మాంసం ధరలకు రెక్కలు

ABN , First Publish Date - 2021-04-14T06:23:01+05:30 IST

చికెన్‌, మటన్‌, ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ముక్క తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. కొద్దిరోజులుగా మాంసం ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

మాంసం ధరలకు రెక్కలు

రోజురోజుకూ పెరుగుతున్న ధరలు

సూర్యాపేటటౌన్‌, ఏప్రిల్‌ 13: చికెన్‌, మటన్‌, ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ముక్క తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. కొద్దిరోజులుగా మాంసం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కిలో చికెన్‌ ధర రూ.280 పలుకుతుండగా, మటన్‌ ధర రూ.800 ఉంది. వారానికోసారి కేజీ మాంసం కొనుగోలు చేసేవారు ప్రస్తుత ధరలతో అరకేజీతో సరిపెట్టుకుంటున్నారు. అసలే కరోనా కాలం. రోగ నిరోధకశక్తి పెంచుకోవడానికి తినాలన్నా జంకాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. ధరలు పెరుగుదలకు వేసవిలో బాయిలర్‌ కోళ్లు చనిపోవడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు.  

తగ్గిన విక్రయాలు

జిల్లాలో మాంసం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ధరలు పెరిగిన కారణంగా విక్రయాలు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. జిల్లా కేంద్రంలో 150 నుంచి 180 చికెన్‌ విక్రయ దుకాణాలు ఉండగా నెలరోజుల క్రితం 3వేల కిలోల మాంసం ఆదివారం, సెలవు రోజుల్లో విక్రయించేవారు. ధరలు పెరగడంతో 2వేల కిలోలలోపే విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, తిరుమలగిరి మునిసిపాలిటీలతో పాటు జిల్లావ్యాప్తంగా గతంలో 13వేల కిలోల నుంచి 15వేల కిలోల వరకు మాంసం విక్రయాలు అవుతుండగా, ప్రస్తుతం 8వేల నుంచి 10వేలలోపు మాంసం విక్రయాలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో గతంలో 5వేల కిలోల మాంసం విక్రయాలు జరగ్గా, ప్రస్తుతం 3వేల నుంచి 4వేల కిలోలలోపు చికెన్‌ విక్రయాలు జరుగుతున్నాయి. చికెన్‌ ధర కూడా వారం క్రితం కిలో రూ.150 నుంచి 180లోపు ఉంటే ప్రస్తుతం రూ.250 నుంచి 280 దాకా పలుకుతోంది. గతంలో మటన్‌ ధర రూ.600 నుంచి 750 ఉంటే ఇప్పుడు రూ.800కు చేరుకుంది. 


ధరలు పెరగడంతో కొనలేక పోతున్నాం : వెంకటేష్‌, పట్టణ వాసి 

మాంసం ధరలు పెరగడంతో కొనుగోలు చేయలేకపోతున్నాం. ముఖ్యంగా ఆదివారం వస్తే చికెన్‌ కేజీ కొనేవాళ్లం. కానీ, ప్రస్తుతం ధరలు పెరగడంతో దాన్ని అరకిలోకే పరిమితం చేయాల్సి వచ్చింది. 


చికెన్‌ ధరలు గత నెలలో వారం క్రితం ప్రస్తుతం

లైవ్‌ 80 120 140

డ్రెస్స్‌డ్‌ 130 160 240

స్కిన్‌లెస్‌ 150 180 260

Updated Date - 2021-04-14T06:23:01+05:30 IST