బరాబర్‌ నిలబడతా

ABN , First Publish Date - 2021-04-10T07:49:55+05:30 IST

‘బరాబర్‌ నిలబడతా. పోరాడి సాధించుకున్న తెలంగాణలో దగా పడుతున్న ప్రజల కోసం పోరాడతా.

బరాబర్‌ నిలబడతా

  • దగాపడుతున్న ప్రజల కోసం పోరాడతా.. 
  • బాంచన్‌ దొర అంటూ జనం బతుకుతున్నారు
  • కేసీఆర్‌ దొర కాలి కింద నలిగిపోతున్న తెలంగాణ ఆత్మగౌరవం
  • ప్రశ్నించే పార్టీల్లేవ్‌.. అందుకే వస్తున్నా..
  • రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆరు వేల మంది రైతుల ఆత్మహత్య
  • వైఎస్‌ జయంతి జూలై 8న కొత్త పార్టీ
  • ఆ రోజే జెండా, ఎజెండా ప్రకటిస్తా
  • సంక్షేమ రాజ్యాన్ని తిరిగి స్థాపిద్దాం
  • 15న నిరుద్యోగుల కోసం భరోసా దీక్ష
  • ఖమ్మం సంకల్ప సభలో వైఎస్‌ షర్మిల

ఖమ్మం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ‘బరాబర్‌ నిలబడతా. పోరాడి సాధించుకున్న తెలంగాణలో దగా పడుతున్న ప్రజల కోసం పోరాడతా. తెలంగాణలో వైఎ్‌సఆర్‌ సంక్షేమ రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తా. నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు. ప్రజల బాణాన్ని. ప్రజలకు అండగా నిలబడతా. వారి కోసం పోరాడతా’ అని మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల సంకల్పం బూనారు. తెలంగాణలో కేసీఆర్‌ దొర పాలన సాగుతోందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ దొర ఇంటికే పరిమితమయ్యాయని, తెలంగాణ సాధించిన ఫలాలు ప్రగతిభవన్‌ గేటు దాటడం లేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల రీడిజైన్లు పేరుతో నిధులు దండుకుంటున్నారని, తల తోక తీసేసి ప్రాజెక్టులు కట్టి కమీషన్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టే ఏర్పాట్లలో ఉన్న షర్మిల శుక్రవారం ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్‌లో సంకల్ప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం కేసీఆర్‌ దొర కాలికింద నలిగిపోతోందని, రాష్ట్రంలో ప్రశ్నించే పార్టీలు లేవని, కేవలం ప్రశ్నించడం కోసమే తాను పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. 


దివంగత వైఎ్‌సఆర్‌ జయంతి జూలై 8న తాను పెట్టబోయే కొత్త పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటిస్తానని చెప్పారు. అధికారం, పదవులు ఉన్నా లేకపోయినా.. ప్రజపక్షాన నిలిచి, వారి కోసం పోరాడి.. తిరిగి ప్రజాసంక్షేమ పాలన తీసుకొస్తానన్నారు. అందుకు అందరూ తనను, తాను పెట్టబోయే పార్టీని ఆదరించాలని కోరారు. వైఎస్‌ సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి.. అన్నివర్గాల ప్రజలకు తెలంగాణ ఫలాలను అందిద్దామన్న ఆమె.. అందుకోసం తాను సంకల్పం తీసుకుంటున్నానని చెప్పారు. తాను తెలంగాణ బిడ్డనని, ఈ గడ్డమీదే పుట్టానని, ఈ గడ్డమీదే చదివానని, ఇక్కడే తాను పిల్లలను కన్నానని, ఈ గడ్డ రుణం తీర్చుకుంటానంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. ఎన్నో ఆశలు, ఆశయాలతో తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, బాంచన్‌ దొర అంటూ ప్రజలు బతుకుతున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రశ్నించే పరిస్థితిలో లేదని, పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ పార్టీకి అందించే కంపెనీగా మారిపోయిందని విమర్శించారు. బీజేపీ మాటలు చెప్పడం తప్ప చేతల్లో ఏదీ చూపడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదని, తెలంగాణకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదంటూ ధ్వజమెత్తారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, తాను టీఆర్‌ఎస్‌ చెబితేనో, బీజేపీ అడిగితేనే, కాంగ్రెస్‌ పంపిస్తేనో రాలేదని స్పష్టం చేశారు. తాను రాజన్న బిడ్డనని, ఎవరి కింద పనిచేయనని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోనన్నారు. తమ పార్టీలో నేటి కార్యకర్తలే రేపటి నాయకులని ఆమె చెప్పారు. 


త్యాగాలకు విలువలేకుండా పోయింది

‘కేసీఆర్‌ పాలనలో కౌలు రైతులకు గుర్తింపులేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందడంలేదు. పేదవాడికి వైద్యం లేదని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. మహిళలకు వడ్డీలేని రుణం అంటూ అధిక వడ్డీకి దోచుకుంటున్నారు. ఇంటికో ఉద్యోగం రాలేదని, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 108 లాంటి అంబులెన్సులు కనిపించడంలేదు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల హామీలు నెరవేరలేదు. ముస్లింలకు 12% రిజర్వేషన్‌ హామీ నెరవేర్చలేదు. తెల్ల రేషన్‌కార్డు లేని వారికి కార్డు ఇవ్వడంలేదు. పింఛన్లు మంజూరు చేయడంలేదు’ ఇలా కేసీఆర్‌ ఇచ్చిన ఏ హామీ సక్రమంగా అమలు కావడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటిని ప్రశ్నించేందుకు తెలంగాణలో పార్టీ అవసరమని, ‘బరాబర్‌ పార్టీ పెడతా, కేసీఆర్‌ను నిలదీస్తా.. ప్రజల పక్షాన పోరాడి అధికారంలోకి వస్తాం’ అంటూ స్పష్టం చేశారు. 


నిరుద్యోగ యువకులు మరణిస్తుంటే, కొవిడ్‌ కష్టాల్లో ప్రజల ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వానికి సోయి లేదని, భౌతికంగా తెలంగాణ సాధించుకున్నా.. ప్రజల ఆకాంక్ష మాత్రం నెరవేర్చలేకపోయారని, తెలంగాణ కోసం పోరాడిన ఎంతో మంది అమరులయ్యారని, వారి త్యాగాలు ఫలించలేదని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన తర్వాత కూడా 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ ఉందని అన్నారు. పోడు భూముల కోసం గిరిజనులు, పోరాడుతున్నా, చనిపోతున్నా కనీసం స్పందించే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే బెదిరించి ఓట్లు వేయించుకున్నారని, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్‌ ఎడమ కాలుకింద నలిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుబానికి తెలంగాణ బానిస అయిందని, దొర చెప్పింది వినడం తప్ప, ప్రశ్నించే వారు లేరని ఆమె అన్నారు. 


కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన

షర్మిల నిర్వహించిన సంకల్ప సభలో అటు పోలీసులు, ఇటు నాయకులు కొవిడ్‌ నిబంధనలను పాటించలేదు. ఆరు వేల మందితో నిర్వహించాల్సిన సభకు 15 వేలకు పైగానే హాజరైనట్టు అంచనా. మాస్కులు పెట్టుకోవాలని, శానిటైజర్లు వాడాలని సభావేదిక నుంచి నాయకులు ఒకటి రెండుసార్లు కోరారు. స్టేజీ పైన ఉన్న వారే మాస్కులు ధరించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సభా స్థలంలో ఎక్కువ మంది ఉండటంతో కొంతమందిని పోలీసులు బయట నిలిపివేశారు. దీంతో కొండా రాఘవరెడ్డి సభావేదిక పై నుంచే పోలీసు శాఖ వారికి విజ్ఞప్తితో పాటు హెచ్చరికలు చేశారు. 


అధికారమిస్తే వైఎస్‌ సంక్షేమ పాలన

మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా తెలంగాణ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించేందుకు తాను వస్తున్నానని షర్మిల చెప్పారు. అధికారం ఇస్తే వైఎస్‌ సంక్షేమ పాలన సాగిస్తా.. లేదంటే ప్రజల పక్షాన, ప్రజల కోసం ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. ఉద్యమాల గుమ్మం ఖమ్మంలో శిరస్సు వంచి చేతులు జోడించి చెబుతున్నానంటూ తన ప్రసంగాన్ని సాగించారు. ఏప్రిల్‌ 9న 18 ఏళ్లక్రితం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థాన యాత్రను ప్రారంభించారని, ఇదే రోజున తాను ఖమ్మం నుంచి తెలంగాణలో రాజన్న రాజ్యం సాధించేందుకు తొలి అడుగు వేస్తున్నానని గుర్తు చేశారు.  అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో తన తండ్రి పాలన సాగించారని చెప్పుకొచ్చారు. ఎవరికి ఏకష్ట వచ్చినానేనున్నానంటూ భరోసా కల్పించిన నేత వైఎ్‌సఆర్‌ అని కొనియాడారు. ప్రజలు ఎప్పుడొచ్చినా కలుసుకుని, వారి కష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రిగా వైఎస్‌ వారి సమస్యలు పరిష్కరించేవారని చెప్పారు. 


ఏ నిరుద్యోగీ చనిపోవద్దు.. అండగా ఉంటాం

తెలంగాణలో లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేవరకు, నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేవరకు పోరాడుదాం. ఏ ఒక్క నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవద్దు. నేను భరోసాగా ఉన్నాను. నిరుద్యోగులకు అండగా ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో నిరాహార దీక్ష చేస్తా. ఆ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో మా అభిమానులు, కార్యకర్తలు రిలే దీక్షలు చేస్తారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోతే రాబోయే మన ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం తప్పక ఉంటుంది. అప్పటి వరకు ఓపిక పట్టాలి. రాజన్న రాజ్యం వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.     

 షర్మిల 

Updated Date - 2021-04-10T07:49:55+05:30 IST