మహారాష్ట్రలోనూ జైలు పర్యాటకానికి శ్రీకారం

ABN , First Publish Date - 2021-01-24T11:21:43+05:30 IST

మీరు జైలులో గడపడానికి డబ్బు చెల్లించాలా? అవును అంటోంది మహారాష్ట్ర సర్కారు...

మహారాష్ట్రలోనూ జైలు పర్యాటకానికి శ్రీకారం

ముంబై (మహారాష్ట్ర): మీరు జైలులో గడపడానికి డబ్బు చెల్లించాలా? అవును అంటోంది మహారాష్ట్ర సర్కారు. గణతంత్ర దినోత్సవం జనవరి 26వతేదీన మహారాష్ట్ర ప్రభుత్వం జైలు పర్యాటకానికి శ్రీకారం చుట్టబోతోంది. తెలంగాణలోని సంగారెడ్డి జైలు పర్యాటకం, ఢిల్లీలో తీహార్ జైలు తరహాల్లో పూణే నగరంలోని యరవాడ జైలులో జైలు టూరిజం ప్రారంభించాలని నిర్ణయించినట్లు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వెల్లడించారు. యరవాడ జైలులో పర్యాటక ప్రాజెక్టును సీఎం ఉద్ధవ్ ఠాక్రే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లు ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. స్వతంత్ర సమరయోధులున్న యరవాడ జైలు పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని మంత్రి దేశ్ ముఖ్ తెలిపారు.


విద్యార్థులు, సాధారణ పురుషులు, మహిళలు కూడా జైలులో గడిపేందుకు డబ్బు చెల్లించవచ్చు. మహారాష్ట్ర జైళ్లలో జైలు పర్యాటక ప్రాజెక్టు చేపట్టడం చరిత్రాత్మక సంఘటన అని మంత్రి వివరించారు. అనంతరం రెండు,మూడు దశల్లో నాసిక్, నాగపూర్ జైళ్లలోనూ పర్యాటక ప్రాజెక్టులు చేపడతామని మంత్రి వెల్లడించారు. జైళ్లలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని మంత్రి చెప్పారు.  

Updated Date - 2021-01-24T11:21:43+05:30 IST