రప్రభుత్వం ఆదివాసుల, సంచార జాతుల సాధికారత కోసం బలమైన సంక్షేమ, సాధికార పథకాలను రూపొందించి అమలు జరపాలి. అణగారిన వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములను చెయ్యనిదే ప్రభుత్వాలు స్థిరంగా మనలేవని ప్రభుత్వాధినేతలు గురించాలి. 


ఫోరమ్ ఫర్ గుడ్ గవరెన్స్ సంస్థ వారు హుజూరాబాద్ ఎమ్మెల్యే నియోజకవర్గం ఉపఎన్నిక పూర్తయ్యేవరకూ దళితబంధు పథకం అమలును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అందుకు బదులుగా కరోనా మహావ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి వీలుగా అసలు మరికొంత కాలం ఉపఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవద్దని కోరితే ఇంకా బాగుండేది. ఇప్పటికైనా, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ఎన్నికలసంఘానికి ఈ విధంగా విజ్ఞప్తి చేయాలి. తప్పని పరిస్థితుల్లో ఎన్నిక అనివార్యమైతే అధికారపార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు హుజూరాబాద్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల బలం కలిగిన మాదిగ   అనుబంధ సామాజికవర్గాల వారినే అభ్యర్థులుగా ప్రకటించాలి. 


కులవ్యవస్థ మనుషుల మధ్య ఎన్నో అమానుషమైన అడ్డుగోడలను నిర్మించింది. కొన్ని శ్రామిక మానవ సమూహాలనే బానిసవ్యవస్థలుగా    మలిచింది. దళితకులాల పట్ల మానవమర్యాద, మానవగౌరవం లేకుండా చేసింది. ఆధిపత్య కుల వ్యవస్థ దళిత నర్సయ్యలను నర్సిగాళ్లను చేసింది. దళితులు తమపై కొనసాగిన సుదీర్ఘ సామాజిక వివక్షల యుద్ధానికి అధికారమే పరిహారం    అవుతుందని భావిస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా ప్రతిపాదిస్తున్న దళితబంధు పథకం వారికి సాధికారికతను కల్పించగలుగుతుందా? నర్సిగాళ్లను నర్సయ్యలుగా చేస్తుందా? నర్సయ్యలు కోల్పోయిన మానవమర్యాద, గౌరవాలను పునరుద్ధరిస్తుందా? వేచి చూడవలసిందే! 


సంపద సృష్టికర్తలైన దళితులు ప్రభుత్వ వనరులు, అవకాశాలు, అధికార ప్రాతినిధ్యాల లబ్ధిలో గౌరవప్రదమైన, సింహభాగపు వాటాదారులయ్యే సమానత్వ ప్రజాస్వామిక పరిస్థితులు ఉన్నపుడే, అణగారిన దళితవర్గాలకు నిజమైన సాధికారత లభిస్తుంది. సామాజిక శాంతి వికసిస్తుంది. దళిత బంధు పథకం అమలు ఇందుకు ఉపకరిస్తుందని ఆశిద్దాం.

కృపాకర్ పొనుగోటి

Updated Date - 2021-08-04T05:59:07+05:30 IST