ధరలు మరింత క్షీణించనున్నాయా ?

ABN , First Publish Date - 2022-01-15T01:02:32+05:30 IST

మూడో త్రైమాసికంలో... నీరసమైన ఫలితాలు ప్రకటించే వ్యాపారాల్లో మార్కెట్‌ విశ్లేషకులు పైపులను కూడా చేర్చారు.

ధరలు మరింత క్షీణించనున్నాయా ?

హైదరాబాద్ : మూడో త్రైమాసికంలో... నీరసమైన ఫలితాలు ప్రకటించే వ్యాపారాల్లో మార్కెట్‌ విశ్లేషకులు పైపులను కూడా చేర్చారు. ఈ త్రైమాసికంలో అంతంతమాత్రంగానే ఉన్న అమ్మకాలు, ఒమిక్రాన్‌ వ్యాప్తితో తగ్గుతున్న డిమాండ్‌ నేపధ్యంలో... సమీప కాలంలో ప్లాస్టిక్ పైప్‌ కంపెనీల షేర్ల ధరలు క్షీణించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. అక్టోబరు గరిష్ట ధరల తర్వాత పీవీసీ ధరలు దాదాపు 20 శాతం దిద్దుబాటుకు గురయ్యాయి. నవంబరులో పీవీసీ తయారీ సంస్థలు ధరలను తగ్గించాయి. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లు తమ ఇన్వెంటరీని తగ్గించారు. కంపెనీల మూడో త్రైమాసిక పనితీరును ఇది దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


ఎడెల్‌వైస్‌ రీసెర్చ్‌ ప్రకారం... ప్లాస్టిక్ పైపుల పరిశ్రమ నంబర్లు... త్రైమాసికం ప్రాతిపదికన తగ్గుతాయి. నవంబరులో సాధారణంగా కనిపించే మార్కెట్‌ బలహీనతలతోపాటు, కంపెనీలు రేట్లను ఇంకా తగ్గిస్తాయన్న అంచనా డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళనను పెంచింది. దీంతో ఇన్వెంటరీని 30 రోజుల నుంచి 15-20 రోజులకు తగ్గించారు. కాగా... రిలయన్స్ సెక్యూరిటీస్‌ ఏం చెబుతోందంటే ‘గత కొన్ని త్రైమాసికాలుగా పారిశ్రామిక, డ్రైనేజీ, ప్లంబింగ్, వ్యవసాయ పైపుల్లో కనిపించిన బలమైన డిమాండ్... మూడో త్రైమాసికంలో బలహీనపడింది. తగ్గిన డిమాండ్‌, పడిపోతున్న ధరలు చాలా సెగ్మెంట్లు, మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఈ రంగంలో సగటు అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన పన్నెండు శాతం పడిపోవచ్చు. రాబడి మూడుశాతం తగ్గవచ్చు’. 


ఇక... 2014-21 కాలంలో సంవత్సరానికి సగటున 10 శాతం చొప్పున వృద్ధి చెందిన, రూ. 33 వేల కోట్ల విలువైన ఈ రంగంలో ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, కొన్ని కంపెనీల దీర్ఘకాలిక అవకాశాలపై బ్రోకరేజీలు సానుకూలంగా ఉన్నాయి. కొవిడ్‌ కాలమైన గత రెండేళ్లలో, సరైన పంపిణీ నెట్‌వర్క్‌ లేక చిన్న కంపెనీలు డీలా పడ్డాయి. పక్కా నెట్‌వర్క్‌తో పెద్ద కంపెనీలు లాభపడి, చిన్న కంపెనీల వాటాను సైతం కైవసం చేసుకున్నాయి. ఈ రెండేళ్లలో వ్యవస్థీకృత కంపెనీల వాటా 55 నుండి 65 శాతానికి పెరిగింది. 


ఇక సరఫరా ఇబ్బందులు ఇప్పుడు తగ్గినప్పటికీ, వ్యవస్థీకృత వ్యాపారుల మార్కెట్ వాటా తగ్గబోదని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ భావిస్తోంది. అధిక ప్రకటనలు, పంపిణీ నెట్‌వర్క్‌ విస్తరణ, ముడిసరుకు ధరల్లో అస్థిరతను అధిగమించడం ద్వారా బలమైన బ్యాలెన్స్ షీట్లను తయారు చేస్తాయని, ఆ బలంతో ఎదుగుతాయని అంచనా వేస్తోంది. లిస్టెడ్ కంపెనీల్లో.., డిసెంబరు 20 నుంచి ఆస్ట్రల్ స్టాక్ అత్యధికంగా 16 శాతం లాభపడింది. ఇదే కాలంలో సుప్రీం ఇండస్ట్రీస్, ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ సింగిల్ డిజిట్ లాభాలతో సంతృప్తి చెందాయి. సమీప కాలంలో ఆందోళనలతో ఈ షేర్ల ధరలు తగ్గినపక్షంలో, దీర్ఘకాలిక దృష్టితో వీటిలో పెట్టుబడులు పెట్టవచ్చన్నది విశ్లేషకుల సూచిస్తున్నారు. 

Updated Date - 2022-01-15T01:02:32+05:30 IST