విప్రో.. వావ్‌

ABN , First Publish Date - 2021-01-14T06:38:45+05:30 IST

వర్తమాన ఆర్థిక సంవత్సరంలో డిసెంబరుతో ముగిసిన మూడో త్రై మాసికానికి విప్రో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.2,968 కోట్లకు చేరుకుంది. 2019-20లో ఇదే కాలానికి ఆర్జించిన రూ.2,455.9 కోట్ల లాభంతో

విప్రో.. వావ్‌

క్యూ3 లాభం రూ.2,968 కోట్లు 

వార్షిక ప్రాతిపదికన 21% వృద్ధి

ఒక్కోషేరుపై రూ.1 డివిడెండ్‌ 

దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మురిపించాయి. గతవారంలో ఈ ఫలితాల సీజన్‌కు బోణీ కొట్టిన టీసీఎస్‌ ఆశాజనక పనితీరును కనబర్చగా.. తాజాగా విడుదలైన ఇన్ఫోసిస్‌, విప్రో గణాంకాలు విశ్లేషకుల అంచనాలను మించిపోయాయి.


వర్తమాన ఆర్థిక సంవత్సరంలో  డిసెంబరుతో ముగిసిన మూడో త్రై మాసికానికి విప్రో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.2,968 కోట్లకు చేరుకుంది. 2019-20లో ఇదే కాలానికి ఆర్జించిన రూ.2,455.9 కోట్ల లాభంతో పోలిస్తే 20.8 శాతం వృద్ధి నమోదైంది. గడిచిన మూడు నెలల్లో కంపెనీకి కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం రూ.15,670 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాదిలో ఇదే సమయానికి నమోదైన రూ.15,470.5 కోట్ల ఆదాయంతో పోలిస్తే దాదాపు 1.3 శాతం వృద్ధి చెందింది. విప్రో రాబడిలో ఐటీ సేవలదే మెజారిటీ వాటా. కంపెనీ ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు.. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి-మార్చి)లో ఐటీ సేవల ఆదాయం 210.2-214.3 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండవచ్చని విప్రో అంచనా. అంటే, క్యూ3లో ఆర్జించిన 207.1 కోట్ల డాలర్ల రెవెన్యూతో పోలిస్తే 1.5-3.5 శాతం వృద్ధి నమోదుకావచ్చని కంపెనీ భావిస్తోంది. 

క్యూ3లో ఐటీ సేవల ఆదాయం త్రైమాసిక  ప్రాతిపదికన 1.5-3.5 శాతం వృద్ధి చెంది 202.2-206.2 కోట్ల డాలర్ల స్థాయిలో నమోదుకావచ్చని క్యూ2 ఫలితాల విడుదల సందర్భంగా విప్రో అంచనా వేసింది. వాస్తవ ఆర్జన కంపెనీ అంచనాలను మించి 3.9 శాతం వృద్ధి చెందింది. గడిచిన 36 త్రైమాసికాల్లో కంపెనీ డాలర్‌ ఆదాయంలో ఇదే అత్యధిక వృద్ధి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ తన వాటాదారులకు రూ.2 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుకు రూపాయి మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. డివిడెండ్‌ చెల్లింపులకు రికార్డు తేదీని ఈనెల 25గా నిర్ణయించింది. ఫిబ్రవరి 2లోగా లేదా ఆ రోజున వాటాదారులకు డివిడెండ్‌ చెల్లించనుంది. 



వరుసగా రెండు త్రైమాసికాలపాటు కంపెనీ పటిష్ఠమైన పనితీరును కనబర్చింది. మెరుగైన ఆర్డర్‌ బుకింగ్‌, రెవెన్యూ, మార్జిన్లు ఇందుకు దోహదపడ్డాయి. ఐదింటిలో నాలుగు సేవల విభాగాలు త్రైమాసిక ప్రాతిపదికన 4 శాతానికి పైగా వృద్ధిని కనబర్చాయి. కాంటినెంటల్‌ యూరప్‌ మార్కెట్లో కంపెనీ అతిపెద్ద కాంట్రాక్టును చేజిక్కించుకుంది. ఐటీ సేవల డిమాండ్‌ నిలకడగా వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా, డిజిటల్‌ పరివర్తనం, డిజిటల్‌ కార్యకలాపాలు, క్లౌడ్‌ సేవలకు డిమాండ్‌ అధికంగా ఉంది. 

థియరీ డెలాపోర్ట్‌, విప్రో సీఈఓ, ఎండీ 

Updated Date - 2021-01-14T06:38:45+05:30 IST