ఇల్లు కట్టుకుంటారా.. స్థలం రద్దు చేయాలా..?

ABN , First Publish Date - 2022-04-19T06:47:29+05:30 IST

అధికారంలోకి వస్తే పేదలందరికీ రూ.5 లక్షలతో ఇల్లు కట్టించి తాళం చెవి చేతికి ఇస్తానని నాడు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర పొడవునా వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. అధికారం వచ్చిన తరువాత రూ.5 లక్షలు ఇచ్చేది అటకెక్కించి... ఇంటి నిర్మాణానికి రూ.1.80వేలు ఇస్తామన్నారు.

ఇల్లు కట్టుకుంటారా..  స్థలం రద్దు చేయాలా..?
బద్వేలులో జగనన్న కాలనీ లేటౌట్లు

లబ్ధిదారులపై వలంటీర్ల ఒత్తిడి 

మూడో ఆప్షన్‌ ఇచ్చిన వారికి కూడా తిప్పలే 

కడప, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వస్తే పేదలందరికీ రూ.5 లక్షలతో ఇల్లు కట్టించి తాళం చెవి చేతికి ఇస్తానని నాడు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర పొడవునా వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. అధికారం వచ్చిన తరువాత రూ.5 లక్షలు ఇచ్చేది అటకెక్కించి... ఇంటి నిర్మాణానికి రూ.1.80వేలు ఇస్తామన్నారు. జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చారు. మూడవ ఆప్షన్‌ ఎంచుకుంటే ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందని సెలవిచ్చారు. అయితే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటావా.. లేక స్థలం రద్దు చేయమంటావా అంటూ అధికారులు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను బెదిరిస్తున్నారు. ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందని కదా అని మూడవ ఆప్షన్‌ ఇచ్చాము.. అని లబ్ధిదారులు ప్రశ్నిస్తే ఆ ఆప్షన్‌ ఎంచుకుంటే మీకు స్థలం రద్దు అవుతుందని భయపెడుతుండడం చర్చనీయాంశంగా మారింది. జగనన్న ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఖరి కొండంత రాగం తీసి కూనిరాగానికే పరిమితి అయినట్టు ఉందంటున్నారు లబ్ధిదారులు.


మూడవ ఆప్షన్‌ లేనట్లే

జగన్‌ సర్కార్‌ జిల్లాకు 1,02,117 పక్కా గృహాలను కేటాయించగా, మ్యాపింగ్‌ అయిన ఇళ్లు 82,593 ఉన్నాయి. ఇప్పటి వరకు జగనన్న కాలనీల ద్వారా 52,975 గృహాలు బేస్‌మట్టం లెవల్‌లో ఉన్నాయి. ఈ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది. మొదటి ఆప్షను ప్రభుత్వ నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి హౌసింగ్‌ సామగ్రిని ఇవ్వడంతో పాటు నిర్మాణానికి అయ్యే కూలిని ఇస్తుంది. రెండో ఆప్షన్‌లో రూ.1.80లక్షలు విడతల వారీగా డబ్బు ఇస్తుంది. ఇల్లు వీరే నిర్మించుకోవాలి. ఇళ్లు కట్టుకోలేని వారికి ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందనేది మూడవ ఆప్షన్‌. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణ వ్యయం భారీగా పెరగడం మొదటి రెండు ఆప్షన్లవైపు చాలా తక్కువమందే మొగ్గుచూపారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం సరిపోకపోవడంతో సుమారు 61 వేల మంది లబ్ధిదారులు మూడో ఆప్షన్‌ ఇచ్చారు. మూడవ ఆప్షన్‌ కింద ప్రభుత్వం సూచించన నమూనాలో పక్కా గృహం నిర్మించడం సాధ్యం కాదని భావించిన కాంట్రాక్టర్లు ఈ పనులు చేపట్టేందుకు మొగ్గు చూపలేదు.దీంతో ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా లబ్ధిదారులే నిర్మించుకోవాలని తీవ్ర ఒత్తిడి తెస్తోంది. కేవలం పులివెందుల నియోజకవర్గం, ప్రొద్దుటూరు అర్బన్‌, బద్వేలులో కొన్ని ఇళ్లు మాత్రమే మూడో ఆప్షన్‌లో నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చినట్లు సమాచారం.


ఇల్లు కట్టుకుంటావా.. స్థలం రద్దు చేయాల్నా

ఇల్లు కట్టుకుంటావా లేదా స్థలం రద్దు చేయాలా అంటూ లబ్ధిదారులపై అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆర్డీవో స్థాయి అధికారులు కింది స్థాయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇళ్లు కట్టుకోకపోతే స్థలాలు రద్దు చేస్తామని బెదరించడంతో చాలామంది అప్పోసొప్పో చేసి బేస్‌మట్టం వేసుకుంటున్నారు. అధికారులు ఒత్తిడి చేయడంతో చాలా మంది సొంతంగా ఇళ్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మూడో ఆప్షన్‌లో 61 వేల నుంచి 15 వేలకు కుదించినట్లు చెబుతున్నారు. ఇళ్లు కట్టుకోకపోతే రద్దు చేస్తామంటూ వలంటీర్ల నేరుగా చెప్పడంతో పాటు వాట్సా్‌ప గ్రూపులో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వమే కట్టిస్తామని చెప్పి.. ఇప్పుడు స్థలం రద్దు చేస్తారని చెప్పడం ఎంతవరకు సమంజసమని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ విషయమై హౌసింగ్‌ అధికారి కృష్ణయ్యను ఆంధ్రజ్యోతి ఫోన్‌ ద్వారా వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.


ప్రభుత్వమే నిర్ణయించాలి

- వెంకటశివ , సీపీఐ నగర కార్యదర్శి

మూడవ ఆప్షన్‌ ఎంచుకున్న పేదలకు ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తామని చెప్పింది. మరి ఇప్పుడు కట్టుకోకపోతే స్థలం రద్దు చేస్తామని వలంటీర్ల ద్వారా బెదిరించడం అన్యాయం. 5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇంటి నిర్మాణాన్ని భారీగా కుదించారు. ఆ సొమ్ముతో ఇల్లు కట్టుకోలేరు. జగనన్న కాలనీల్లో ఇళ్లనిర్మాణం వేగవంతం కావాలంటే ముందు ప్రభుత్వం చెప్పినట్లుగా మూడో ఆప్షన్‌ కింద పనులు చేపట్టాలి. 


5 లక్షలతో ఇల్లు కట్టిస్తామన్నారు 

- సానపురెడ్డి శివకొండారెడ్డి, టీడీపీ నగరాధ్యక్షుడు 

అధికారంలోకి వస్తే రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రతిపక్ష హోదాలో చెప్పారు. లక్ష ఇళ్లు నిర్మిస్తామని జిల్లాలో గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోకపోతే స్థలం రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలి. స్థలాలు రద్దు చేస్తామంటే లబ్ధిదారులతో కలిపి ఉద్యమం చేస్తాం.


జిల్లాకు మంజూరైన ఇళ్లు ఇవే : 

నియోజకవర్గం మంజూరు మ్యాపింగ్‌ పునాదులు 

కడప 21500 20382 16977

బద్వేలు 13193 10527 5455

జమ్మలమడుగు 11955 9034 5042

కమలాపురం 66085 5064 2513

మైదుకూరు 7654 6165 3819

ప్రొద్దుటూరు 23384 18733 15137

పులివెందుల 17823 10655 4032

Updated Date - 2022-04-19T06:47:29+05:30 IST