కరోనా పడగ ధనాధన్ పండుగ

ABN , First Publish Date - 2021-04-09T08:20:32+05:30 IST

ఓవైపు కరోనా భయపెడుతూనే ఉన్నా.. మరో వైపు ఫ్యాన్స్‌ను మురిపించేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సిద్ధమైంది.

కరోనా పడగ ధనాధన్ పండుగ

నేటి నుంచే ఐపీఎల్‌

ఆటగాళ్లంతా బయో బబుల్‌లో..

మ్యాచ్‌లన్నీ ఖాళీ స్టేడియాల్లో.. 


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం): ఓవైపు కరోనా భయపెడుతూనే ఉన్నా.. మరో వైపు ఫ్యాన్స్‌ను మురిపించేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సిద్ధమైంది. ప్రపంచ క్రీడారంగంలో అతి భారీ ఈవెంట్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందుకే ఎలాంటి అడ్డంకులెదురైనా వాటిని దాటుకుంటూ వచ్చేసింది. టీ20 మెగా టోర్నీకి ముందే ధనాధన్‌ పరుగుల పండుగకు శుక్రవారమే తెర లేవనుంది. చెన్నైలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌-రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు తలపడతాయి. మొత్తంగా మే 30 వరకు ఎనిమిది జట్ల మధ్య 50 రోజుల పాటు 60 మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఇందులో 11 డబుల్‌ హెడర్‌ (మధ్యాహ్నం, రాత్రి) మ్యాచ్‌లున్నాయి. మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగానే ఉన్నా.. కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఐపీఎల్‌ 14వ సీజన్‌ను భారత్‌లో జరిపేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.


భయం భయంగానే..

ఎనిమిది ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లంతా 15-20 రోజులు ముందునుంచే బయో బబుల్‌లో ఉంటున్నారు. టోర్నీ ముగిసేవరకు కూడా వారంతా బబుల్‌లో ఉండాల్సిందే. అయినా ఇప్పటికే నితిశ్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, దేవ్‌దత్‌, డానియల్‌ శామ్స్‌పై కరోనా పంజా విసిరింది. వీరిలో రాణా, దేవ్‌దత్‌ కోలుకున్నా.. మిగతా ఇద్దరు ఐసోలేషన్‌లో ఉన్నారు. అటు వాంఖడే గ్రౌండ్స్‌మన్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌ కూడా కరోనా బాధితులయ్యారు. దీంతో ముంబైలో మ్యాచ్‌లు జరుగుతాయా? అనే సందేహం అందరిలోనూ వ్యక్తమైంది. కానీ ఎట్టి పరిస్థితిల్లోనూ మ్యాచ్‌లు అక్కడే జరుగుతాయని బీసీసీఐ స్పష్టం చేసింది. 

 అంతా క్రితంలానే..

యూఏఈలో ఐపీఎల్‌ను నిర్వహించిన పద్దతిలోనే ఈ సీజన్‌ కూడా జరుగబోతోంది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు ఈసారీ ప్రేక్షకులకు అనుమతి లేదు. అప్పట్లో ఆరంభ మ్యాచ్‌ల వరకు ఖాళీ స్టేడియాల్లో జరుపుతామని నిర్వాహకులు ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే లీగ్‌ రెండో దశలోనూ మ్యాచ్‌లు ఇదే మాదిరి జరిగే అవకాశముంది. అలాగే ఆటగాళ్లంతా బయో సెక్యూర్‌ బబుల్‌లో ఉంటున్నారు. ఏడాదిగా క్రికెటర్లకు బబుల్‌లో ఉండడం అలవాటుగా మారింది. దీంతో వీరిని ఎవరూ కలవడానికి వీలుండదు. మ్యాచ్‌లు జరిగిన రోజు స్టేడియాలకు, ఆ తర్వాత నేరుగా తమ బసకు చేరాల్సి ఉంటుంది. వరుసగా రెండో ఏడాదీ ఆరంభ వేడుకలు లేవు. 


 ఆరు వేదికల్లో..

క్రికెటర్ల ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు.. అలాగే బయో సెక్యూర్‌ బబుల్‌ ఏర్పాట్లకు ఇబ్బంది ఉండకుండా 14వ సీజన్‌ కేవలం ఆరు నగరాల్లోనే జరుగనుంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై 60 మ్యాచ్‌లకు వేదికలుగా ఉంటాయి. అయితే ఈ ఆరు జట్లకు సొంత మైదానం ప్రయోజనం ఉండకుండా అన్ని టీమ్స్‌ కూడా తటస్థ వేదికల్లో ఆడనున్నాయి. మ్యాచ్‌లను కూడా క్రితం మాదిరిగానే మధ్యాహ్నం 3.30 నుంచి.. రాత్రి మ్యాచ్‌లు 7.30కు ఆరంభిస్తారు. ఇక ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో అక్కడి మ్యాచ్‌లను హైదరాబాద్‌కు తరలించాలని మంత్రి కేటీఆర్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్‌ విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. 


టీ20 మెగా టోర్నీకి సన్నాహకంగా..

ఈ ఏడాది అక్టోబరులో భారత్‌లోనే టీ20 ప్రపంచకప్‌ జరగబోతోంది. దీనికి సన్నాహకంగా ఈ మెగా లీగ్‌ అద్భుతంగా ఉపయోగపడనుంది. అలాగే ఇటీవల దేశవాళీ టోర్నీల్లో అమోఘంగా రాణించిన ఆటగాళ్లకు కొదవలేదు. అందుకే ఈ అద్భుతమైన వేదికపై సత్తా నిరూపించుకుని జాతీయ జట్టు తలుపు తట్టేందుకు వారు ఎదురుచూస్తున్నారు. దేవ్‌దత్‌, తెవాటియా, త్రిపాఠి, రుతురాజ్‌, కృష్ణప్ప గౌతమ్‌, శ్రేయాస్‌ గోపాల్‌, సకారియా, కార్తీక్‌ త్యాగి, షారుక్‌ ఖాన్‌, అజరుద్దీన్‌ ఇలా చాలా మంది ఈసారి గమనించదగ్గ ఆటగాళ్లుగా ఉన్నారు. అటు తమ ఆటగాళ్లకు చక్కటి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభిస్తుందని కెప్టెన్‌ కోహ్లీ కూడా భావిస్తున్నాడు. 

 

కొత్త చాంపియన్‌ను చూస్తామా ..?

ఐపీఎల్‌లో కొత్త చాంపియన్‌ను చూసి ఐదేళ్లవుతోంది. చివరిగా 2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ముంబై మూడుసార్లు, చెన్నై ఓసారి టైటిల్‌ గెలిచింది. బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్‌ ఒక్కసారీ కప్పు అందుకోలేకపోయాయి. నిరుడు అంచనాలకు మించి ఆడిన ఢిల్లీ జట్టు తొలిసారిగా ఫైనల్‌ చేరినా నిరాశపరిచింది. ఇక కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు మూడుసార్లు, పంజాబ్‌ ఓసారి ఫైనల్‌కు చేరాయి. ఈసారి ముంబై ఇండియన్స్‌కు బ్రేక్‌ వేస్తూ టైటిల్‌ పట్టేయాలని ఈ త్రయం భావిస్తుండగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ ప్రాభవాన్ని తిరిగి చాటాలనే కసితో ఉంది.


ఈ రికార్డులు బద్దలవుతాయా?

అత్యధిక పరుగులు విరాట్‌ కోహ్లీ (5878)

అత్యధిక వ్యక్తిగత స్కోరు క్రిస్‌ గేల్‌ (175 నాటౌట్‌)

అత్యధిక సిక్సర్లు క్రిస్‌ గేల్‌ (349)

అత్యధిక ఫోర్లు శిఖర్‌ ధవన్‌ (591)

అత్యధిక స్ట్రయిక్‌ రేట్‌ ఆండ్రీ రస్సెల్‌ (182.33)

అత్యధిక జట్టు స్కోరు బెంగళూరు (263/5)

అత్యల్ప జట్టు స్కోరు బెంగళూరు (49 ఆలౌట్‌)

అత్యధిక వికెట్లు లసిత్‌ మలింగ (170)

ఉత్తమ బౌలింగ్‌ అల్జారీ జోసెఫ్‌ (6/12)

అత్యధిక  సెంచరీలు  క్రిస్‌ గేల్‌ (6)

అత్యధిక  డాట్‌ బాల్స్‌ హర్భజన్‌ సింగ్‌ (1249)

Updated Date - 2021-04-09T08:20:32+05:30 IST