కల నిజమాయెనే!

ABN , First Publish Date - 2021-07-11T08:07:26+05:30 IST

టాప్‌ సీడ్‌ బార్టీ చిన్ననాటి కల నెరవేరింది. బాలికగా జూనియర్‌ టైటిల్‌ను ముద్దాడిన చోటే.. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా మురిసింది.

కల నిజమాయెనే!

వింబుల్డన్‌ చాంప్‌ బార్టీ

ఫైనల్లో ప్లిస్కోవాపై విజయం



టాప్‌ సీడ్‌ బార్టీ చిన్ననాటి కల నెరవేరింది. బాలికగా జూనియర్‌ టైటిల్‌ను ముద్దాడిన చోటే.. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా మురిసింది.  చెక్‌ భామ ప్లిస్కోవాతో టైటిల్‌ పోరులో మధ్యలో కొద్దిగా తడబడినా.. ఆద్యంతం అదరగొట్టిన బార్టీ.. చిరస్మరణీయ విజయాన్ని  సొంతం చేసుకొంది. 41 ఏళ్ల తర్వాత గ్రాస్‌కోర్టు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియన్‌గా మెరిసింది. 

2011

గూలగాంగ్‌ నుంచి ఎంతో స్ఫూర్తి పొందిన బార్టీ.. ఆమెకు నివాళిగా 1971లో గూలగాంగ్‌ తొలిసారి టైటిల్‌ నెగ్గినప్పుడు వేసుకొన్నఅవుట్‌ ఫిట్‌ తరహా జెర్సీని ధరించి ఫైనల్లో బరిలోకి దిగింది. 

2012 తర్వాత వింబుల్డన్‌ మహిళల ఫైనల్‌ మూడు సెట్లపాటు జరగడం ఇదే మొదటిసారి. 


లండన్‌: హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచింది. 2011లో బాలికల టైటిల్‌ నెగ్గిన చోటే.. గ్రాస్‌కోర్టు గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ బార్టీ 6-3, 6-7(4), 6-3తో 8వ సీడ్‌ కరోలినా ప్లిస్కోవాపై అద్భుత విజయం సాధించింది. 1980లో ఎవన్నీ గూలగాంగ్‌ తర్వాత గ్రాస్‌కోర్టులో టైటిల్‌ నెగ్గిన తొలి ఆస్ట్రేలియన్‌గా బార్టీ రికార్డులకెక్కింది. 2019 ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజయం తర్వాత కొంత విరామం తీసుకున్న వరల్డ్‌ నంబర్‌ వన్‌ బార్టీ.. కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అందుకుంది. భారీ సర్వీస్‌లతో ప్రత్యర్థులను బెంబేలెత్తించే చెక్‌ ప్లేయర్‌ ప్లిస్కోవా.. టైటిల్‌ పోరులో స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేక మరోసారి రన్నర్‌పగా సరిపెట్టుకుంది. 2016లో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో జర్మన్‌ క్రీడాకారిణి కెర్బర్‌ చేతిలో కరోలినా ఓడింది.


ఆది నుంచే జోరు..:


మ్యాచ్‌  ఆరంభం నుంచే బార్టీ దూకుడుగా ఆడడంతో.. ప్లిస్కోవా తడబడింది. తొలి సెట్‌ను ఏకపక్షం చేసిన బార్టీ 6-3తో సొంతం చేసుకుంది. కానీ, రెండో సెట్‌లో ప్లిస్కోవా పుంజుకోవడంతో.. బార్టీ వెనుకంజ వేసింది. ఇద్దరూ తమతమ సర్వీ్‌సలను నిలబెట్టుకోవడంతో 5-5తో సమంగా నిలిచారు. అయితే, 11వ గేమ్‌లో చెక్‌ ప్లేయర్‌ సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన బార్టీ 6-5తో పైచేయి సాధించింది. కానీ, తర్వాతి గేమ్‌లో ఆష్లే సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన ప్లిస్కోవా.. 6-6తో సెట్‌ ఫలితాన్ని టైబ్రేక్‌కు తీసుకెళ్లింది. ఇందులో  కరోలినా 7-4తో నెగ్గింది. ఇక నిర్ణాయక మూడో సెట్‌లో బార్టీ మళ్లీ దూకుడు ప్రదర్శించడంతో పూర్తిగా ఏకపక్షమైంది. రెండో గేమ్‌లోనే ప్లిస్కోవా సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన బార్టీ 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, 5-3 ఆధిక్యంతో సర్వీస్‌ చేసిన బార్టీని అడ్డుకొనేందుకు ప్లిస్కోవా తీవ్రంగా ప్రయత్నించింది. తొమ్మిదో గేమ్‌లో 40-30తో ప్లిస్కోవా పైచేయి ప్రదర్శించినా.. అనవసర తప్పిదంతో పాయింట్‌ కోల్పోయింది. స్కోరు సమం చేసిన ఆష్లే.. ఏస్‌తో చాంపియన్‌షి్‌ప పాయింట్‌పై నిలిచింది. ఆ తర్వాత సర్వ్‌లో ప్లిస్కోవా షాట్‌ నెట్‌కు తగలడంతో బార్టీ గెలుపు సంబరాలు చేసుకుంది. 


ప్రైజ్‌ మనీ 

బార్టీకి రూ. 17.60 కోట్లు

ప్లిస్కోవాకు రూ. 9.32 కోట్లు


బార్టీ  ప్లిస్కోవా

7    ఏస్‌లు        6

7 డబుల్‌ ఫాల్ట్‌లు        5

30    విన్నర్లు        27

29 అనవసర తప్పిదాలు  32

Updated Date - 2021-07-11T08:07:26+05:30 IST