కోవిడ్-19 సంక్షోభం : రూ.1,125 కోట్లు కేటాయించిన విప్రో, ప్రేమ్‌జీ ఫౌండేషన్

ABN , First Publish Date - 2020-04-01T20:30:27+05:30 IST

కోవిడ్-19 సృష్టించిన అనూహ్యమైన ఆరోగ్య, మానవ సంబంధ సంక్షోభం పరిష్కారంలో విప్రో సంస్థలు భాగస్వాములవుతున్నాయి.

కోవిడ్-19 సంక్షోభం : రూ.1,125 కోట్లు కేటాయించిన విప్రో, ప్రేమ్‌జీ ఫౌండేషన్

బెంగళూరు : కోవిడ్-19 సృష్టించిన అనూహ్యమైన ఆరోగ్య, మానవ సంబంధ సంక్షోభం పరిష్కారంలో విప్రో సంస్థలు భాగస్వాములవుతున్నాయి. బుధవారం ఈ సంస్థలు ఓ ప్రటనలో తెలిపిన వివరాల ప్రకారం కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్య, సేవా సిబ్బందికి సహాయపడేందుకు రూ.1,125 కోట్లు కేటాయించారు. ఈ మహమ్మారి వల్ల మానవులపై పడుతున్న ప్రభావాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా అత్యంత అట్టడుగున ఉన్నవారి సంక్షేమం కోసం ఈ నిధులను ఖర్చు చేస్తారు. 


నిర్దిష్ట ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సమగ్ర చర్యలు, తక్షణ మానవతావాద సహాయాన్ని అందజేయడం, ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాల అభివృద్ధి, కోవిడ్-19 మహమ్మారి నియంత్రణ, ఈ మహమ్మారిబారినపడినవారి చికిత్స వంటివాటికోసం ఈ నిధులను వెచ్చిస్తారు. 


ఈ కార్యక్రమాల అమలుకు సంబంధిత ప్రభుత్వ శాఖల సహకారం తీసుకుంటారు. అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు చెందిన 1,600 మంది బృందం, 350కి పైగా పౌర సమాజ భాగస్వాములు దేశవ్యాప్తంగా సమన్వయంతో పని చేస్తారు. 


విప్రో లిమిటెడ్ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ.25 కోట్లు, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.1,000 కోట్లు కేటాయించాయి. ఈ సంస్థలు సామాజిక బాధ్యత క్రింద ప్రతి సంవత్సరం ఖర్చు చేసే నిధులకు ఈ కేటాయింపులు అదనం. 


Updated Date - 2020-04-01T20:30:27+05:30 IST