స్వర్ణకారుల సమస్యలను పీఎం దృష్టికి తీసుకువెళతా..

ABN , First Publish Date - 2021-10-18T05:45:30+05:30 IST

స్వర్ణకారుల సమస్యలను తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళతానని కేంద్ర సామాజిక న్యాయ ఎంపవర్‌మెంట్‌ మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు.

స్వర్ణకారుల సమస్యలను పీఎం దృష్టికి తీసుకువెళతా..
స్వర్ణకారులకు ముద్ర రుణాలను అందజేస్తున్న రాందాస్‌ అథవాలే, తల్లోజు ఆచారి

రాష్ట్ర స్వర్ణకార రెండో మహాసభలో కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే

సిరిపురం, అక్టోబరు 17: స్వర్ణకారుల సమస్యలను తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళతానని కేంద్ర సామాజిక న్యాయ ఎంపవర్‌మెంట్‌ మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌ స్వర్ణకార రెండో మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన జ్యోతి ప్రజల్వన చేసి సభను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్ణకారులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలను చట్టసభల్లో ప్రవేశపెట్టడానికి కృషి చేస్తామన్నారు. బీసీ కమిషన్‌ జాతీయ సభ్యుడు తల్లోజు ఆచారి మాట్లాడుతూ మోదీ ప్రధాని అయ్యాక దేశంలో బీసీలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతోమంది స్వర్ణకారులకు పూట గడవక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇటీవల ఖమ్మంలో ఒక స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకారుల కోసం కేంద్రం ఎంతో సహకారాన్ని అందిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిం చాలని కోరారు. రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన కర్రి వేణుమాధవ్‌ మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు  స్వర్ణకారులకు కేంద్ర  మంత్రి, తదితరులు ముద్ర రుణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, ఆర్‌పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.బ్రహ్మానందరెడ్డి, నాయకులు జి.అనిల్‌, పేరం శివనాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-18T05:45:30+05:30 IST