మీ ధన దాహానికి ప్రకృతిని బలిచేస్తారా?

ABN , First Publish Date - 2022-07-14T08:40:25+05:30 IST

మీ ధన దాహానికి ప్రకృతిని బలిచేస్తారా?

మీ ధన దాహానికి ప్రకృతిని బలిచేస్తారా?

పిండి చేసిన కొండలను మళ్లీ తేగలరా?

జగన్‌పై చంద్రబాబు మండిపాటు

రుషికొండను బోడికొండ చేస్తున్నారు

‘కాలజ్ఞానం’ రవ్వలకొండనూ తవ్వేశారు

భారతీ సిమెంట్స్‌ కోసం భమిడికలొద్ది నుంచి రోజూ వెయ్యి లారీల్లో లేటరైట్‌

వద్దని ఎన్‌జీటీ ఆదేశాలిచ్చినా బేఖాతరు

కుప్పం పరిధిలో గ్రానైట్‌ కొండల తవ్వకం

మడ అడవులనూ నరికివేస్తున్నారు

రాష్ట్రంలో 75చోట్ల అక్రమ తవ్వకాలు

వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిక


అమరావతి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఆయన పార్టీ నేతలు తమ ధనదాహానికి రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా పిండి అవుతున్న కొండలపై ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం మాట్లాడారు. కొండలను అడ్డగోలుగా తవ్వేయడం.. అడవులను నరికివేయడం.. అక్రమంగా ఖనిజ సంపదను తవ్వుకుపోవడం వంటివి.. అధికారంలో ఉన్న పెద్దలు కనీవినీ ఎరుగని స్థాయిలో చేస్తున్నారని అన్నారు. ప్రజల సంపదకు ట్రస్టీగా ఐదేళ్లపా టు వ్యవహరించాల్సిన పెద్ద లు తామే దోచుకోవడం రా ష్ట్రం దౌర్భాగ్యమన్నారు. ‘రుషికొండ విశాఖ నగరానికి మణిహారం. పచ్చని ప్రకృతితో నగరానికి శోభనిచ్చేది. దానిని ఇప్పుడు అడ్డగోలుగా తవ్వేసి బోడికొండగా మార్చేశారు. తవ్వకం ఆపాలని ఎన్‌జీటీ ఆదేశిస్తే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇది ఒక్క విశాఖ సమస్యే కాదు. మన భావితరాల సమస్య. నేను అక్కడకు వెళ్తానంటే అడ్డుకున్నారు గానీ కొండ నాశనాన్ని అడ్డుకోగలిగారా? కర్నూలు జిల్లాలో రవ్వలకొండను విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం వారు పవిత్రంగా భావిస్తారు. ఆ కొండను కూడా తవ్వేశారు. తవ్వినవారి జోలికి వెళ్లకుండా తవ్వకాలను చూడడానికి వెళ్లినవారిపై ప్రభుత్వం కేసులు పెట్టింది. మన్యంలోని భమిడికలొద్ది నుంచి రోజూ వెయ్యి లారీల్లో లేటరైట్‌ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి భారతీ సిమెంట్స్‌కు పంపిస్తున్నారు. నా నియోజకవర్గం కుప్పం పరిధిలోని శాంతిపురంలో విలువైన గ్రానైట్‌ కొండలను అక్రమంగా తవ్వేస్తున్నారు. నేను చూడటానికి వెళ్తే రౌడీయిజంతో ఆపాలని చూశారు. ఆ స్థలాన్ని యూనివర్సిటీకి ఇచ్చి అందులో మూలికల మొక్కలు పెంచాలని మేం అనుకున్నాం. ఆ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఇప్పుడు దగ్గరుండి మరీ అక్రమ తవ్వకాలు జరిపిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎంత తవ్విందీ గూగుల్‌ మ్యాప్స్‌లో వస్తాయి. తప్పించుకుంటామనుకోవద్దు’ అని హెచ్చరించారు.


మడ అడవులనూ వదలడం లేదు..

తుఫాన్లకు, ఉప్పెనలకు మొదటి రక్షణ కవచంగా ఉండే మడ అడవులను కూడా వదిలిపెట్టని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో తాండవిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ‘మేం ఉన్నప్పుడు కాకినాడలో మడ అడవులను ఎంతో జాగ్రత్తగా కాపాడాం. ఇప్పుడు వాటిని ఇష్టానుసారం తవ్వేస్తుంటే అటవీ శాఖ అధికారులు కిక్కురుమనడం లేదు. ఏకంగా అడవులనే నరికివేస్తుంటే వారేం చేస్తున్నారు? ఉద్యోగాలు చేయడం లేదా? మీ ఆత్మలు చచ్చిపోయాయా’ అని ధ్వజమెత్తారు. ఇసు క మాఫియా తవ్వకాల వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపో యి ఏకంగా 62 మంది చనిపోతే ఏ చర్యలూ లేవని ఆక్షేపించారు. విదేశాల్లో మాదిరిగా హైవేపై వెళ్తుంటే విజయనగరం జిల్లా నెల్లిమర్ల ప్రాంతంలో కొండలు పచ్చగా ఆహ్లాదంగా ఉండేవని, వాటిని కూడా తుడిచిపెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా బండపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి కొండలను చెరువులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం 75 చోట్ల ఇటువంటి అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిం దని ఆయన వెల్లడించారు. ‘నేను అన్నీ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మైనింగ్‌, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులూ.. ఆలోచన చేయండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ముందుకు రావాలి. చర్యలు తీసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎవరెక్కడున్నా తప్పు చేసిన అందరినీ చట్టం ముందుకు తెస్తాం’ అని చెప్పారు.  


అక్రమాల ఫొటోలతో ఎగ్జిబిషన్‌..

పలు జిల్లాల్లో పిండి అవుతున్న కొండల ఫొటోలు, వాటి వెనుక ఉన్న అధికార పార్టీ నేతల పేర్లతో ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా బండపల్లిలో కొండలను మాయం చేసిన మంత్రి పెద్దిరెడ్డి ముఠా, కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అక్రమ మైనింగ్‌కు సాక్ష్యంగా నిలిచిన చిన్న కొండ ముక్క, కుప్పంలో పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్‌, కర్నూలు జిల్లాలో రవ్వలకొండను తొలుస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ముఠా, విశాఖ మన్యంలోని భమిడికలొద్దిలో వైవీ సుబ్బారెడ్డి-భారతీ సిమెంట్స్‌ కోసం లేటరైట్‌, బాక్సైట్‌ దోపిడీ, వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఇసుక మాఫియాకు కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యాం, పట్టిసీమ కాల్వ కుడిగట్టును మింగేసిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పొన్నూరు నియోజకవర్గం అనమర్లపూడిలో చెరువును కబళించిన వైసీపీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య అంటూ వారి పేర్లతో ఈ ఫొటోలు పెట్టారు. ఇంకా మరికొన్ని జిల్లాల్లోని అక్రమ తవ్వకాల ఫొటోలను కూడా పెట్టారు.

Updated Date - 2022-07-14T08:40:25+05:30 IST