చర్యలు తీసుకుంటారా.. వెనకేసుకొస్తారా?

ABN , First Publish Date - 2022-09-15T05:27:39+05:30 IST

పట్టణంలోని ఓ పోలీసు స్టేషనలో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ నుంచి పిలుపు వచ్చింది.

చర్యలు తీసుకుంటారా.. వెనకేసుకొస్తారా?

- ముగ్గురు కానిస్టేబుళ్లకు ఎస్పీ నుంచి పిలుపు

- అవినీతి ఆరోపణలే కారణమా? 

- కాపాడేందుకు

కీలక అధికారి విశ్వప్రయత్నాలు

హిందూపురం, సెప్టెంబరు 14: పట్టణంలోని ఓ పోలీసు స్టేషనలో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ నుంచి పిలుపు వచ్చింది. వెంటనే జిల్లా కేంద్రానికి రావాలని ఆదేశించారు. వీరిపై అవినీతి ఆరోపణలు రావడంతోనే పిలుపు వచ్చినట్లు సమాచారం. వీరిపై వేటుపడుతుందా? జస్ట్‌ వార్నింగ్‌ ఇచ్చి, వెనకేసుకొస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఇక్కడి నుంచి బదిలీ అయిన అధికారి వెళ్లడానికి కారణం వీరేనని ఆ శాఖలో చర్చ సాగుతోంది. పట్టణంలో జరిగే అసాంఘిక కార్యకలాపాల్లో వీరి హస్తం ఉన్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయనీ, ఈ నేపథ్యంలోనే వీరిపై కొన్ని రోజులుగా నిఘా ఉంచి జిల్లా కేంద్రానికి పిలిపించినట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి పిలిచిన ముగ్గురిలో హెడ్‌ కానిస్టేబుల్‌ చాలా రోజులుగా హిందూపురంలో పనిచేస్తున్నారు. గతంలో ఆయనపై ఆరోపణలు వచ్చినా.. అప్పట్లో కొంతమంది ఉన్నతాధికారుల సహకారంతో తప్పించుకోగలిగారని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈసారి వీరిని జిల్లాకేంద్రానికి పిలవడం హిందూపురం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. 


అధికార పార్టీ నాయకుల ద్వారా ఒత్తిళ్లు


ముగ్గురు కానిస్టేబుళ్లను జిల్లాకేంద్రానికి పిలవడంతో అధికార పార్టీ నాయకుల చెంతకు చేరారు. ఈసారి తమను రక్షించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ నాయకులతో ఉన్న సంబంధాలను దీనికి ఉపయోగించుకుంటున్నారని చర్చ సాగుతోంది. పైముగ్గురికి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు ఆ శాఖలోని నిఘా వర్గం పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు కారణం పట్టణంలో సాగే కొన్ని అక్రమ వ్యవహారాలతో వీరికి సంబంధాలున్నట్లు పోలీసులే బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం. ఆ శాఖలో కీలకమైన జిల్లా అధికారి ఒకరు వీరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనీ, ఇందుకోసం గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన ఉన్నతాధికారుల నుంచి కీలక అధికారికి చెప్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటారా, వెనకేసుకొస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మరో పోలీసు స్టేషనలో పనిచేస్తున్న వారిలో ఒకరిద్దరిని జిల్లా కేంద్రానికి ఈ వారంలో పిలిచే అవకాశాలున్నట్లు సమాచారం. పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో వీరిపై చర్యలకు ఉపక్రమించే అవకాశాలున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


అవినీతి ఆరోపణలే కారణమా? 


పట్టణంలోని ఓ పోలీసు స్టేషనలో పనిచేస్తున్న ముగ్గురిని మూడు రోజుల వ్యవధిలో జిల్లా కేంద్రానికి రావాలని ఉన్నతాధికారులు ఆదేశించడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే పిలిపించారా అనే ప్రశ్న మొదలైంది. వారిపై చర్యలు తీసుకుంటారో, లేదో.. వేచిచూడాల్సిందే. 


Updated Date - 2022-09-15T05:27:39+05:30 IST